Impulsive Decision అనాలోచిత నిర్ణయం బహుళ అసౌకర్యం
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:34 PM
Impulsive Decision Leads to Multiple Inconveniences బహుళ ప్రయోజన సౌకర్య గోదాముల పేరిట గత వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లకు గోదాములు ఉన్నప్పటికీ.. 500, 600ల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో అదనంగా గోడౌన్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల కాంట్రాక్టర్లకే మేలు జరిగిందని, రైతులకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

రహదారి సౌకర్యం లేని చోట్ల .. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు
పీఏసీఎస్‌ల పరిధిలో గోదాములు ఉన్నా.. అనువుకాని చోట్ల గోడౌన్ల కట్టడాలకు చర్యలు
వాటి వల్ల ఎవరికి ప్రయోజనమంటూ రైతుల మండిపాటు
కాంట్రాక్టర్లకే మేలు అంటూ పెదవి విరుపు
పాలకొండ, జనవరి7 (ఆంధ్రజ్యోతి): బహుళ ప్రయోజన సౌకర్య గోదాముల పేరిట గత వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లకు గోదాములు ఉన్నప్పటికీ.. 500, 600ల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో అదనంగా గోడౌన్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల కాంట్రాక్టర్లకే మేలు జరిగిందని, రైతులకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో అనువుకాని చోట నిబంధనలకు విరుద్ధంగా గోదాములు నిర్మించడం వల్ల ఏం ప్రయోజనమని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అంతటా రహదారులు లేని చోట వాటిని నిర్మించడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలోని 23 పీఏసీఎస్‌లు ఉన్నాయి. దాదాపు అన్నింటికీ గోదాములు ఉన్నాయి. అయినప్పటికీ గత ప్రభుత్వం బహుళ ప్రయోజన సౌకర్యం పేరుతో ప్రతి పీఏసీఎస్ పరిధిలోని గోదాములు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, జిల్లా సహకార సంఘ అధికారులతో పాటు మరికొంతమంది అధికారులు సభ్యులుగా ఉన్నారు. వారి నిర్ణయం మేరకు గోదాముల నిర్మాణాలు చేపట్టాలని గత ప్రభుత్వం ఆదేశించింది. అయితే నిబంధనల మేరకు పనులు జరగలేదు. 20 పీఏసీఎస్‌ల పరిధిలో గోదాముల నిర్మాణానికి సుమారు రూ.10 కోట్ల వరకు వెచ్చించినట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది.
- జిల్లాలో పాలకొండ, భామిని, బత్తిలి, అజ్జాడ, కొమరాడ, గెడ్డలుపిలో ఈ గోదాములు నిర్మాణం పూర్తయింది. ఎస్.నర్సిపురం, ఎం.సింగుపురం, చంద్రయ్యవలస, యు.వెంకమ్మపేటలో ఈ నెలాఖరుకు పనులు పూర్తి కానున్నాయి. మరో పది గోదాములు మార్చి నాటికి సిద్ధం చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
రహదారులు లేని చోట్ల ...
- పీఏసీఎస్‌లకు అందుబాటులో ఉండేలా గోదాములు నిర్మించడం వల్ల రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎరువులు, విత్తనాలు తదితర వాటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మార్కెటింగ్ అనుకూలంగా లేని సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ దిశగా పనులు చేపట్టలేదు.
- ప్రతి పీఏసీఎస్‌కు ఏడు నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఈ గోదాములను నిర్మిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులను తదితర వాటిని రవాణా చేసేందుకు వీలు లేని చోట.. రహదారులు లేని ప్రాంతాల్లో వాటి నిర్మాణం చేపడుతున్నారు. ఇలా చేపట్టవద్దని జిల్లాలో పలు పీఏసీఎస్‌ల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ పట్టించుకున్న వారే కరువయ్యారు.
- పాలకొండ పీఏసీఎస్‌కు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో మల్లమ్మగూడ అనే గిరిజన గూడలో గోదాము నిర్మించారు. అయితే ఈ గోదాముకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు. భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితి. పాలకొండ మండలం అరలి, ఆర్‌బీఆర్‌పేట, పీఏసీఎస్‌లకు సంబంధించి ఎల్‌ఎల్‌పురం పంచాయతీ చంద్రయ్యవలస అనే గిరిజన ప్రాంత సమీపంలో రూ.80 లక్షలతో రెండు గోదాములను సిద్ధం చేశారు. చంద్రయ్యవలసకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.
- భామిని మండలంలో బత్తిలి పీఏసీఎస్ గోదామును పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్లుమడ వద్ద నిర్మించారు. ఈ గోదాముకు వాహనాలు చేరుకోవడం కష్టమే. అదేవిధంగా భామిని పీఏసీఎస్‌కు సంబంధించి లివిరి వద్ద గోదాము నిర్మించారు. ఆ రహదారి కూడా అంతంతమా త్రంగానే ఉంది.
చెల్లింపు బాధ్యత పీఏసీఎస్‌లదే..
- నాబార్డు నిధులను రుణం రూపంలో అందజేసి ఆప్కాబ్ ద్వారా పీఏసీఎస్‌లకు జమ చేశారు. పీఏసీఎస్‌ల ద్వారా గోదాముల నిర్మాణాలకు చెల్లింపులు చేశారు. కాగా నిర్మాణాల అనంతరం వడ్డీతో సహా నాబార్డుకు పీఏసీఎస్‌లే ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నిధులు సమకూర్చని గోదాములు ద్వారా తిరిగి ఎలా రుణాలు చెల్లించాలో తెలియని పరిస్థితుల్లో సహకార సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి.
- పీఏసీఎస్ అధికారులు పర్యవేక్షణ లేకుండానే బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు నిర్మాణం చేపడుతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా.. బిల్లుల చెల్లింపులు మాత్రమే పీఏసీఎస్‌ల ద్వారా చేపడుతున్నారు. ఒక్కో గోదాముకు రూ.40 నుంచి రూ. 60 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. కాగా గోదాముల నిర్మా ణంపై పీఏసీఎస్‌ల పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. నిర్మాణాల నాణ్యత ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.
రోడ్లు నిర్మిస్తాం...
బహుళ ప్రయోజన సౌకర్య గోదాముల నిర్మాణం ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. జనవరి నాటికి కొన్ని, మార్చి నాటికి మిగతావి అందుబాటులోకి వస్తాయి. జిల్లాలోని 20 పీఏసీఎస్‌ల పరిధిలో నిర్మించిన 20 గోదాములకు పూర్తిస్థాయిలో రహదారులు లేవు. ఉపాధి హామీ పథకం కింద రోడ్ల నిర్మాణం చేపట్టి గోదాములకు వాహనాలు వెళ్లే విధంగా చర్యలు చేపడతాం. అందుబాటులోకి వచ్చిన గోదాములను లీజు ప్రాతిపదికన ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు చర్యలు చేపడతాం.
- శ్రీరామ్మూర్తి, జిల్లా సహకార సంఘ అధికారి