జగన్ పాపాలతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:26 AM
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన పాపాలు శాపాలుగా మారి రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయని, అభివృద్ధి సాధనకు ఆటంకాలుగా మారాయని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు దుయ్యబట్టారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు
బొబ్బిలి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన పాపాలు శాపాలుగా మారి రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయని, అభివృద్ధి సాధనకు ఆటంకాలుగా మారాయని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు దుయ్యబట్టారు. సోమవారం స్థానిక కోటలో ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి జగన్‌తీరుపై విరుచుకుపడ్డారు. రూ.40 వేల కోట్ల కుంభకోణంలో అరెస్టు అయిన జగన్ 12 ఏళ్లుగా సీబీఐ కేసు నుంచి ఎలా తప్పించుకుని తిరగగలుగుతున్నారన్నారు. ఆయనకేమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా.. అని ప్రశ్నించారు. మళ్లీ జగన్ అధికారంలోనికి రాడనే గ్యారెంటీ ఇస్తేనే పరిశ్రమలు పెడతామని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారంటే పరిస్థితిని ఎంతలా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్‌టీపీసీ ప్రాజెక్టు, టీసీఎస్, ఉత్తారాంధ్ర సుజల స్రవంతి, రైల్వేజోన్‌కు 52 ఎకరాల కేటాయింపు, అనకాపల్లి, నక్కపల్లిలో పరిశ్రమల ఏర్పాటు వంటివి జోరుగా సాగుతున్నాయని తెలిపారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.
బహిరంగ సభకు తరలిరండి
ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని, ఈసందర్భంగా లక్ష మందితో రోడ్ షో, 3 లక్షలమందితో బహిరంగ సభ నిర్వహించన్నుట్టు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, లక్షలాదిగా తరలిరావాలని ఆయన కోరారు. చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల్లో గల 34 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేపడుతున్నామని చెప్పారు. బొబ్బిలి, చీపురుపల్లి నియోజకవర్గాల నుంచి 65 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు పాల్గొన్నారు.