Festival పండగ రద్దీ
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:07 AM
Festival Rush సంక్రాంతికి సమయం సమీపిస్తుండడంతో జిల్లాకు చెందిన వలస పక్షులు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దీంతో జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

పార్వతీపురం టౌన్/ పాలకొండ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి సమయం సమీపిస్తుండడంతో జిల్లాకు చెందిన వలస పక్షులు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. దీంతో జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో రద్దీగా మారుతున్నాయి. పండగ సెలవుల నేపథ్యంలో విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు కుటుంబాలతో స్వస్థలాలకు పయన మవుతున్నారు. అయితే అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినా.. తీవ్ర రద్దీ ఉండడంతో బస్సులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు కనిపిస్తే చాలు పరుగులు తీస్తున్నారు. సీటు కోసం ఎగబడుతున్నారు. మొత్తంగా అష్టకష్టాలు పడుతూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలోని రైల్వే, బస్‌స్టేషన్లలో ప్లాట్‌ఫాంలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. వలస పక్షుల రాకపోకలతో జిల్లా కేంద్రం కిక్కిరిసి పోయింది.
పాలకొండ నుంచి ప్రత్యేక సర్వీసులు
సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి విశాఖకు 29, విజయవాడ, హైదరాబాద్‌కు రెండు బస్సులు నడుపుతున్నట్టు డీఎం వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం తదితర ప్రాంతాలకు అదనపు సర్వీసులు నడుపుతున్నామని, చార్జీలు పెంచలేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం, విజయవాడకు నడుపుతున్న ప్రైవేటు బస్సు చార్జీలు మాత్రం పెరిగాయి. నిన్న మొన్నటి వరకు విజయవాడకు రూ.800 తీసుకోగా.. ప్రస్తుతం రూ.300 అదనంగా వసూలు చేస్తున్నారు.