budget బడ్జెట్ భరోసా నింపేనా?
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:19 AM
Is the budget satisfactory? జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు గత ఐదేళ్లలో పడకేశాయి. వేలాది ఎకరాల్లో ఆయకట్టుకు నీరు అందడం లేదు. వర్షాధారంపై సాగు చేస్తున్న రైతులు చివరకు పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇటు పరిశ్రమలూ దాదాపు తిరోగమనంలో ఉన్నాయి.

బడ్జెట్ భరోసా నింపేనా?
నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల పనులు
మూతపడిన పరిశ్రమలు
కొన్ని రహదారుల్లో ప్రయాణం నేటికీ ప్రమాదకరమే
గిరిజన వర్సిటీ భవనాలు ఎప్పటికో?
ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు కరువు
బడ్జెట్ సమావేశాలపై జిల్లా వాసుల్లో గంపెడాశలు
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు గత ఐదేళ్లలో పడకేశాయి. వేలాది ఎకరాల్లో ఆయకట్టుకు నీరు అందడం లేదు. వర్షాధారంపై సాగు చేస్తున్న రైతులు చివరకు పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇటు పరిశ్రమలూ దాదాపు తిరోగమనంలో ఉన్నాయి. జనపనార, ఫెర్రో అల్లాయూస్, చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయి. అవి తెరిస్తే వందలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. చక్కెర పరిశ్రమలు తెరుచుకుంటే చెరకు రైతులకూ ఊరట. రహదారులకు మరమ్మతులు చేపట్టినప్పటికీ పూర్తిస్థాయి నిర్మాణం కోసం కొన్ని రహదారులు ఎదురుచూస్తున్నాయి. వంతెలనలదీ ఇదే పరిస్థితి. ఇక విభజన హామీల్లో భాగంగా జిల్లాకు కేటాయించిన గిరిజన యూనివర్సిటీ భవనాలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. వైద్యం కూడా గాడిన పడలేదు. కీలక పోస్టులను భర్తీ చేయడం లేదు. మౌలిక సౌకర్యాలు లేవు. ఈ సమస్యలకు ఈసారి బడ్జెట్ సమావేశాలు పరిష్కారం చూపుతాయన్న ఆశతో జిల్లా ప్రజలున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి.
విజయనగరం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి):
కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై జిల్లా ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతుండడంతో సాగునీటి ప్రాజెక్టుల పనులు తప్పకుండా మొదలవుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమలు పునఃప్రారంభం కావొచ్చునని కార్మికులు ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని బొబ్బిలి, రాజాం, సాలూరు ప్రాంతాల్లో 20 వరకూ పరిశ్రమలు మూతపడ్డాయి. జూట్, ఫెర్రో పరిశ్రమలు దాదాపు పనిచేయడం లేదు. వీటికి కొత్త రోజులు రావచ్చునని ప్రజలు భావిస్తున్నారు. రెండు చక్కెర పరిశ్రమలు సహకార రంగంలో నడిచేవి. రెండు ఆగిపోయాయి.
రహదారులు.. వంతెనలు
జిల్లాలో అంతర్ రాష్ట్ర, జిల్లా రహదారులు ఉన్నాయి. అవి ఐదేళ్ల వైసీపీ పాలనలో దారుణంగా తయారయ్యాయి. తగరపువలస-విజయనగరం-రాజాం రహదారి ప్రధానమైనది. అలాగే విజయనగరం- పార్వతీపురం, చిలకపాలెం-పార్వతీపురం రోడ్లు సైతం దారుణంగా మారాయి. రోడ్ల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం రూ.23.52 కోట్లు మంజూరు చేసింది. మిగతా వాటి నిర్మాణంపై సైతం ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరముంది. చీపురుపల్లి రైల్వేవంతెన, పారాది వంతెన, సీతానగరం వంతెనలు పూర్తికావాల్సి ఉంది.
గిరిజన యూనివర్సిటీ..
జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయానికి నేటికీ పక్కా భవనాలు లేవు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా అప్పట్లో ఈ యూనివర్సిటీని కేటాయించారు. తొలుత శృంగవరపుకోట నియోజకవర్గంలోని రెల్లిలో స్థల ఎంపిక చేసి 2015లో సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీని దత్తిరాజేరు-మెంటాడ మండలాల్లోని సరిహద్దు ప్రాంతాలకు మార్చింది. ప్రస్తుతం 519 ఎకరాల్లో పనులు ప్రారంభించారు. నిర్మాణం శరవేగంగా జరిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
వైద్య రంగం
జిల్లాలో విద్య, వైద్య రంగాలపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ వైద్య కాలేజీ నిర్మాణం పూర్తికాలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి. వైద్యుల పోస్టులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గంలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హామీపై ఎటువంటి ప్రకటన వస్తుందోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. విద్యాపరంగా వసతులు మెరుగుపడాలి. నాడు-నేడు అంటూ గత ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల భవనాల పనులు మధ్యలో ఆగిపోయాయి.
