curraption in ntr vidyaseva రోగమొకటి.. పేరొకటి!
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:21 AM
ill health but wrong name enter గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడు వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

రోగమొకటి.. పేరొకటి!
ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో లేని వ్యాధులకూ చికిత్స
నిధులు డ్రా చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు
కోడ్ మార్చి.. ప్రభుత్వాన్ని ఏమార్చుతున్న వైనం
అడ్డుచెప్పకుండా రూ.లక్షల్లో ముడుపులు
- గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడు వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స అందించాలని కోరారు. వాస్తవానికి బాలుడు ఎదుర్కొంటున్న వ్యాధి ఎన్టీఆర్ వైద్యసేవలో లేదు. అయినప్పటికీ ఆ ఆస్పత్రి వైద్యులు వైద్యసేవ పథకం పరిధిలోనే వైద్యం అందించారు. ఆరా తీస్తే ఆ వ్యాధిని ఎన్టీఆర్ వైద్యసేవలోకి వచ్చే ఇతర వ్యాధితో పేరుతో ఆన్‌లైన్‌లో కోడ్ మార్చేసి అప్లోడ్ చేశారు. వెన్నునొప్పికి సొంత వైద్యం చేసి ప్రభుత్వాన్ని ఏమార్చి పెద్దమొత్తంలో బిల్లు రాబెట్టారు. వైద్యానికి సంబంధించి ఎవరైనా ఫోన్ వస్తే పలానా వ్యాధి అని చెప్పాలని డిశ్చార్జి సమయంలో తర్ఫీదు కూడా ఇచ్చి పంపారు.
- మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన కూనిబిల్లి లక్ష్మి నరాల సంబంధ వ్యాధితో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. రోగికి సొంత డబ్బులతో ఎమ్మారై, ఇతర టెస్టులు చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్యసేవ కింద వైద్యం అందించారు. ఎమ్మారై, ఇతర పరీక్షలకు అయిన ఖర్చులను తిరిగి ఇవ్వకుండానే డిశ్చార్జ్ చేశారు. కొద్దిరోజుల తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కాల్ సెంటర్ నుంచి ఫోన్ రాగా, విషయాన్ని లక్ష్మి కుమారుడు సంజీవరావు వారి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో జిల్లా అధికారులు హుటహుటిన ఆరోగ్యమిత్రను పంపి ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం సంజీవరావుకు ఆస్పత్రి వర్గాలు కబురు పంపి రూ.500 చేతిలో పెట్టి మమ అనిపించేశారు. మొత్తం సొమ్ము అందినట్లు సంతకాలు చేయించుకున్నారు.
- విజయనగరం మండలానికి చెందిన ఓ వృద్ధుడు గతంలో రెండుసార్లు పెరాల్సిస్ స్ట్రోక్ వచ్చి సొంత సొమ్ముతో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల మూడోసారి పెరాల్సిస్ లక్షణాలు కనిపించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా మొదటిసారి స్ట్రోక్ వచ్చినట్టుగా కోడ్ మార్చి ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా చికిత్స చేసి ప్రభుత్వం నుంచి బిల్లు లాగేశారు. అదేంటని కుటుంబ సభ్యులు అడిగితే మొదటిసారి స్ర్టోక్‌కి మాత్రమే వైద్యసేవ వర్తిస్తుందని, మీకు మేలు చేయాలని అలా చేశామని చెప్పుకొచ్చారు. ఎవరైనా అడిగినా ఫస్ట్ టైం వచ్చినట్టు చెప్పాలని ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపారు.
మెంటాడ, మార్చి 4(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అవినీతికి పాల్పడుతున్నాయి. అక్రమ సొమ్మును కింద నుంచి పైవరకూ వాటాలుగా జుర్రుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆస్పత్రులు 49 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులు 18కాగా ప్రైవేటు ఆస్పత్రులు 31. ఈ మొత్తం ఆస్పత్రులకు ఆరుగురు టీమ్ లీడర్లు పనిచేస్తున్నారు. వీరిలో నలుగురు విజయనగరం జిల్లాలో, ఇద్దరు పార్వతీపురం మన్యం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో మేనేజర్, ఆపైన ఒక కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తుంటారు.
డిజిటల్ రికార్డులను మార్చేసి..
కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఎన్టీఆర్ వైద్యసేవను బంగారుబాతుగా మలుచుకుని ఏటా ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తీసేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకిరాని వ్యాధులకు, సాధారణ చికిత్స కోసం వచ్చేవారిని ముందుగానే ఇన్ పేషెంట్‌గా చేర్చుకుని, ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి వచ్చే వ్యాధితో వచ్చినట్టుగా డిజిటల్ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఆపై వేరే కోడ్‌తో ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసి అనుమతి వచ్చాక కొద్దిరోజులపాటు రోగిని ఆస్పత్రిలో కొనసాగించి డిశ్చార్జి చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్యసేవ కింద బిల్లును రాబట్టి ప్రభుత్వాన్ని నిలువునా మోసగిస్తున్నారు.
అంతా వారి ద్వారానే..
ఎన్టీఆర్ వైద్యసేవ అమలు తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు నివేదించే వారిని, అధికారులను కొన్ని ఆస్పత్రులు ప్రభావితం చేస్తున్నాయి. మొదట్లో ప్రలోభాలకు దూరంగా ఉన్న వారిని కూడా నెలవారీ జీతానికి ఆరేడురెట్లు అదనంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ ట్రస్ట్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులను సైతం కొందరు వైద్యులు మేనేజ్ చేస్తున్నట్లు తెలియవచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చేవారికి ఒక్కో ఆస్పత్రి నుంచి రూ.20 వేలు అందుతున్నట్లు భోగొట్టా.
చెల్లింపుల్లోనూ కక్కుర్తే....
అక్రమ వైద్యంతో ఎన్టీఆర్ వైద్యసేవనుంచి అడ్డగోలుగా నిధులు పొందుతున్న కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు.. వైద్య సేవలకు అనుమతి రాకముందు చేసే స్కాన్‌లు, ఇతర వైద్య పరీక్షలకు గుంజిన డబ్బును రోగులను డిశ్చార్జ్ చేసే సమయంలో వెనక్కి ఇవ్వాలి. కానీ అటువంటిదేదీ జరగడం లేదు. ఈ విషయం తెలియక కొందరు మౌనంగా వెళ్లిపోతున్నారు. తెలిసినవారేమో గొడవలు పెట్టుకోవడం ఇష్టంలేక ఊరుకుంటున్నారు. అంతేకాకుండా డిశ్చార్జ్ సమయంలో పేషెంట్‌కు బస్సు చార్జీలు కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా ఇవ్వడం లేదు. వాటిని ఆసుపత్రి వర్గాలు సొమ్ము చేసుకొని రోగులను మరింత ఆర్థికంగా కుంగదీస్తున్నాయి.
ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయం మార్పు
ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య పెంపునకు తన సిఫార్సు చెల్లుబాటు కాకపోవడంపై మంత్రి ఓ టీమ్ లీడర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయాన్ని డీఎంహెచ్‌వో కార్యాలయం పైఅంతస్తుకు మార్పు చేసినట్లు ఉద్యోగ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇకపై వైద్యసేవ సిబ్బంది ప్రతిరోజు ముందుగా కార్యాలయానికి వచ్చి అప్డేట్స్ వివరించాక ఫీల్డ్‌లోకి వెళ్లాలని డీఎంహెచ్‌వో స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఎన్టీఆర్ వైద్యసేవలో కిందనుంచి పైవరకూ వేళ్లూనుకున్న అవినీతి ప్రక్షాళన ఇటువంటి పైపై చర్యలతో అసాధ్యమని, కూకటివేళ్ళతో పెకిలించే దిశగా కఠిన చర్యలు అవశ్యమని వైద్య ఆరోగ్య శాఖలో పలువురు అభిప్రాయపడుతున్నారు.
------------