Guaranteed this time ఈసారి గ్యారెంటీ
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:23 AM
Guaranteed this time లక్కవరపుకోట మాజీ జడ్పీటీసీ ఈశ్వరరావు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. దివంగత మంత్రి కోళ్ల అప్పలనాయుడు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వరకు గెలుపుకోసం పనిచేశారు.

ఈసారి గ్యారెంటీ
నాయకుల్లో చిగురిస్తున్న ఆశఽలు
నెలాఖరులోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్న సీఎం
డీసీసీబీ చైర్మన్ కూర్చీని దక్కించుకొనేందుకు పావులు
మార్కెట్, ఆలయ కమిటీల చైర్మన్‌ల కోసం దిగువ కేడర్ మధ్య పోటీ
లక్కవరపుకోట మాజీ జడ్పీటీసీ ఈశ్వరరావు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. దివంగత మంత్రి కోళ్ల అప్పలనాయుడు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వరకు గెలుపుకోసం పనిచేశారు. 2009లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తోను, 2019లో అధికారం చేపట్టిన వైసీపీతో రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇతనికి ఏదో ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కుతుందని అంతా భావించారు. కాని రెండు విడతలుగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల జాబితాలో చోటు దక్కలేదు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఇలాంటి వారెందరో ఉన్నారు.
శృంగవరపుకోట, మార్చి 4(ఆంధ్రజ్యోతి):
టీడీపీలో సీనియర్ నాయకులు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. వారంతా ఎన్నికల్లో పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలుపుకోసం తపిస్తున్నారు. పదవులతో పని లేకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారు. అయితే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయడంతో వీరందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. శుక్రవారం ఆసెంబ్లీ కమిటీ హాల్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు తమ పక్కన తిరిగేవారు కాకుండా పార్టీ కోసం కష్టపడే వారిని ఎంపిక చేయాలని శాసన సభ్యులకు సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ఆశపెట్టుకున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వారు కూడా నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడ్డారు. ఒకరిద్దరికి ఈ పదవులు దక్కాయి. మిగతా వారు లోలోన మథన పడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం చంద్రబాబు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతుండడంతో కష్టించి పనిచేసిన కార్యకర్తలు ఆయన మాటలను స్వాగతిస్తున్నారు. కాగా జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబి), జిల్లా సహకార మార్కెట్ సొసైటీ (డీసీఎంస్)లు ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవులు. ఇందులో డీసీసీబి మరింత ప్రాఽధాన్యం కలిగి ఉంది. రాష్ట్ర స్థాయి నామినెటేడ్ పదవులకు సమానమైన పదవిగా పరిగణిస్తారు. దీంతో చాలా మంది అసక్తి చూపుతున్నారు. ఈ పదవిలో కూర్చొంటే భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగపడుతుందని పలువురి భావన. మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు ఈ పదవే మంచి గుర్తింపు తెచ్చింది.
డీసీసీబిలో లక్ష కుటుంబాలకు సభ్యత్వం ఉంది. అన్ని వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే రుణాలను అందిస్తుంది. ప్రధానంగా వ్యవసాయ భూములను తనఖా పెట్టుకుని తక్కువ వడ్డీకి అప్పు ఇస్తుంది. ఈ వ్యవసాయ రుణాల మంజూరులో చైర్మన్ పాత్ర ఉంటుంది. రైతులందరితో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత రాజకీయాల్లో వీరి ద్వారా ఓట్లు సంపాదించుకొనేందుకు అవకాశం ఉండడంతో ఈ పదవిపై చాలా మంది గురిపెట్టారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన కడగల అనంద్, త్రీమూర్తుల రాజు, గజపతినగరం నియోజకవర్గానికి చెందిన కొండపల్లి భాస్కరరావు, శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన కోళ్లబాలాజీ అప్పలరామ ప్రసాద్, పార్వతీపురం మన్యం జిల్లా కురపాం నియోజకవర్గానికి చెందిన దత్తి లక్ష్మణరావు వంటి వారు రేసులో వున్నారు. ఆ తరువాత స్థానంలో వున్న డీసీఎంఎస్ పదవినైనా దక్కించుకోవాలని రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కని మరికొంత మంది కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులను కూడా భర్తీ చేయనున్నారు. దేవదాయ, శాఖ ఆధ్వర్వలో పలు ఆలయాలున్నాయి. వీటికి చైర్మన్‌లు, డైరెక్టర్‌లను నామినేటెడ్ చేయాల్సి ఉంది. వీటిని కూడా ఈ నెలలో భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పదవులను దక్కించుకోనేందుకు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు శాసన సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే శాసన సభ్యులు ఇప్పటికే ఈ పదవుల్లో నియమించేందుకు జాబితాను తయారు చేసుకోని సిద్ధంగా ఉన్నారు. వీరి జాబితాలపై పలు నియోజకవర్గాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి శాసన సభ్యులకు ఇబ్బందిగా మారింది. ఈనేపథ్యంలో శాసన సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడు సూచనను ఎంత వరకు అమలు చేస్తారో చూడాలి.
-----------