Share News

How Much Longer? ఇంకెన్నాళ్లు?

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:13 AM

How Much Longer? సీతంపేటలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే భవనం లోపలి భాగంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోగా.. ఆ ప్రాంగణమంతా అధ్వానంగా దర్శనమిస్తోంది. మొత్తంగా గిరిజనులకు స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలు అందేదెప్పడో తెలియని పరిస్థితి నెలకొంది.

How Much Longer? ఇంకెన్నాళ్లు?
సీతంపేట మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి

భవనం లోపల పిచ్చిమొక్కలు

పట్టించుకోని అధికారులు

మరో తొమ్మిది నెలల గడువు పొడిగింపు?

పెదవి విరుస్తున్న గిరిజనులు

సీతంపేట రూరల్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): సీతంపేటలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే భవనం లోపలి భాగంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోగా.. ఆ ప్రాంగణమంతా అధ్వానంగా దర్శనమిస్తోంది. మొత్తంగా గిరిజనులకు స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలు అందేదెప్పడో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం సీతంపేట కేంద్రంగా రూ.49కోట్లతో మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసింది. 2022, మే నెలలో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏపీఎంఐడీసీ(ఆంధ్రప్రదేశ్‌మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)ఆధ్వర్యంలో అప్పట్లో టెండర్లు పిలించారు. ఈ మేరకు ఎన్‌సీసీ(నాగార్జున కనస్ట్రక్షన్స్‌) టెండర్లను దక్కించుకొని పనులు ప్రారంభించింది. అయితే నిబంధనల మేరకు మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని 2024, డిసెంబర్‌ నాటికి పూర్తిచేసి సంబంధిత మెడికల్‌ విభాగానికి అప్పజెప్పాల్సి ఉంది. కానీ సంబంధిత సంస్థ ఇప్పటి వరకు నిర్మాణం పూర్తిచేయలేదు. ఇంకా 20శాతానికి పైగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లుల చెల్లించకపోవడం వల్లే పనులు వేగవంతం కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే సంబంధిత సంస్థకు బిల్లులను చెల్లించింది. అయినప్పటికీ ఆసుపత్రి పనులు మాత్రం ఊపందుకోలేదు. ఇంకా నత్తనడకనే సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా సంబంధిత సంస్థకు చెందిన కాంట్రాక్టర్‌ ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు కోరినట్లు తెలుస్తోంది.

అందుబాటులోకి వస్తే ఎన్నో సేవలు..

సీతంపేట మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే సుమారు 20 రకాల స్పెషలిస్ట్‌ వైద్యసేవలు గిరిజనులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా కార్డియాలజీ, గ్యాస్ర్టో, న్యూరో, ఆర్థో, యూరాలజీ, నెఫ్రాలజీ, స్కిన్‌ తదితర కీలక విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య సేవలు అందనున్నాయి. అంతేకాకుండా 800 మందికి పైగా వైద్య సిబ్బంది వివిధ విభాగాల్లో పనిచేయనున్నారు.ఈ ఆసుపత్రి ద్వారా సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాలకొండ, వీరఘట్టం మండలాలతో పాటు ఉమ్మడి జిల్లాల పరిధిలోని సరిహద్దు గ్రామాల ప్రజలు, ఒడిశా వాసులకు అత్యాధునిక వైద్యసేవలు అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఏపీఎంఐడీసీ డీఈ ఏమన్నారంటే...

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి సీతంపేట మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తవుతాయని ఏపీఎంఐడీసీ డీఈ సిమ్మన్న తెలిపారు. కాంట్రాక్టర్‌కు చెందిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున సమయం కోరినట్లు చెప్పారు.

Updated Date - Mar 09 , 2025 | 12:13 AM