Share News

Here Seven.. ఇక్కడ ఏడు.. అక్కడ నాలుగు!

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:53 PM

Here Seven.. There Four! జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలికి సమీపంలోని మినీ మోడ్రన్‌ రైస్‌ మిల్లులో గురువారం అర్ధరాత్రి ఏడు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మిల్లు తలుపులు, కిటికీలను ధ్వంసం చేశాయి.

Here Seven.. ఇక్కడ ఏడు.. అక్కడ నాలుగు!
పెదమేరంగి సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు

  • పెదమేరంగి రైస్‌ మిల్లులో తలుపులు, కిటికీలు, ధాన్యం బస్తాలు ధ్వంసం

  • ఘనసరలో దెబ్బతిన్న పంటలు, వ్యవసాయ పరికరాలు

  • తక్షణమే వాటిని తరలించాలని ప్రజల డిమాండ్‌

జియ్యమ్యవలస, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలికి సమీపంలోని మినీ మోడ్రన్‌ రైస్‌ మిల్లులో గురువారం అర్ధరాత్రి ఏడు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మిల్లు తలుపులు, కిటికీలను ధ్వంసం చేశాయి. లోపలున్న 30 ధాన్యం బస్తాలను బయటకు విసిరేశాయి. కావల్సిన ధాన్యం ఆరగించి.. మిగిలిన బస్తాలను చిందరవందర చేశాయి. శుక్రవారం ఉదయం రైస్‌ మిల్లు వద్ద పరిస్థితి చూసి యజమాని దాసరి అజిత్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులు ఈ విధంగా దాడి చేయడం ఐదోసారి అని, ప్రతీసారి రూ. 50 వేలకు పైగా నష్టం వాటిల్లుతోందని వాపోయారు. ఇంత జరుగుతున్నా.. అటవీశాఖ, రెవెన్యూశాఖ అధికారులు స్పందించడం లేదని తెలిపారు. రాత్రి వేళల్లో ఏనుగుల కదలికను అటవీశాఖ సిబ్బంది పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైస్‌ మిల్లు పక్కనే కాలనీ ఉండడంతో ఏనుగుల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ ప్రాంతవాసులు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఘనసరలో ఇలా..

భామిని: ఘనసర ప్రాంతంలోనూ గజరాజులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒడిశా నుంచి వచ్చిన నాలుగు ఏనుగులు గత 15 రోజులుగా ఈ ప్రాంతంలోనే తిష్ఠ వేశాయి. ప్రధానంగా మొక్కజొన్న పంట, వ్యవసాయ పరికరాలు, పైపులను నాశనం చేశాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల కారణంగా పొలాల్లోకి వెళ్లలేకపోతున్నామని వారు వాపోతున్నారు. పంటలకు నీరు కూడా పెట్టలేకపోతున్నామన్నారు. ప్రస్తుతం ఏనుగులు తాలాడ సమీపంలో ఐలమ్మతోటలో ఉన్నట్లు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ దాలినాయుడు తెలిపారు. దీంతో ఘనసరతో పాటు తాలాడ, కీసర, కోసలి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:53 PM