traffic rules: ట్రాఫిక్ నిబంధనలు పాటించండి
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:37 PM
traffic rules:వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు.

- కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం సందర్భంగా పోస్టర్లు, కరప త్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై సురక్షిత ప్రయాణ (సడక్ సురక్ష అభియాన్) ప్రచారం-2025లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్డుభద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని కోసం వలంటీర్లను గుర్తించి శిక్షణ ఇవ్వడం, వాహన డ్రైవర్లకు ఆరోగ్య తనిఖీ, కంటి పరీక్షలు నిర్వహించడం, తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక, జిల్లా రవాణా అధికారి టి.దుర్గా ప్రసాద్‌రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం.శశికుమార్, అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ జి.సీతారాం, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు జి.సత్యనారాయణ, ఎన్.రమేష్ కుమార్, బి.కాశీరాంనాయక్, మెడికల్ ఆఫీసర్ పి.నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ మరుగుదొడ్లు అవసరం
జిల్లాలో సామాజిక మరుగుదొడ్లు నిర్మాణం అవసరం ఉందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను స్వచ్ఛత దిశగా తీర్చిదిద్దేందుకు వివిధ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సలహాదారు శ్రీనివాసన్ సహాయాన్ని కూడా తీసుకున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించామ న్నారు. ప్రతి గ్రామంలో వలంటీర్లను ఏర్పాటు చేసి స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పార్వతీపురంలో డంపింగ్‌యార్డు నిర్మాణాన్ని నిర్దేశిత సంస్థ చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో సామాజిక మరుగుదొడ్లు నిర్మాణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకరించాలని కోరారు.
జిల్లాలో జీడిపప్పు ప్రాసెసింగ్..
జిల్లాలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్వతీపురం, వీరఘట్టంలో గిడ్డంగులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చునని అన్నారు. సాలూరు, గుమ్మలక్ష్మీపురం, కురపాంలలో ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన యంత్ర పరికరాలు, గోనె సంచులు సమకూర్చడంతో పాటు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. సీతంపేట ప్రాంతంలో ఇప్పటికే జీడిపప్పు ప్రాసెసింగ్ జరుగుతుందని, దాని ఆధారంగా ఇతర చోట్ల లైసెన్స్ మంజూరు తదితర అంశాలను కూడా పరిశీలించాలని అన్నారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై.సత్యంనాయుడు మాట్లాడుతూ.. గుమ్మలక్ష్మీపురం, సాలూరు, మక్కువలో ప్రస్తుతానికి రెండు చొప్పున ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు.