Ekalavya School: ఎట్టకేలకు..
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:13 AM
Ekalavya School: కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల భవనం సిద్ధమైంది. ఆరేళ్ల పాటు ఆగుతూ.. సాగుతూ జరిగిన పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ భవనాన్ని శనివారం పాఠశాల ప్రిన్సిపాల్‌కు అధికారులు అప్పగించనున్నారు.

- పూర్తయిన కురుపాం ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం
- ఆరేళ్ల పాటు సాగిన పనులు
- రేపు ప్రిన్సిపాల్‌కు అప్పగించనున్న అధికారులు
-త్వరలో తరగతులు ప్రారంభం
కురుపాం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల భవనం సిద్ధమైంది. ఆరేళ్ల పాటు ఆగుతూ.. సాగుతూ జరిగిన పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ భవనాన్ని శనివారం పాఠశాల ప్రిన్సిపాల్‌కు అధికారులు అప్పగించనున్నారు. త్వరలో ఈ భవనంలోనే విద్యార్థులకు తరగతులు కూడా ప్రారంభంకానున్నాయి. 2012లో కేంద్ర గిరిజనశాఖ మంత్రిగా ఉన్న వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ రాష్ట్రానికి 11 ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేయించారు. మైదాన ప్రాంతాల్లో నిర్మాణానికి రూ.12 కోట్లు, గిరిశిఖర ప్రాంతాల్లో నిర్మాణానికి రూ.14 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా కురుపాం మండలానికి ఒక ఏకలవ్య పాఠశాల మంజూరైంది. దీనికోసం కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల పక్కన ఉన్న స్థలాన్ని కేటాయించారు. అయితే, ఇక్కడ ఏడేళ్ల వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. కురుపాంలో వసతులు లేకపోవడంతో 2016-17 విద్యా సంవత్సరంలో ఏకలవ్య విద్యార్థులకు పార్వతీపురం మండలం ఎస్.బెలగాం పాఠశాలలో తరగ తులు ప్రారంభించారు. కురుపాంలో భవన నిర్మాణ కోసం 2017లో టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలవగా సత్యసాయి కనస్ట్రక్షన్స్ ఒక్కటే దాఖలు చేసింది. ఆ సంస్థతో గిరిజన ఇంజనీరింగ్ అధికారులు ఒప్పందం చేసుకున్న తర్వాత కొందరు కోర్టుకు వెళ్లారు. సత్యసాయి కనస్ట్రక్షన్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 2019లో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి ఏకలవ్య పాఠశాల భవనం పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. పనులు పూర్తి కాకుండానే ఎన్నికల ముందు అప్పటి డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర పాఠశాల భవనాన్ని హడావుడిగా ప్రారంభించేశారు. పనులు అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులకు ఎస్.బెలగాంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై దృష్టిసారించింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఒత్తిడితో భవన నిర్మాణం పూర్తయ్యింది. కాగా, అదనపు భవనాలకు మరో రూ.4కోట్లు మంజూరయ్యాయి. అయితే, కాంట్రాక్టర్ పిల్లర్లు వేసి మిగతా పనులు చేయలేనని చేతులు ఎత్తేశాడు.
ప్రిన్సిపాల్‌కు అప్పగిస్తాం..
ఏకలవ్య పాఠశాల భవనం సిద్ధమైంది. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం. రూ.12 కోట్లతో స్కూల్ భవనం, బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహం, డైనింగ్ హాల్, ప్రిన్సిపాల్, సిబ్బంది క్వార్టర్స్‌లు పూర్తి చేశాం. విద్యుత్ సదుపాయం కూడా కల్పించాం. ప్రస్తుతం కాలువ పనులు చేస్తున్నాం. ఫిబ్రవరి 1వ తేదీన ప్రిన్సిపాల్‌కు భవనాన్ని అప్పగిస్తాం. రూ.4కోట్లతో అదనపు భవనాల నిర్మాణం ప్రారంభించినప్పటికీ కాంట్రాక్టరు పనులు చేయకుండా నిలుపుదల చేశాడు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ఇంకా ప్రహరీ నిర్మాణానికి రూ.70లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు వచ్చిన వెంటనే ఈ పనులు చేస్తాం.
-చాణిక్య, డీఈఈ, గిరిజన ఇంజనీరింగ్ శాఖ, భద్రగిరి
ప్రహరీ నిర్మించాలి
ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం పూర్తయ్యింది. ఇంకా కిటికీలకు సేఫ్టీ గ్రిల్స్ అమర్చాల్సి ఉంది. అలాగే, రక్షణ గోడను నిర్మించాల్సి ఉంది. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలి.
-యోగేందర్ బహుదూర్, ప్రిన్సిపాల్, ఏకలవ్య పాఠశాల, కురుపాం.