Tribals... గిరిజనులతో మమేకమై..
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:38 PM
Integrating with Tribals... జిల్లాలో సాలూరు, మక్కువ మండలాల్లో శనివారం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. ఏజెన్సీలో సంతలు, గిరిజనులు పండించే పంటలు, అటవీ ఉత్పత్తులను పరిశీలించారు.

నంద, లొద్ద గ్రామాల్లో ప్రజలతో మాటామంతీ
సాలూరు(మక్కువ),ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాలూరు, మక్కువ మండలాల్లో శనివారం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. ఏజెన్సీలో సంతలు, గిరిజనులు పండించే పంటలు, అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. ఆయా ప్రాంతవాసులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసి పరవశించిపోయారు. తొలుత ఆయన పార్వతీపురం నుంచి మక్కువ మండలం నంద గ్రామానికి చేరుకున్నారు. అక్కడి సంతలో గిరిజనులతో కాసేపు మాట్లాడారు. వ్యాపారులు విక్రయిస్తున్న వస్తువులను పరిశీలిం చారు. ఆ తర్వాత నంద నుంచి సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామం లొద్దకు చేరుకున్నారు. నాలుగు కిలోమీటర్లు కారులో.. ఒక కిలోమీటరు బైక్‌పై .. మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ ప్రాంతం చేరుకున్నారు. గిరిజనుల జీవనశైలి, ఆహారం, వస్త్రధారణ, పంటలు, తదితర విషయాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లొద్ద వద్ద జలపాతాలను సందర్శించి.. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలి పారు. అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించి.. గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.