అదనపు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వండి
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:22 AM
నియోజకవర్గంలో గల తోటపల్లి ప్రోజెక్టు నుంచి అదనపు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వ విప్ జగదీశ్వరి.. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు.

కురుపాం/ గుమ్మలక్ష్మీపురం/ గరుగు బిల్లి, మార్చి6(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో గల తోటపల్లి ప్రోజెక్టు నుంచి అదనపు ఆయకట్టు(గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో గల 8వేల ఎకరాలు)కు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి.. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. ఈ మేరకు గురువారం విజయవాడలో ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసి, వినతిపత్రం అందజేశారు. జంఝవతి ఆయకట్టును స్థిరీకరించి తోటపల్లి ప్రోజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో వివిధ ప్రోజెక్టుల ద్వారా ఏఏ ప్రాంతాలకు నీరు ఇవ్వవచ్చు, ఎంతమేరకు ఆయకట్టు స్థిరీకరణ చేయవచ్చు అని చర్చించినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గరుగుబిల్లి మండల అధ్యక్షుడు అక్కేన మధుసూదన్‌రావు, ఎం.పురుషోత్తమ నాయుడు, అంబటి రాంబాబు, రామకృష్ణ పాల్గొన్నారు.