Share News

Orders… Ignored! మంత్రి చెప్పినా.. కలెక్టర్‌ ఆదేశించినా.. బేఖాతర్‌!

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:44 PM

Even if the Minister Speaks… Even if the Collector Orders… Ignored! సాలూరు మున్సిపాల్టీలో పాలనా వ్యవస్థ గాడి తప్పింది. కొంతమంది అధికారులు, పాలకవర్గం సభ్యుల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. వాటి కోసం మంజూరైన నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.

  Orders… Ignored! మంత్రి చెప్పినా.. కలెక్టర్‌ ఆదేశించినా.. బేఖాతర్‌!
సాలూరు మున్సిపల్‌ కార్యాలయం

ప్రజా సమస్యలను పట్టించుకోని వైనం

అభివృద్ధికి సహకరించని పాలకవర్గం..

ఆర్థిక సంఘం నిధులు వెనక్కి.. గాడి తప్పిన పాలన

అధ్వానంగా పారిశుధ్యం.. ప్రజల ఇబ్బందులు

ఎక్కడికక్కడే అక్రమ నిర్మాణాలు.. వేధిస్తున్న ట్రాఫిక్‌ సమస్య

సాలూరు, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): సాలూరు మున్సిపాల్టీలో పాలనా వ్యవస్థ గాడి తప్పింది. కొంతమంది అధికారులు, పాలకవర్గం సభ్యుల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. వాటి కోసం మంజూరైన నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో మున్సిపల్‌ సిబ్బంది తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సాలూరు పట్టణంలోనే మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఉంటున్నా.. వారు ఏ మాత్రం మారడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఓ వైపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, మరోవైపు మంత్రి ఆదేశిస్తున్నా స్పందించడం లేదు. మున్సిపాల్టీలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నా.. పారిశుధ్యం క్షీణించినా.. ట్రాఫిక్‌ కష్టాలు తీవ్రమవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో పట్టణవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అధికారులు ఇలా.. పాలకవర్గం అలా..!

- మున్సిపల్‌ అధికారులు వచ్చామా...వెళ్లామా...? అన్న చందంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కొరవడడంతో కొందరు క్షేత్రస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌ పాలక వర్గంలో అత్యధికులు వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు. అయితే వారిలో కొందరు పట్టణంలో అభివృద్ధి పనులకు సహకరించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

- పట్టణంలో పలు వార్డుల్లో సాముహిక మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి. కొన్నేళ్లుగా అవి మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో వినియోగానికి దూరమై.. అధ్వానంగా మారాయి. మున్సిపాల్టీలో ప్రత్యేక నిధులున్నా.. అధికారుల అలసత్వం కారణంగా సామూహిక మరుగుదొడ్లు వినియోగంలోకి రావడం లేదనే ఆరోపణలున్నాయి.

- సాలూరులో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. మున్సిపాల్టీకి వస్తున్న ఆదాయం కూడా ఏమవుతుందో తెలియని పరిస్థితి..

ట్రాఫిక్‌కు అంతరాయం..

ట్రాఫిక్‌ సమస్య పట్టణవాసులను దీర్ఘకాలికంగా వేధిస్తోంది. ప్రధానంగా మున్సిపాల్టీలో శివాజీ బొమ్మ, మామిడిపల్లికి వెళ్లే రోడ్డుతో పాటు ప్రధాన రాహదారిలో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలకు చెందిన వాహనాలు కూడా పట్టణ ప్రధాన రహదారి మీదుగా ప్రయాణాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది. ఇరుకు రహదారులపై స్థానికులు నడిచి కూడా వెళ్లలేని పరిస్థితి. మరోవైపు పట్టణంలో పార్కింగ్‌ స్థలాలను వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు అద్దెకు ఇస్తున్నాయి. మరికొన్ని వాణిజ్య సంస్థలు తమ సెల్లార్లను ఉపయోగించడం లేదు. దీంతో రోడ్డుపై వాహనాలను పార్కింగ్‌ చేస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దండిగాం రోడ్డులో సుమారు రూ.30 లక్షలతో నిర్మించిన రైతు బజార్‌ వినియోగంలోకి రావడం లేదు. దీంతో చిరువ్యాపారులు, రైతులు పట్టణంలోని రోడ్లపైనే కాయగూరలు విక్రయించాల్సి వస్తోంది. దీంతో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది.

