Share News

పండగొచ్చిందోచ్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:34 PM

Here Comes the Festival జిల్లా సరికొత్త శోభ సంతరించుకుంది. పట్టణాలు, పల్లెలని తేడా లేకుండా అంతటా సందడి వాతావరణం నెలకొంది. మొత్తంగా ‘మన్యం’కు పండగ కళ వచ్చేసింది. సంక్రాంతి సంబరాలకు జిల్లావాసులు సమాయాత్తమవుతున్నారు. భోగాభాగ్యాల నిచ్చే భోగి జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

పండగొచ్చిందోచ్‌
సాలూరు రూరల్‌: పట్టణంలోని గాడివీధిలో భోగి మంటలు

  • కొన్నిచోట్ల అర్ధరాత్రి నుంచే మంటలు వేసిన ప్రజలు

  • సంక్రాంతి జోష్‌లో జిల్లావాసులు

  • అంతటా సందడే సందడి

పార్వతీపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా సరికొత్త శోభ సంతరించుకుంది. పట్టణాలు, పల్లెలని తేడా లేకుండా అంతటా సందడి వాతావరణం నెలకొంది. మొత్తంగా ‘మన్యం’కు పండగ కళ వచ్చేసింది. సంక్రాంతి సంబరాలకు జిల్లావాసులు సమాయాత్తమవుతున్నారు. భోగాభాగ్యాల నిచ్చే భోగి జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చాలాచోట్ల ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు వేశారు. ముఖ్య కూడళ్లలో పిడకలు, ఇతరత్రా సామగ్రిని మంటల్లో వేసి జిల్లా వాసులు చలి కాచుకున్నారు. మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ, గురువారం ముక్కునుమను ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్రాంతి సంబరాలు చేపట్టారు.

ఆత్మీయ పలకరింపులు..

పెద్దల పండగ అయిన సంక్రాంతిని వైభవంగా జరుపుకునేందుకు వలస జీవులు స్వగ్రామాలకు తరలివస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు నిమిత్తం ఇతర రాష్ర్టాలు, దేశాలకు వెళ్లిన వారు సొంతగూటికి చేరుకుంటున్నారు. ఉపాధి కోసం జిల్లా విడిచి వెళ్లిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి తరలివస్తున్న వారితో పట్టణాలు, పల్లెలు కళకళాడుతున్నాయి. వారిని స్థానికులు, బంధువులు ఆత్మీయ పలకరింపులతో స్వాగతం పలుకుతున్నారు.

బస్సులన్నీ రద్దీ

సాలూరు రూరల్‌: స్వగ్రామాలకు వచ్చేవారితో బస్సులన్నీ కిక్కిరిసి కనిపించాయి. సాలూరు, పార్వతీపురం, పాలకొండ ఆర్టీసీ డిపోల నుంచి విశాఖకు ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ రద్దీ తగ్గలేదు. ఫుట్‌పాత్‌లపై నిల్చొని ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాలకెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు సైతం ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి.

సాలూరులో

సాలూరు రూరల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సాలూరు, పరిసర గ్రామాల్లో ఆదివారం రాత్రే భోగి మంటలను వెలిగించారు. భోగి పండుగనుముందు రోజు రాత్రి జరుపుకోవడం సాలూరులో ఆనవాయితీగా వస్తుంది. మంటల దినంగా స్థానికులు వ్యవహరిస్తుంటారు. కామాక్షి అమ్మవారి దేవాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేసి భోగి మంటలు వెలిగించారు.

Updated Date - Jan 12 , 2025 | 11:34 PM