- జిల్లాలో 27 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పదుల సంఖ్యలో మత్స్యకార గ్రామాలున్నాయి. వీటి పరిధిలో జెట్టి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మరోవైపు జిల్లాలో పర్యాటక అభివృద్ధి పడకేసింది.
బొబ్బిలి ప్రాంతంలో సాగునీటి ఇక్కట్లు
బొబ్బిలి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):
సుమారు రెండు దశాబ్దాల నుంచి వెంగళరాయసాగర్ కాలువల లైనింగ్, ఆధునికీకరణ, అదనపు ఆయకట్టు పథకాలు రైతులను ఊరిస్తూనే ఉన్నాయి. నిధుల లేమితో ఆ ప్రతిపాదనలు సుదీర్ఘంగా మొద్దునిద్రలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తోటపల్లి కాలువల నుంచి బొబ్బిలి మండలం రాముడువలస, తెర్లాం మండలం లోచర్ల, బాడంగి మండలం వాడాడ గ్రామాలకు ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించారు. శంకుస్థాపనలు కూడా జరిగాయి. పనులు అడుగు ముందుకు కదలలేదు.
- వెంగళరాయసాగర్ అదనపు ఆయకట్టుకు అవసరమైన భూసేకరణ పనులను ఏళ్లతరబడి పూర్తి చేయలేకపోయారు. కంచరగెడ్డ పనులు పూర్తి కాలేదు. ఏడొంపుల గెడ్డకు నిధులు లేవు. పెద్దగెడ్డ నుంచి రామభద్రపురం, బాడంగి మండలాలకు నీరిస్తామన్న హామీ నెరవేరలేదు. బొబ్బిలి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని వందపడకల ఆసుత్రిగా తీర్చిదిద్దుతామన్న హామీ నెరవేరాల్సి ఉంది. ఏపీఐఐసీ గ్రోత్‌సెంటరులో పారిశ్రామిక ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. కూటమి ప్రభుత్వంపై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
- ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉండే ఉద్యాన క్షేత్రం పూర్తిగా కునారిల్లిపోయింది. ఏడీ పోస్టును ఎత్తివేశారు. డిప్యూటీ డీఈఓ కార్యాలయానికి సొంతభవనం లేదు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉండే ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది.
- రామభద్రపురంలోని అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తామన్న హామీ నెరవేరాల్సి ఉంది.
అభివృద్ధికి దూరంగా విజయనగరం
విజయనగరం రూరల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రంగా వున్న విజయనగరం సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. అభివృద్ధి మాత్రం లేదు. ఆహ్లాదాన్ని పంచే పార్కులు అంతంత మాత్రం. ఇక నగర జనాభాకు సరిపడా మంచినీటి సౌకర్యం లేదు. పెద్దచెరువు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ అలాగే వుండిపోయింది. రాజీవ్‌క్రీడామైదానం, విజ్జీ స్టేడియంలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలన్నది క్రీడాకారుల డిమాండ్. విజయనగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనక్ట్ అయ్యే రహదారిని విస్తరించాల్సి ఉంది. విజయనగరం నుంచి విశాఖకు వెళ్లే ప్రత్యామ్నాయ రహదారి.. ధర్మపురి ఐస్‌ఫ్యాక్టరీ నుంచి చింతలవలస మీదుగా అయినాడ జంక్షన్ వరకూ వెళ్లే రోడ్డును కూడా విస్తరించాలి. దీని కోసం ప్రతిపాదనలున్నా వీటికి మోక్షం కలగడం లేదు.
అపరిష్కృతంగా రాజాం సమస్యలు
రాజాం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాజాం నియోజకవర్గంలో చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ముఖ్యంగా రవాణా కష్టాలు తీరడం లేదు. విజయనగరం నుంచి రాజాం మీదుగా ఉన్న పాలకొండ రోడ్డు దారుణంగా తయారైంది. విస్తరణలో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఐదేళ్లలో మాటలతో గడిపేసింది. రాజాం నియోజకవర్గంలో పరిశ్రమలు మూతపడ్డాయి. ముఖ్యంగా జనపనార పరిశ్రమలు ఒకటి రెండు తప్ప అన్నీ మూతపడ్డాయి. ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి ప్రభుత్వపరంగా చేయూతనిస్తే తెరుచుకునే అవకాశం ఉంది. రాజాం మునిసిపాల్టీకి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మేజర్ పంచాయతీ నుంచి నగరపంచాయతీగా.. ఆపై మునిసిపాల్టీగా అప్‌గ్రేడ్ అయినా.. పాలకవర్గం లేకపోవడం పట్టణ ప్రజలకు శాపంగా మారింది. అలాగే మడ్డువలస, నారాయణపురం ఆనకట్టలు, సాయన్న ఛానెల్, తోటపల్లి కాలువల ఆధునికీకరణ వంటిపై దృష్టిసారించాల్సిన అవసరముంది. మరోవైపు రాజాం మీదుగా రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ డీపీఆర్ రూపొందిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వపరంగా మారింత చొరవచూపాల్సిన అవసరం ఉంది.
---------------