Share News

Gheem'kari'mpu! ఎన్నాళ్లీ ఘీం‘కరి’ంపు!

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:10 AM

How Long This Gheem'kari'mpu! జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా పంటలు, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నాయి. రహదారులపై సంచరిస్తూ.. వాహనదారులను బెంబే లెత్తిస్తున్నాయి. జనావాసాల్లోనే ఏనుగులు సంచరిస్తూ.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

  Gheem'kari'mpu! ఎన్నాళ్లీ ఘీం‘కరి’ంపు!
గుజ్జుపాడు గ్రామంలోని పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు

  • పామాయిల్‌, కర్జూజ పంటలకు నష్టం

  • వ్యవసాయ పరికరాలు ధ్వంసం

  • లబోదిబోమంటున్న రైతులు

  • ఏళ్లు గడుస్తున్నా వీడని బెడద

  • ఇబ్బందుల్లో ‘మన్యం’వాసులు

  • తక్షణమే వాటిని తరలించాలని డిమాండ్‌

పార్వతీపురం/కొమరాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా పంటలు, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నాయి. రహదారులపై సంచరిస్తూ.. వాహనదారులను బెంబే లెత్తిస్తున్నాయి. జనావాసాల్లోనే ఏనుగులు సంచరిస్తూ.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి కొమరాడ మండలం పాలెం గ్రామ సమీపంలో సత్యనారాయణ అనే రైతుకు చెందిన పది ఎకరాల పామాయిల్‌ తోటలో 70 మొక్కలను ధ్వంసం చేశాయి. అక్కడున్న డ్రిప్‌ పరికరాలతో పాటు సమీపంలోని కర్బూజ తోటను కూడా నాశనం చేశాయి. సుమారు రూ. రెండు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తనకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఏనుగుల గుంపును తక్షణమే ఈ ప్రాంతం నుంచి తరలించి రైతులతో పాటు ఆ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

గుజ్జుపాడులో...

కురుపాం రూరల్‌: మండలంలోని గుజ్జుపాడు, గొళ్లవలస గ్రామాల్లో గత నాలుగు రోజులుగా ఏడు గజరాజులు హల్‌చల్‌ చేస్తున్నాయి. కర్జూజ, అరటి, చెరకు తోటల్లో సంచరిస్తూ.. మొక్కలను నేలమట్టం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బుధవారం సాయంత్రానికి ఏనుగులు గుజ్జుపాడు గ్రామ రహదారిపై సంచరించాయి. దీంతో కురుపాం నుంచి కొమరాడ మండలానికి రాకపోకలు సాగించే వారు తీవ్ర భయాందోళన చెందారు.

కుంకి వచ్చేదెప్పుడు..?

పార్వతీపురం, జనవరి29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన, మైదాన ప్రాంతవాసులను దశాబ్దాలుగా ఏనుగుల సమస్య వేధిస్తోంది. వాటివల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పో యారు. ఏటా రైతులు భారీగా పంట నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఒంటరిగా పొలాలకు కూడా వెళ్లలేని పరిస్థితి. ఏనుగుల కారణంగా కొన్నేళ్లుగా పంట, ప్రాణ నష్టాన్ని చవి చూస్తున్న రైతులు ఇటీవల ఆగ్రహంతో రోడ్డెక్కారు. తక్షణమే వాటిని తరలించాలని పట్టుబట్టారు. కొద్ది రోజుల కిందట భామిని మండలం ఘనసర శివారులో ఉన్న పొలాల వద్ద అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. గజరాజులు మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అక్కడే గ్రామస్థులు బైఠాయించి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏనుగుల తరలింపునకు ప్రత్యే బలగాలను రప్పిస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. దీంతో వివాదం తాత్కాలింగా సద్దుమణిగింది. కాగా ఏనుగులు తరలింపు విషయంలో అటు అటవీ శాఖాధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఏనుగులు బీభత్సం సృష్టించినప్పుడల్లా.. వాటిని తరలిస్తామని, జోన్‌ ఏర్పాటు చేస్తామని చెబుతున్న అటవీశాఖాధి కారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గజరాజుల దాడిలో ఎవరైనా మృతి చెందితే ప్రభుత్వం తరఫున చెక్కు అందించి చేతులు దులుపుకుంటున్నారు. కాగా జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక నుంచి కుంకిలను తెప్పిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో మన్యం వాసులు వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరితగతిన వాటిని తెప్పించి గజరాజుల బెడద తప్పించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:10 AM