Share News

quary తవ్వేసి.. పేల్చేసి..!

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:36 PM

Excavated.. Exploded..! ‘రాతి క్వారీకి అనుమతివ్వండి. భారీ శబ్దాలు రానీయం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం.. రహదారులు వేస్తాం’ అని ప్రజాభిప్రాయ సేకరణలో మాట ఇచ్చిన నిర్వాహకులు అవన్నీ పెడచెవిన పెట్టారని, భారీగా బ్లాస్టింగ్స్‌ చేస్తూ బెదరగొడుతున్నారని వేపాడ మండలంలోని సోంపురం, వావిలపాడు, వీలుపర్తి గ్రామ పంచాయతీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల్లో జరిగే బ్లాస్టింగ్స్‌తో చాలా ఇళ్ల గోడలు పగుళ్లిచ్చాయని చెబుతున్నారు.

quary తవ్వేసి.. పేల్చేసి..!
రిగ్‌ బ్లాస్టింగ్‌ యంత్రంతో లోతుగా తవ్వేస్తున్న దృశ్యం

తవ్వేసి.. పేల్చేసి..!

రాతి క్వారీల్లో బ్లాస్టింగ్‌తో భయాందోళన

నిబంధనలు అతిక్రమించి తవ్వకాలు

భారీ శబ్దాలతో వణుకుతున్న ప్రజలు

కనిపించని రక్షణ చర్యలు

పట్టని మైనింగ్‌శాఖ అధికారులు

వేపాడ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘రాతి క్వారీకి అనుమతివ్వండి. భారీ శబ్దాలు రానీయం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం.. రహదారులు వేస్తాం’ అని ప్రజాభిప్రాయ సేకరణలో మాట ఇచ్చిన నిర్వాహకులు అవన్నీ పెడచెవిన పెట్టారని, భారీగా బ్లాస్టింగ్స్‌ చేస్తూ బెదరగొడుతున్నారని వేపాడ మండలంలోని సోంపురం, వావిలపాడు, వీలుపర్తి గ్రామ పంచాయతీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల్లో జరిగే బ్లాస్టింగ్స్‌తో చాలా ఇళ్ల గోడలు పగుళ్లిచ్చాయని చెబుతున్నారు.

వేపాడ మండలంలోని సోంపురం, వావిలపాడు, వీలుపర్తి గ్రామ పంచాయతీల పరిధిలో రాతి క్వారీలు నడుస్తున్నాయి. వాటి యజమానులు కంప్రషర్లతో బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. భారీ రిగ్గు మిషన్లు కూడా ఉపయోగిస్తున్నారు. భూమి లోపలకు 50 అడుగుల వరకు తవ్వేస్తున్నారు. ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అధికారులు అనుమతి ఇచ్చేసి కనీసం నిఘా పెట్టకపోవడంపై విస్తుపోతున్నారు. వీలుపర్తి రెవెన్యూలోని సర్వే నెంబరు 6, పెదదుంగాడ రెవెన్యూలో సర్వే నెంబరు 7,45లలో ఉన్న క్వారీల్లో భారీ బ్లాస్టింగ్‌ జరుగుతోంది. నిర్వాహకులు 50 అడుగుల లోతుకు వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారణంగా నివాసాల వరకు భూమి కంపిస్తోందనేది స్థానికుల ఆందోళన. చామలాదేవి ఆగ్రహారం, కొతుకుపాలెం, వెల్దాం, బొర్రవలస, పెదదుంగాడ, చినదుంగాడ, కడకొండ తదితర గ్రామాల వరకు బ్లాస్టింగ్‌ శబ్ధం వినిపిస్తోంది. ఒక్కోసారి గుండెలు అదురుతున్నాయని వృద్ధులు వాపోతున్నారు. కొందరు మైనింగ్‌ అధికారుల అండదండలతోనే రాతి క్వారీ యజమానులు పెచ్చరిల్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా కాసుల కక్కుర్తితో పట్టించుకోవడం లేదంటున్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు క్వారీ అనుమతికి ముందు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో నిర్వాహకులు చెప్పిన మాటలకు, వాస్తవంగా జరుగుతున్న తంతుకు ఎక్కడా పొంతన లేదు. ప్రజలకే కాదు పశు పక్ష్యాదులకూ హాని తలపెట్టబోమని నాడు హామీ ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని, రోడ్లు వేస్తామని, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ చూసి నిజమేనని నమ్మి ఆయా గ్రామాల వారు క్వారీకి అంగీకరించారు. తర్వాత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందంటున్నారు. ఇక్కడి పరిస్థితిపై పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కనీసం ఇటువైపు రాలేదు. క్వారీ, క్రషర్ల యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చి దర్యాప్తులకు మైనింగ్‌ అధికారులు వస్తారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆందోళనకు దిగుతాం

రాతి క్వారీల యజమానులు చేపట్టే రిగ్‌ బ్లాస్టింగ్‌ వల్ల ప్రజల ప్రాణాలకు దిక్కులేకుండా పోతోంది. గుండెలు అదురుతున్నాయి. పిల్లలు, వృద్ధులు భయపడుతున్నారు. పశువులు, మూగజీవాలు ఒక్కోసారి ఉన్నఫలంగా పరుగులు పెడుతుంటాయి. అధికారులు పట్టించుకోకపోతే జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన చేపడతాం.

పి.సన్యాసిరావు, గిరిజన నాయకుడు, పెదదుంగాడ

రిగ్‌ బ్లాస్టింగ్స్‌కు అనుమతులు ఇవ్వలేదు

రిగ్‌ బ్లాస్టింగ్స్‌కు సంబంధించి ఏ ఒక్కరికీ అనుమతులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 157 మందిని గుర్తించి వారి నుంచి జరిమానా వసూలు చేశాం.

- మోహనరావు, డిప్యూటీ డైరెక్టర్‌, భూగర్భ గనులశాఖ

Updated Date - Jan 07 , 2025 | 11:36 PM