Share News

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:24 AM

జిల్లాలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు హత్య కేసును పోలీసులు ఛేదించారు.

 ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌, వెనుకన నిందితులు

-సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

- ఇద్దరు నిందితుల అరెస్టు

- వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్‌జిందాల్‌

విజయనగరం క్రైం/తెర్లాం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కోనారి ప్రసాద్‌(28) ఈ నెల 10న హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు కోనారి అచ్యుతరావు, కోనారి శివకృష్ణ.. హతుడు ప్రసాద్‌ దగ్గరి బంధువులు. దీంతో ప్రసాద్‌ తరచూ అచ్యుతరావు ఇంటికి వెళ్తుండేవాడు. అచ్యుతరావు భార్యతో మాట్లాడడం, ఫోన్లు చేస్తుండేవాడు. వదిన ప్రవర్తనపై అనుమానంతో శివకృష్ణ ఆమె వాట్సాప్‌ను వెబ్‌ ద్వారా ల్యాప్‌టాప్‌లో లాగిన్‌ అయ్యాడు. ప్రసాద్‌, తన వదిన మధ్య వాట్సాప్‌లో అశ్లీల సందేశాలు జరుగుతున్నట్టు గుర్తించాడు. వాటిని స్ర్కీన్‌ షాట్‌ తీసి, తన అన్నయ్య అచ్యుతరావుకు చూపించాడు. వారిమధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. దీంతో ప్రసాద్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న ప్రసాద్‌ ఈ నెల 7న గ్రామంలోకి వచ్చాడు. ఈ విషయాన్ని అచ్యుతరావు విశాఖపట్నంలో ఉన్న తన తమ్ముడు శివకృష్ణకు ఫోన్‌లో సమాచారం అందించాడు. దీంతో శివకృష్ణ నెమలాం వచ్చాడు. ప్రసాద్‌.. అచ్యుతరావు ఇంటికి వచ్చి 10న పూరిపేట గ్రామంలోని తన మేనమామ ఇంటికి వెళ్తున్నట్టు అచ్యుతరావు, శివకృష్ణకు చెప్పాడు. తిరుగు ప్రయాణంలో తమకు సమాచారం ఇచ్చినట్టయితే, గ్రామ శివారులో కలుద్దామని వారు నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన ప్రసాద్‌ 10వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో అచ్యుతరావుకి ఫోన్‌ చేసి పూరిపేట నుంచి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. తాము రేవడి పొలాల్లో ఉన్నట్టు వారు చెప్పడంతో ప్రసాద్‌ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అచ్చుతరావు, శివకృష్ణ ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారం ప్రసాద్‌ వచ్చిన వెంటనే కర్రలతో అతని తలపై కొట్టారు. దీంతో ప్రసాద్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని కాలువలో పడిపోయాడు. నిందితులు అక్కడకు చేరుకుని తలపై కర్రలతో కొట్టి హత్య చేశారు. ఆధారాలు లభించకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రసాద్‌ ఫోన్‌ను వ్యవసాయ బావిలో పడేశారు. ప్రసాద్‌ మృతదేహాన్ని రహదారిపైకి తీసుకువచ్చి పడేశారు. మోటార్‌ సైకిల్‌ని కూడా ధ్వంసం చేసి రోడ్డుపై పడేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రసాద్‌ చనిపోయినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అచ్యుతరావు, శివకృష్ణను అదుపులోకి తీసుకుని తనదైన శైలిలో విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. వారిని అరెస్టు చేసి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు వినియోగించిన కర్రలను సీజ్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, సీఐ నారాయణరావు, ఎస్‌ఐ సాగర్‌బాబు, పీసీలు నాగరాజు, పృథ్వీరాజ్‌లను అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు.

Updated Date - Feb 15 , 2025 | 12:24 AM