- మున్సిపాల్టీలో ప్రధాన రహదారితో పాటు కోట వీధి జంక్షన్‌లో చేపలు, మాంసం అమ్మకాలు సాగిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

పడకేసిన పారిశుధ్యం ..

- మున్సిపాల్టీలో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడిక్కడ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. 29 వార్డుల్లో కాలువలు పూర్తిగా పూడికలతో నిండాయి. దీంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. ఓ వైపు దుర్వాసన.. మరోవైపు రాత్రి వేళల్లో దోమల బెడద ఎక్కువగా ఉండడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు తరచూ రోగాల బారిన పడుతున్నారు. ఒకప్పుడు స్వచ్ఛ మున్సిపాల్టీగా జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న మున్సిపాల్టీ నేడు చెత్తలతో కంపు కొడుతోంది.

- మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పకీర్‌రాజు బదిలీపై వెళ్లి సుమారు ఆరు నెలలు కావస్తున్నా.. ఇంకా ఆ పోస్ట్‌లో ఎవర్నీ నియమించలేదు. హెల్త్‌ అసిస్టెంట్‌ రాజీవ్‌ ప్రస్తుతం ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా అదనపు విధులు నిర్వహిస్తున్నారు.

- మున్సిపాల్టీలో పెరిగిన జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను పెంచడం లేదు. దీంతో పారిశుధ్య మెరుగు చర్యలకు ఇబ్బందులు తప్పడం లేదు. రెగ్యులర్‌ కార్మికులు 33 మంది ఉన్నారు. 85 మంది ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారికి అవసరమైన సబ్బులు, నూనె వంటి సామగ్రిని కూడా సక్రమంగా అందించడం లేదు. తరచూ వేతన బకాయిల కోసం కార్మికులు ధర్నా చేయాల్సి వస్తోంది.

- పట్టణంలో పారిశుధ్య నిర్వహణ కోసం లక్షలాది రుపాయలతో కొనుగోలు చేసిన వాహనాలు సైతంమూలకు చేరాయి. అవి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. తుప్పుపట్టిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

శ్యామలాంబ పండగలోగా పరిస్థితి మారేనా..

పట్టణ గ్రామ దేవత శ్యామలాంబ పండగకు సమయం సమీపిస్తోంది. మే 18, 19, 20ను భారీగా ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 15ఏళ్ల తర్వాత పండగ ప్రకటించడంతో పట్టణవాసులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మున్సిపాల్టీలో పరిస్థితి మాత్రం ఆ లోపుగా మారుతుందా? పాలనా వ్యవస్థ గాడిలో పడేనా? అన్న సందేశాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపాల్టీవాసులు కోరుతున్నారు.

సహకరించడం లేదు..

సాలూరు మున్సిపాల్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు ఎప్పుడు వస్తారో .. ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదు. ఈ వైఖరి కారణంగానే మున్సిపాల్టీకి మంజూరైన 14, 15 ఆర్థిక సంఘాల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. పట్టణంలో పూర్తిగా పాడైన సామూహిక మరుగుదొడ్లను వినియోగంలోకి తెచ్చేందకు నిధులు మంజూరు చేసినా.. వాటి పనులు చేపట్టలేదు. ఇంజనీరింగ్‌ , రెవెన్యూ , ప్లానింగ్‌ విభాగాలు ఏం చేస్తున్నాయో తెలియడం లేదు. అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవడం లేదు. అధికారులతో పాటు పాలకవర్గం కూడా సహకరించడం లేదు.

- గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి

========================

నోటీసులు ఇచ్చాం

ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదు మేరకు వాహనాల పార్కింగ్‌కు సెల్లార్లను వినియోగించని వాణిజ్య సముదాయాఆలు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నలుగురికి నోటీసులు అందజేశాం.

- ఝాన్సీ, పట్టణ ప్రణాళికా అధికారి, సాలూరు మున్సిపాల్టీ

Updated Date - Feb 07 , 2025 | 11:44 PM