Share News

అత్యవర కేసా.. రెఫర్‌ చెయ్‌!

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:11 AM

అత్యవసర కేసు వచ్చిందా.. అయితే రెఫర్‌ చెయ్‌’ అన్నట్లుగా తయారైంది గజపతినగరం సీహెచ్‌సీ తీరు. ఈ ఆసుపత్రి స్థాయి పెరిగినా.. ఆ స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. వైద్యులు ఉన్నా సరిగా అందుబాటులో లేకపోవడం.. దీనికితోడు కొన్ని పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 అత్యవర కేసా.. రెఫర్‌ చెయ్‌!
ఓపీ కోసం క్యూలైన్‌లో ఉన్న రోగులు

  • వైద్యులు ఉండరు.. సేవలు అందవు

  • స్థాయి పెరిగినా మారని తీరు

  • గజపతినగరం సీహెచ్‌సీ తీరిదీ

  • రాజాంలో అరకొర భవనాలే దిక్కు

  • అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణాలు

  • ఆరుబయటే విలువైన పరికరాలు

  • ఇబ్బందులు పడుతున్న రోగులు

గజపతినగరం/మెంటాడ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి):

అత్యవసర కేసు వచ్చిందా.. అయితే రెఫర్‌ చెయ్‌’ అన్నట్లుగా తయారైంది గజపతినగరం సీహెచ్‌సీ తీరు. ఈ ఆసుపత్రి స్థాయి పెరిగినా.. ఆ స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. వైద్యులు ఉన్నా సరిగా అందుబాటులో లేకపోవడం.. దీనికితోడు కొన్ని పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఈ ఆసుపత్రిలో చోటుచేసుకున్న పరిణామాలు వివాదాస్పదం అయ్యాయి. ఒక నిండు గర్భిణిని చేర్చుకోకుండా రెఫర్‌ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజాం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులో కూడా స్థాయి పెరిగినా అరకొర వైద్యసేవలే గతి. సరిపడ గదులు లేక ఆరుబయటే ఓపీ చూస్తున్నారు. సీరియస్‌ కేసులను ఇతర ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. విలువైన వైద్య పరికరాలు పెట్టేందుకు అవసరమైన భవనాలు లేవు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు భయపడుతున్నారు.

  • గత ఏడాది జూలైలో మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన కె.లక్ష్మి అనే గర్భిణి చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు విజయ నగరం ఘోషా ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేయించుకుంది. తన బ్లడ్‌ గ్రూప్‌ను బి-నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. కొద్దిరోజుల తరువాత గజపతినగరం ఏరియా ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సూచన మేరకు మరోసారి రక్తపరీక్ష చేయించుకుంది. అక్కడ బి-పాజటివ్‌గా నిర్ధారించారు. ఆందోళన చెందిన లక్ష్మి కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో ఆమెకు రక్త పరీక్ష చేయించగా బి-నెగిటివ్‌గా వచ్చింది. దీంతో గజపతినగరం ఏరియా ఆసుపత్రికి వెళ్లి ల్యాబ్‌ సిబ్బందిని నిలదీస్తే.. అల్లరి చేయొద్దని తప్పు జరిగిందని వేడుకున్నారు.

  • గజపతినగరం మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన నూకరాజు చాతినొప్పితో గత ఏడాది అక్టోబరులో గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో చేరాడు. రోగిని పట్టించుకోకుండా వైద్యులు, సిబ్బంది కాలయాపన చేయడంతో నూకరాజు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. కొందరు పెద్దలు కల్పించుకోవడంతో సమస్య సద్దుమణిగింది.

  • కొద్దిరోజుల కిందట మెంటాడ మండలం కూనేరు పంచాయతీ మిర్తివలస గ్రామానికి చెందిన నిండు గర్భిణిని ప్రసవం కోసం 108 వాహనంలో కుటుంబ సభ్యులు గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటల తరువాత ఆసుపత్రిలో వైద్యులు ఉండరని తెలిసి ఎందుకు తీసుకువచ్చారని 108 సిబ్బందితో వైద్య సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఆమెను విజయనగరం ఘోషా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆమెను విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కవయ్యాయి. దీంతో 108 మెడికల్‌ టెక్నిషియన్‌ ఆమెకు సాధారణ ప్రసవం చేయడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గజపతినగరం ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సులు, ముగ్గురు గైనకాలజిస్ట్‌లు ఉండి కూడా కేసును రిఫర్‌ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైద్యులు చెప్పినట్లు హైరిస్క్‌ కేసు అయితే 108 సిబ్బంది సాధారణ ప్రసవం ఏవిధంగా చేయగలిగారో వారే చెప్పాలి. ఇక్కడి వైద్యులు ప్రైవేట్‌ ఆసుపత్రులు నడుపుతున్నారని, దీంతో వారు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను పూర్తిగా విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం కాల్‌ డ్యూటీకి అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. హెచ్‌ఆర్‌ఏ పొందుతూ విజయనగరం, విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు అంతంత మాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయి. 30 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్పు చేశారు. దీంతో 100 పడకలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అవసరమైన భవన నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. దీంతో రోగులకు 30 పడకలపైనే సేవలు అందిస్తున్నారు. ఈ ఆస్పత్రికి గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ మండలాలకు చెందిన రోగులు వస్తుంటారు. ప్రతి రోజూ 300నుంచి 350 వరకు ఓపీ ఉంటుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆస్పత్రిలో ఉన్న 30 పడకలు సరిపోకవడంతో ఒక బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స అందించాల్సి వస్తుంది. కొన్నిసార్లు జిల్లా కేంద్రాసుపత్రికి లేదా ఘెషా ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారని రోగుల కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులను వేరే ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రిలో ముగ్గురు గైనకాలిజిస్టులు ఉన్నా ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేయడం ఏమిటని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ 18 మంది వైద్యుల అవసరం కాగా 13 మంది ఉన్నారు. ఐదు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ముగ్గురు వైద్యులు సెలవుల్లో ఉన్నారు. సీఏఎస్‌ జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, రేడియాలజీ, సివిల్‌ సర్జన్‌ (ఆర్‌ఎంవో), ఎంబీఎస్‌యూకు సంబంధించి వైద్యుల కొరత ఉంది. శస్త్ర చికిత్సలు అవసరమైన రోగులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఉన్న వారిలో కూడా కొందరు సక్రమంగా అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఒకే గదిలో ఇద్దరు వైద్యులు రోగులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలోనే మందులతో ఉన్న అట్టపెట్టెలను ఉంచడంతో రోగులు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇరుకు గదుల్లో సేవలు పొందాల్సి వస్తుంది. గత డిసెంబరులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఈ ఆస్పత్రిని సందర్శించారు. భవన నిర్మాణాలపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి నాటికి పనులు పూర్తి చేసి, భవనాన్ని అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. పనులు పూర్తయితే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.

