Sirimanu Tree ఘనంగా సిరిమాను చెట్టు ఊరేగింపు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:01 AM
Grand Sirimanu Tree Procession సాలూరు గ్రామదేవత శ్యామలాంబ తల్లి పండగ నేపథ్యంలో ఆదివారం పట్టణంలో ఘనంగా సిరిమాను చెట్టును ఊరేగించారు. అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్న ఆ చెట్టుకు ముందుగా అనువంశిక ధర్మకర్త విక్రమ చంద్రసన్యాసిరాజు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.

శ్యామలాంబకు ప్రత్యేక పూజలు
సాలూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామదేవత శ్యామలాంబ తల్లి పండగ నేపథ్యంలో ఆదివారం పట్టణంలో ఘనంగా సిరిమాను చెట్టును ఊరేగించారు. అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్న ఆ చెట్టుకు ముందుగా అనువంశిక ధర్మకర్త విక్రమ చంద్రసన్యాసిరాజు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఆ తర్వాత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, అల్లు, కర్రి, జన్ని కటుంబీకులు, పూజారి ధనంజయరావు తదితరులు సిరిమాను చెట్టుతో పాటు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. పట్టణంలో శివాజీ బొమ్మ జంక్షన్ నుంచి బొసుబొమ్మ మీదుగా డబ్బివీధి, పెదకోమటిపేట, కోట దుర్గమ్మ గుడి వరకు సిరిమాను చెట్టు ఊరేగింపు సాగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం నుంచి బోసు బొమ్మ మీదుగా నాయుడు వీధి రామమందిరం వద్దకు సిరిమాను చెట్టును తీసుకొచ్చారు. మార్చి ఒకటో తేదీన ఆ చెట్టును సిరిమానుగా రూపొందించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కాగా 50 జతల ఎద్దులు, వేలాది మంది భక్తుల నడుమ పట్టణ పురవీధుల్లో సిరిమాను చెట్టు ఊరేగింపు సాగింది. దీంతో పండగ ముందే వచ్చినట్లయ్యింది. దారి పొడువునా భక్తులు సిరిమాను చెట్టుకు పసుపు, కుంకుమ, ముర్రాటలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పులివేషాలు, తిన్మార్ డబ్బులు, డీజే డ్యాన్సులతో పట్టణం సందడిగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ అప్పలనాయుడు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ ఉత్సవ కమీటీ సభ్యులు ఎ.అప్పారావు, ఇ.నారాయణరావు, ఎస్.బంగారయ్య, తిరుపతిరావు (చిట్టి) తదితరులు పాల్గొన్నారు. మే 18,19,20 తేదీల్లో శ్యామలాంబ పండగ జరపనున్న నేపథ్యంలో అంజలి రఽథం, సిరిమాను చెట్టు పీటకు సంబంధించి ఆదివారం జీగిరాంలో ఉన్న మామిడి చెట్టును గుర్తించారు. ఈ మేరకు కర్రివీధి, గాడివీధి, వెలంపేట యువత,పెద్దలు అక్కడకు వెళ్లి ఆ చెట్టును కొట్టారు.