Counterfeits నకిలీలపై ఫోకస్
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:22 AM
Focus on Counterfeits జిల్లా పరిధిలో నకిలీ దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రత్యేక వైద్య బృందాలు తనిఖీలకు శ్రీకారం చుట్టాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఎక్కువగా దివ్యాంగ పింఛన్లు మంజూరైనట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. అనర్హులను గుర్తించాలని ఆదేశించడంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

అనర్హుల గుర్తింపునకు ముమ్మర చర్యలు
ధ్రువపత్రాల పరిశీలనతో పలువురిలో ఆందోళన
గరుగుబిల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో నకిలీ దివ్యాంగ పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రత్యేక వైద్య బృందాలు తనిఖీలకు శ్రీకారం చుట్టాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఎక్కువగా దివ్యాంగ పింఛన్లు మంజూరైనట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. అనర్హులను గుర్తించాలని ఆదేశించడంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. మొదటి ధపా మంచానికి పరిమితమైన వారితో పాటు డయాలసిస్, ఇతర సమస్యలతో ఉన్న వారిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత దఫదఫాలుగా మిగతా పింఛన్లను తనిఖీ చేయనున్నారు. దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు సరైనవా, కదా అన్న విషయం తేల్చనున్నారు. అయితే వైద్య బృందాల తనిఖీలతో అనర్హుల్లో ఆందోళన నెలకొంది.
నాలుగు వైద్య బృందాలు
దివ్యాంగ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు నాలుగు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు, వైద్యులు ఉన్నారు. కాగా మొదటి బృందం బలిజిపేట, సీతానగరం, గరుగుబిల్లి, పార్వతీపురం మండలం, రెండో టీము పార్వతీపురం, కొమరాడ, జియ్యమ్మవలసలో తనిఖీలు చేపట్టనున్నారు. మూడో టీము కురుపాం, భామిని, వీరఘట్టం, నాలుగో టీము పాచిపెంట, సాలూరు మండలం, పట్టణంలో విచారణ చేపట్టనున్నారు.
ఐదు పంచాయతీల్లో ...
గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, దళాయివలస, రావుపల్లి, పెద్దూరు, సంతోషపురం పంచాయ తీల్లో సోమవారం దివ్యాంగ పింఛన్‌దారుల సదరం ధ్రువీకరణ పత్రాలను అధికారుల బృందం పరిశీలించింది. ఇక బీవీ పురం, ఉద్దవోలు పంచాయతీల్లో కొందరికి ముందస్తుగా నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో జి.పైడితల్లి తెలిపారు.
నిలిచిన సదరం
దివ్యాంగ పింఛన్ల తనిఖీలు చేపడుతుండడంతో ప్రభుత్వం సదరం శిబిరాలతో పాటు సర్టిఫికెట్ల జారీని నిలుపుదల చేసింది. పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తర్వాతే సదరం ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే అవకాశం ఉంది.
పింఛన్‌దారులు ఇలా..
జిల్లాలో పలు రకాల పింఛన్లు 1,42,393 వరకు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య 7,685, చేనేత 758, దివ్యాంగ 16,857, వితంతు 34,502, తాడి హపర్స్ 192, ట్రెడిషినల్ క్యాబర్స్ 1855, అభయ హస్తం 4575, ట్రాన్స్‌జెండర్స్ 12, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు 656 పింఛన్లకు ప్రతి నెలా సుమారు రూ. 60 కోట్లు వెచ్చిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నకిలీ దివ్యాంగ పింఛన్లపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం రెండు నెలల్లోగా ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసి ఉగాది కానుకగా కొత్త పింఛన్లపై తీపి కబురు వినిపిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రత్యేక బృందం నియామకం
జిల్లా పరిధిలో దివ్యాంగగ పింఛన్ల తనిఖీలకు ప్రత్యేక వైద్య బృందాల నియామకం జరిగింది. సోమ, మంగళవారాల్లో గుర్తించిన గ్రామాల్లో వారు తనిఖీలు చేయనున్నారు. రెండు రోజుల పాటు గుర్తించిన తర్వాత ధపధపాలుగా పలు రకాల పింఛన్లపై నిశితంగా పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తాం.
- వై.సత్యంనాయుడు, డీఆర్‌డీఏ పీడీ, పార్వతీపురం మన్యం