Share News

How Safe మనమెంత భద్రం?

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:37 PM

How Safe Are We? వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. తీవ్ర నష్టాన్ని చవిచూడక తప్పదు. అప్ర మత్తంగా లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ స్ర్కాప్‌ షాపులో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందర్నీ కలవరపరుస్తోంది.

How Safe  మనమెంత భద్రం?
పార్వతీపురంలో అగ్నిమాపక కేంద్రం

  • కొరవడిన అధికారుల పర్యవేక్షణ..

  • యజమానుల్లో అవగాహన లోపం.. మరికొందరిలో అశ్రద్ధ

  • భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితేమిటి?

  • ఆ శాఖలో సిబ్బంది కొరత.. పూర్తిస్థాయిలో లేని వాహనాలు

  • వేసవిలో అప్రమత్తంగా ఉండాల్సిందే..

  • లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..

పార్వతీపురం టౌన్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. తీవ్ర నష్టాన్ని చవిచూడక తప్పదు. అప్ర మత్తంగా లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ స్ర్కాప్‌ షాపులో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందర్నీ కలవరపరుస్తోంది. సుమారు గంట పాటు మంటలు చెలరేగగా.. చుట్టు పక్కల నివాసితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే భవిష్యత్‌లో భారీ ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితేమిటోనని జిల్లాకేంద్రవాసులు భయాందోళన చెందుతున్నారు. అసలు ఇటువంటి ఘటనల విషయంలో తప్పు ఎవరిది? బాధ్యులు ఎవరనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

నిబంధనల ప్రకారం స్ర్కాప్‌ షాపులు, షా మిల్లుల్లో వాటర్‌ ట్యాంకులు, నీటిని తోడే మోటార్లు ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు అనుగుణంగా తగు పరికరాలను సంబంధిత షాపులు, మిల్లుల యజమానులు ఏర్పాటు చేసుకోవాలి. తమవంతు భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారు అగ్నిప్రమాద నివారణ పరికాలు ఏర్పాటు చేస్తున్నారా ..? లేదా..? అన్న విషయం సంబంధిత అగ్నిమాపక అధికారులు పరిశీలించాల్సి ఉంది. అదేవిధంగా వారికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. శుక్రవారం రాత్రి పార్వతీపురం పాత బస్టాండ్‌ సమీపంలోని స్ర్కాప్‌ షాపుల్లో జరిగిన అగ్ని ప్రమాదమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో సంబంధిత యజమానులది ఎంత తప్పు ఉందో.. అగ్నిమాపక శాఖాధికారులది కూడా అంతే ఉంది. అగ్ని ప్రమాదాల నివారణ, పరికరాల ఏర్పాటుపై అవగాహన కల్పించకపోవడం వల్లే తరచూ ఇటువంటి ఘటనలు సంభవిస్తున్నాయే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వేధిస్తున్న సిబ్బంది కొరత

జిల్లాలో అగ్నిమాపక శాఖకు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. పార్వతీపురం అగ్నిమాపక కేంద్రంలో తొమ్మిది మంది సిబ్బంది అవసరం కాగా ముగ్గురుతో నెట్టుకొస్తున్నారు. పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు అగ్నిమాపక కేంద్రాల్లో 62 మంది సిబ్బంది ఉండాలి.. కానీ 38 మంది మాత్రమే ఉన్నారు. ఆయా చోట్ల 18 మంది హోమ్‌ గార్డులు కూడా పనిచేస్తున్నారు. కాగా పార్వతీపురంలో అగ్నిమాపక కేంద్రానికి ఒకటే ఫైర్‌ ఇంజిన్‌ వాహనం ఉంది. మరోవైపు అరకొర సిబ్బంది ఉండడంతో.. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలను అదుపు చేయడం కష్టతరమవుతోంది. వేసవిలో అగ్నిప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

అవగాహన కల్పిస్తాం..

స్ర్కాప్‌ షాపులు, షా మిల్లుల్లో అగ్నిప్రమాదాల నివారణ, పరికరాల ఏర్పాటుపై సంబంధిత యజమానులకు అవగాహన కల్పిస్తాం. జిల్లాలోని నాలుగు అగ్నిమాపక కేంద్రాల్లో అదనపు వాహనాలు ఏర్పాటుపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సిబ్బంది నియామకం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

-శ్రీనుబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి

Updated Date - Feb 08 , 2025 | 11:37 PM