అత్యవసర కేసులు మాత్రమే రిఫర్‌

ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతి నెల వంద ప్రసవాలు లక్ష్యం కాగా, 60 నుంచి 70 వరకు శస్త్రచికిత్సలతో పాటు సాధారణ ప్రసవాలు చేస్తున్నాం. అత్యవసర కేసులను మాత్రమే జిల్లా కేంద్రానికి తరలిస్తున్నాం. వంద పడకల ఆసుపత్రి అయినా ఇంకా 30 పడకల్లో సేవలు అందజేయాల్సి వస్తుంది.

-డాక్టర్‌ జగదీష్‌కుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌, గజపతినగరం


భవనాలు పూర్తయ్యేదెప్పుడో?

రాజాం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇది పేరుకే పెద్దాస్పత్రి తప్ప సేవలు మాత్రం ఆ స్థాయిలో లేవు. వసతులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ అయినా ఇంకా అస్తవ్యస్త, అరకొర నిర్మాణాలే దర్శనమిస్తోన్నాయి. విలువైన పరికరాలు పెట్టుకునేం దుకు గదులు లేవు. ఆరుబయటే ఓపీ చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర, తెర్లాం, జి.సిగడాం, పొందూరు తదితర మండలాల ప్రజలకు రాజాం ఆస్పత్రే పెద్దదిక్కు. సీహెచ్‌సీగా ఉన్న ఈ ఆస్పత్రిని వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. అదనపు గదుల నిర్మాణం, వైద్య పరికరాల ఏర్పాటుకు గాను రూ.6.80 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఈ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో జగన్‌ సర్కారు మొండి చేయి చూపింది. దీంతో కాంట్రాక్టర్‌ పనులను మధ్యలోనే నిలిపివేశాడు. దీంతో ఎక్కడికక్కడే భవన నిర్మాణ సామగ్రి పడి ఉంది. ప్రస్తుతం సూపర్‌ స్పెషాలిటీకి సంబంధించి 11 రకాల సేవలను ఆరు గదుల్లోనే అందిస్తున్నారు. ఇంకా బ్లడ్‌ బ్యాంక్‌, అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌తో పాటు ఇతర గదుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా మంజూరైన 300 ఎంఎం ఎక్స్‌రే యంత్రాన్ని పెట్టేందుకు గది లేకపోవడంతో దాన్ని ఆస్పత్రి ప్రాంగణంలో వదిలేశారు. బ్లడ్‌ బ్యాంకుకు సంబంధించిన విలువైన సామగ్రి కూడా ఆరుబయటే నిరుపయోగంగా ఉంది. అత్యవసరవేళ రోగులకు రక్త కావాలంటే శ్రీకాకుళం, తదితర ప్రాంతాల్లోని బ్లడ్‌ బ్యాంకులకు పరుగెత్తాల్సి వస్తోందని వారి సంబంధికులు చెబుతున్నారు. రోజుకు సగటున అన్ని విభాగాలకు కలిపి ఓపీ 500 వరకూ ఉంటుంది. కానీ, ఓపీ చూసేందుకు కనీసం గదులు లేకపోవడంతో ఆరుబయట, ఆస్పత్రి ప్రాంగణంలో రోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆస్పత్రిపై స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. త్వరలో పెండింగ్‌ పనులు పూర్తిచేయించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

సమస్యలు నిజమే..

ఆస్పత్రిలో సమస్యలు ఉన్న మాట వాస్తవం. అయినా రోగులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలందిస్తున్నాం. ఆస్పత్రి అదనపు గదుల సమస్యను స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో తొందరగా పనులు పూర్తిచేయడానికి ప్రత్యేకంగా ఇంజనీరును నియమించారు. త్వరలో పనులు పూర్తవుతాయన్న నమ్మకం ఏర్పడింది.

-డాక్టర్‌ హరిబాబు, సూపరింటెండెంట్‌, రాజాం ప్రాంతీయ ఆస్పత్రి


2rjp1.gif

ఆసుపత్రి బయటే పడిఉన్న విలువైన పరికరాలు

Updated Date - Feb 08 , 2025 | 12:11 AM