Share News

Even if it's seven years old! ఏడేళ్లవుతున్నా ఇవ్వట్లే!

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:20 AM

బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని హాస్పిటల్‌ రోడ్డు (బలిజిపేట రోడ్డు) విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లస్థలాలు, భవనాల్లో కొంత భాగాన్ని కోల్పోయిన వారికి ట్రాన్ప్‌ఫర్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ బాండ్లు (టీడీఆర్‌) జారీలో మున్సిపల్‌ అధికారులు వివక్ష చూపుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Even if it's seven years old! ఏడేళ్లవుతున్నా ఇవ్వట్లే!
బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయం

- టీడీఆర్‌ బాండ్ల జారీలో అధికారుల జాప్యం

- ఇప్పటి వరకు 350 మందికి అందజేత

- ఇంకా మిగిలి ఉన్న బాధితులు

బొబ్బిలి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని హాస్పిటల్‌ రోడ్డు (బలిజిపేట రోడ్డు) విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లస్థలాలు, భవనాల్లో కొంత భాగాన్ని కోల్పోయిన వారికి ట్రాన్ప్‌ఫర్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ బాండ్లు (టీడీఆర్‌) జారీలో మున్సిపల్‌ అధికారులు వివక్ష చూపుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్లు అవుతున్నా ఇంకా చాలామందికి టీడీఆర్‌ బాండ్లను అందించలేదు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో బొబ్బిలి కోర్టు జంక్షన్‌ నుంచి పోలీసు స్టేషన్‌ రోడ్డు, కోవెల సెంటర్‌, చర్చిసెంటర్‌ మీదుగా అమ్మిగారి కోనేరుగట్టు వరకు సుమారు 55 అడుగుల మేర రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. దీనిపై స్థానికులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తరువాత అనేక సంప్రదింపులు, చర్చలు, ఒప్పందాలు జరగడంతో రోడ్డు విస్తరణ పనులకు అందరూ సమ్మతించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లస్థలాలు, భవనాల్లో కొంత మేర కోల్పోయిన వారికి టీడీఆర్‌ బాండ్లు మంజూరు చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇంతవరకు సుమారు 350 మంది వరకు బాండ్లను అందించారు. ఇంకా 10 నుంచి 15 మందికి మంజూరు చేయడంలో మున్సిపల్‌ అధికారులు జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్‌ బాండ్ల జారీ, వినియోగానికి సంబంధించి పెద్దఎత్తున కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం.. దీనిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దర్యాప్తు నిర్వహిస్తుండడం తెలిసిందే. బొబ్బిలి మున్సిపాలిటీలో జారీ చేసిన టీడీఆర్‌ బాండ్లపై కూడా విజిలెన్స్‌ అధికారులు పలు దఫాలు దర్యాప్తు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికను పంపించారు.

టీడీఆర్‌ బాండ్‌ ఇవ్వలేదు

రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్‌ పార్కు సమీపంలో నేను కొంత స్థలాన్ని కోల్పోయాను. పట్టణాభివృద్ధికోసం అధికారులు, నాయకులు వచ్చి బతిమలాడితే అంగీకార పత్రంపై సంతకాలు చేశా. అయినప్పటికీ ఏడేళ్లుగా టీడీఆర్‌ బాండు ఇవ్వడం లేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు. ఇప్పటికైనా టీడీఆర్‌ బాండు మంజూరు చేయాలి.

- రెడ్డి వరలక్ష్మి, బొబ్బిలి పట్టణం

చర్యలు తీసుకుంటున్నాం

టీడీఆర్‌ బాండ్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంబంధిత యజమానులు వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటిని పరిశీలిస్తాం. అనంతరం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం నుంచి విలువాధారిత ధ్రువపత్రాలు, ఇతరత్రా ఆధారాలతో టౌన్‌ ప్లానింగ్‌ ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఆ వెంటనే టీడీఆర్‌ బాండ్లను మంజూరు చేస్తాం.

- రేవతి, టౌన్‌ప్లానింగ్‌ అధికారి, బొబ్బిలి

Updated Date - Feb 13 , 2025 | 12:20 AM