'kutami' ‘కూటమి’పై కోటి ఆశలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:02 AM
Great Hopes on the 'kutami'" అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 28న 2025-26 ఆర్థికసంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ‘మన్యం’ వాసులు కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి.. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరుతున్నారు.

‘మన్యం’లో కదలని సాగునీటి ప్రాజెక్టుల పనులు
గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కరువు
పేరుకే జిల్లా .. అభివృద్ధిలో వెనకంజ
నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వాసుల విన్నపం
పార్వతీపురం, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 28న 2025-26 ఆర్థికసంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ‘మన్యం’ వాసులు కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి.. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరుతున్నారు. నూతన జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే మౌలిక వసతులు, అభివృద్ధిపై దృష్టి సారించలేదు. కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కూడా సమకూర్చలేకపోయింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పైనా దృష్టి సారించలేదు. దీంతో మన్యం జిల్లా పేరుకే అన్నట్టుగా మారింది. మరోవైపు ప్రజా వ్యతిరేక విధానాలతో అన్ని వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మొత్తంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న మన్యం జిల్లాపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పరుగు పెట్టేంచేలా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి చర్యలు తీసుకోవాల్సి ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.
తోటపల్లి పరిస్థితి ఇదీ..
- తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ఆధునికీకరణకు సుమారు రూ. 200 కోట్లు అవసరం. 118 కిలోమీటర్ల పొడవు ఉన్న కెనాల్‌కు సంబంధించి గట్లు బలహనంగా ఉన్న ప్రాంతాల్లో లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. అప్పట్లో రూ. 98 కోట్లతో ప్రతిపాదనలను పంపించినా వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో లైనింగ్ పనులు జరగలేదు. గట్లు మరింత బలహీనంగా తయారై సాగునీరు సరఫరాకు ఆటంకం ఏర్పడక ముందే పాలకులు స్పందించాల్సి ఉంది. కాగా 7,15,760 క్యూబిక్ మీటర్ల మేర ఎర్త్‌వర్క్ చేపట్టాల్సి ఉండగా 1,66,234 క్యూబిక్ మీటర్లు మేర మాత్రమే పనులు చేపట్టారు. 47,002 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉండగా ఇంకా 10,170 క్యూబిక్ మీటర్ల మేర ఆ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ వద్ద 115 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉంది. 314 డిస్ర్టిబ్యూటర్స్‌కు గాను 293 డిస్ర్టిబ్యూటర్స్ నిర్మించాల్సి ఉంది.
- పెండింగ్‌ల పనుల పూర్తికి గాను పార్వతీపురం డివిజన్‌కు రూ.46 కోట్లు, రాజాం డివిజన్‌కు రూ.55 కోట్ల నిధులు అవసరం. భూసేకరణకు మరో పది కోట్లు కావల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పాత రెగ్యులేటరీ ద్వారా 64 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతంలో కూడా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది.
- తోటపల్లి కొత్త రెగ్యులేటరీ ద్వారా విజయనగరం జిల్లాలో 78,963 ఎకరాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13,683 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 38,974 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మూడు జిల్లాల్లో 84 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా పూర్తిస్థాయిలో భూములకు సాగునీరు అందించాలంటే బడ్జెట్‌లో రూ.200 కోట్లు పైబడి కేటాయించాల్సి ఉంది.
జైకా నిధులు కేటాయిస్తే ఎంతో మేలు...
- జిల్లాలోని వీఆర్‌ఎస్, పెద్దగెడ్డ ప్రాజెక్టులతో పాటు ఒట్టిగెడ్డ రిజర్వాయర్ , పెదంకలం ఆయకట్టు ఆధునికీకరణకు జైకా నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం వీఆర్‌ఎస్ ద్వారా మక్కువ మండలంలో 14,798 ఎకరాలు, సీతానగరం మండలంలో 3,724 ఎకరాలు, బొబ్బిలి మండలంలో 6,178 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఒట్టిగెడ్డ ద్వారా కురుపాం మండలంలో 30 ఎకరాలు, జియ్య మ్మవలస మండలంలో 14,987 ఎకరాలు, గరుగుబిల్లి మండలంలో 1,667 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పెద్దగెడ్డ ద్వారా పాచిపెంట మండలంలో 6320 ఎకరాలకు, సాలూరు మండలంలో 2,826 ఎకరాలు, రామభద్రపురం మండలంలో 3,076 ఎకరాలకు నీరందుతుంది. పెదంకలం ద్వారా బలిజిపేట మండలంలో 6,617 ఎకరాలు, వంగర మండలంలో 1,640 ఎకరాలకు సాగునీరు అందు తున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
- వీఆర్‌ఎస్ ప్రాజెక్టుకు రూ.63.50కోట్లు, పెద్దగెడ్డకు రూ.44.85 కోట్లు, పెదంకలం ప్రాజెక్టుకు రూ.17.50 కోట్లు , పెద్దగెడ్డకు రూ.28.18 కోట్లు చొప్పున గతంలో జైకా నిధులు మంజూరైనా వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తికాలేదు. దీంతో శివారు భూములకు సాగు నీరందని పరిస్థితి. ఏటా ఆయా ప్రాంతరైతులు వరుణుడిపైనే ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తి చేస్తే.. ఆయా ప్రాజెక్టుల పరిధిలో శివారు భూములకూ పుష్కలంగా సాగునీరు అందనుంది.
- జైకా నిధులను ఈ ఏడాది మార్చి నాటికి పూర్తిగా వినియోగించాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి మరో రెండేళ్లు పాటు గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా..
గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామం వద్ద గుమ్మడిగెడ్డకు సంబంధించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వాటిని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పావురాయిగెడ్డ తదితర మైనర్ ఇరిగేషన్ పనులతో పాటు పార్వతీపురం మండలంలోని అడారుగెడ్డ రిజర్వాయర్ నిర్మాణానికి చొరవ చూపాల్సి ఉంది. పాలకొండ నియోజక వర్గంలో జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం కోసం అసెంబ్లీలో ప్రస్తావించాల్సి ఉంది.
జంఝావతి ప్రాజెక్టు ...
జంఝావతి ప్రాజెక్టు పరిధిలో హైలెవెల్ కెనాల్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు నాగు సుమారు రూ.52 కోట్లు అవసరం. అదేవిధంగా రివర్ గ్యాప్ 60 మీటర్లు క్లోజ్ చేసేందుకు కూడా నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ముడిపడి ఉన్న 1100 ఎకరాల సమస్యను పరిష్కరించాలి. ప్రస్తుతం జంఝావతి ద్వారా కేవలం 9 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండగా.. పూర్తిస్థాయిలో 24 వేల ఎకరాలకు నీరందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
మరికొన్ని సమస్యలు ఇలా..
పార్వతీపురం, సీతంపేటలో నత్తనడకన సాగుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు సాలూరు, కురుపాం తదితర ఆసుపత్రుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సి ఉంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు ఎదురుచూస్తున్న పూర్ణపాడు-లాబేసు వంతెనను పూర్తి చేసే విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉంది. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు పూర్వ వైభవం తేవాల్సిన బాధ్యత జిల్లా పాలకులపై ఉంది. ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు పనులు వేగవంతం ్తచేయడంతో పాటు కుంకి ఏనుగును జిల్లాకు త్వరగా తెప్పించాల్సి ఉంది. గిరి శిఖర గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తే కార్మికులతో పాటు మరెంతోమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.