Share News

correption in housing colonies జగనన్న కాలనీల్లో అక్రమాలపై ఆరా

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:09 AM

Inquire about irregularities in Jagananna Colonies వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో అక్రమాలపై కూటమి ప్రభుత్వం లోతుగా ఆరా తీస్తోంది. ఆయా లే అవుట్లలో ఎంత మందికి పట్టాలిచ్చారు? అర్హులెవరు? అనర్హులెందరు? ఇళ్లు నిర్మించారా? లేదా? స్థలాలపై అమ్మకాలేమైనా జరిగాయా? స్థలాల్లో లబ్ధిదారులే ఉన్నారా? తదితర వివరాలను తేల్చాలని ప్రభుత్వం తాజాగా అధికారులను ఆదేశించింది. 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో అక్రమార్కుల్లో ఆందోళన నెలకొంది.

correption in housing colonies జగనన్న కాలనీల్లో   అక్రమాలపై ఆరా
ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాని నెల్లిమర్ల జగనన్న లేఅవుట్‌

జగనన్న కాలనీల్లో

అక్రమాలపై ఆరా

సమగ్ర విచారణకు కలెక్టర్లకు ఆదేశం

ఉత్తర్వులు జారీచేసిన భూ పరిపాలన కమిషనర్‌

15 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశాలు

బినామీలుంటే పట్టాలు రద్దు

అక్రమార్కుల్లో ఆందోళన

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో అక్రమాలపై కూటమి ప్రభుత్వం లోతుగా ఆరా తీస్తోంది. ఆయా లే అవుట్లలో ఎంత మందికి పట్టాలిచ్చారు? అర్హులెవరు? అనర్హులెందరు? ఇళ్లు నిర్మించారా? లేదా? స్థలాలపై అమ్మకాలేమైనా జరిగాయా? స్థలాల్లో లబ్ధిదారులే ఉన్నారా? తదితర వివరాలను తేల్చాలని ప్రభుత్వం తాజాగా అధికారులను ఆదేశించింది. 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో అక్రమార్కుల్లో ఆందోళన నెలకొంది.

విజయనగరం/ కలెక్టరేట్‌/ నెల్లిమర్ల, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి):

గత ప్రభుత్వం జగనన్న కాలనీ లేఅవుట్లు ఏర్పాటుచేసి పేదలకు గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలంలో పట్టాలు ఇచ్చింది. తరువాత ఇళ్లు మంజూరు చేసింది. అయితే ఏ లేఅవుట్లోనూ నిర్మాణాలు సరిగా జరగలేదు. ఇందులో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా అనర్హులు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు, ఇళ్లు సొంతం చేసుకున్నట్టు భావిస్తోంది. వారిని లెక్కించే పనిలో పడింది. అనర్హులను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల్లో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యటించి వివరాలు సేకరించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అనర్హుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

జిల్లాలో 6040 లేఅవుట్లు ఏర్పాటుచేశారు. 81,999 ఇళ్ల పట్టాలతో పాటు అందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ప్రధానంగా విజయనగరం, బొబ్బిలి, రాజాం, ఎస్‌.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. విజయనగరం కార్పొరేషన్‌ లబ్ధిదారులకు సంబంధించి గుంకలాం లేఅవుట్‌లో 12,600 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించారు. అయితే దాదాపు అన్నిచోట్ల బినామీలకు పెద్దపీట వేశారన్న విమర్శలున్నాయి. అటు లేఅవుట్ల ఏర్పాటులో కూడా భారీగా చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణ లున్నాయి. ఊరికి దూరంగా, కొండ ప్రాంతాల్లో నివాసయోగ్యంకాని చోట భూములను కొనుగోలు చేసి లేఅవుట్లను ఎంపిక చేసినట్టు అప్పట్లో ప్రచారం నడిచింది. భూములను వైసీపీ నేతలు అధిక ధరకు కొనుగోలు చేసినట్టు కూడా అప్పట్లో బయటపడింది. ఇళ్ల పట్టాలు మంజూరు చేసినవాటిలో 40 శాతం బోగస్‌ అన్న ఆరోపణలున్నాయి. చాలా మంది అనర్హులు రాజకీయ సిఫార్సులతో పట్టాలు పొందినట్టు తెలుస్తోంది. ఇదివరకే ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు పొందిన వారు సైతం ఈ లేఅవుట్లలో మళ్లీ పట్టాలు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారిని అధికారులు, సిబ్బంది గుర్తించనున్నారు. అనర్హులని తేలితే వీరి స్థానంలో అర్హులకు పట్టాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ప్రత్యేక మొబైల్‌ యాప్‌..

అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. మొబైల్‌ యాప్‌లో వివరాలను నమోదుచేయనుంది. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సర్వేయర్‌, వీఆర్వోలతో కూడిన బృందం సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదుచేయనుంది. పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం అనర్హత వేటు వేసి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేయనుంది. అధికారులు, సిబ్బంది సర్వేకు వచ్చినప్పుడు లబ్ధిదారులు అన్ని ధ్రువీకరణపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. తెల్ల రేషన్‌కార్డు ఉండాలి. ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకంటే ముందే పట్టా ఇచ్చి ఉంటే మాత్రం రద్దు అవుతుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తుంటే మరుక్షణం పట్టాను రద్దుచేస్తారు. కారు, నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు. కుల ధ్రువీకరణపత్రం తప్పనిసరి. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి పట్టాలు ఉంటే.. ఒకరిది మాత్రమే ఉంచి మిగతా వాటిని రద్దుచేస్తారు. ఎవరైనా ఇప్పటికే ఆ ఇంటి స్థలాన్ని అమ్మినట్టు తేలితే వెంటనే వెనక్కి తీసుకుంటారు.

అడుగడుగునా అవకతవకలు..

విజయనగరం గుంకలాంలో ఏర్పాటుచేసిన జగనన్న కాలనీ లేఅవుట్‌ రాష్ట్రంలో అతి పెద్దదైన వాటిలో రెండోది. ఇక్కడ 12 వేలకుపైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ ఎక్కువగా అనర్హులకు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నాటి వైసీపీ నేతల అనుచరులు, బంధువులు, కుటుంబ సభ్యులు బినామీలుగా పట్టాలు పొందారని తెలుస్తోంది. మరోవైపు విజయనగరంతో పాటు రాజాం, బొబ్బిలి పట్టణ ప్రాంతాలకు కేటాయించిన లేఅవుట్లలో పట్టాలు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. ఇందులో కూడా అప్పటి వైసీపీ నేతలే సూత్రదారులని తెలుస్తోంది. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో బినామీలు, అనర్హుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Updated Date - Feb 12 , 2025 | 12:09 AM