roads work సంక్రాంతికి డౌటే!
ABN , Publish Date - Jan 09 , 2025 | 11:48 PM
Doute for Sankranti! ‘సంక్రాంతికి రోడ్లు అన్నీ బాగుండాలి.. ఎక్కడా గుంత కనిపించకూడదు. పండుగకు వచ్చే వారు గుంతలకు ఫొటో తీసి పంపితే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా హెచ్చరించారు. అధినేత మాటతో రోడ్ల పనులైతే చేస్తున్నారు. కానీ వేగంగా సాగడం లేదు. కాంట్రాక్టర్లు నాణ్యతను పట్టించుకోకుండా నచ్చినట్లు చేసుకు పోతున్నారు. గోతుల్లో నిబంధనల మేర మెటల్‌ను మిక్స్ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
సంక్రాంతికి డౌటే!
పండుగకు రోడ్ల మరమ్మతులు చేస్తారా?
నాణ్యత పట్టించుకోలేదని ఆరోపణలు
పనులు చేసిన కొద్దిరోజులకే మళ్లీ గుంతలు
‘సంక్రాంతికి రోడ్లు అన్నీ బాగుండాలి.. ఎక్కడా గుంత కనిపించకూడదు. పండుగకు వచ్చే వారు గుంతలకు ఫొటో తీసి పంపితే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా హెచ్చరించారు. అధినేత మాటతో రోడ్ల పనులైతే చేస్తున్నారు. కానీ వేగంగా సాగడం లేదు. కాంట్రాక్టర్లు నాణ్యతను పట్టించుకోకుండా నచ్చినట్లు చేసుకు పోతున్నారు. గోతుల్లో నిబంధనల మేర మెటల్‌ను మిక్స్ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
విజయనగరం రింగురోడ్డు, జనవరి9 (ఆంధ్రజ్యోతి):
రోడ్ల పరిస్థితి గత ఐదేళ్ల కాలంలో దయనీయంగా మారిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక ప్రజల అవస్థలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. కనీసం సంక్రాంతి నాటికి గుంతలనైనా పటిష్టంగా కప్పించి ప్రజలు ఇబ్బంది లేని ప్రయాణం సాగించేలా చూడాలనుకుంది. దీనిపై అధికారులకు, నేతలకు కూడా సీఎం సూచించారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా బాధ్యత తీసుకుని రోడ్ల పనులను పరిశీలించాలని చెప్పారు. గోతులు లేని రోడ్ల నిర్మాణాలే లక్ష్యంగా ప్రభుత్వం నిధులను వదిల్చినప్పటికీ ఇప్పటికి సగం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ పనుల్లోనూ నాణ్యత లేదు. కొన్నిచోట్ల వేసిన రెండో రోజుకే రాళ్లు తేలిపోతున్నాయి. నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమౌతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా పనులు సాగిస్తూ మమ అన్పించేస్తున్నారు. వాటిని చూస్తున్న వారు ఈ రోడ్లు నెల రోజులైనా ఉంటాయా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లకు రూ.58 లక్షల 81 వేలు కేటాయించారు. ఈ నిధులతో నగరంలోని 50 డివిజన్ల పరిధిలో గుంతులు వున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి. నగరంలో దాదాపుగా 1, 655 గుంతలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అక్టోబరు నెలాఖరు నుంచి పనులు ప్రారంభయ్యాయి. జనవరి తొలి వారం నాటికి కేవలం 687 గుంతలనే పూడ్చారు. అలాగే నగరంలో వున్న అర్ అండ్ బీ రోడ్లలో రూ.14 కోట్ల 82 లక్షలతో పనులు చేపట్టారు. 121 గుంతలను గుర్తించి ఇప్పటి వరకూ 35 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారు. జిల్లాలో రాష్ట్ర రహదారులకు సంబంధించి రూ.8 కోట్ల 70 లక్షలతో పనులు చేపట్టారు. 55 గుంతలు గుర్తించి, ఇంత వరకూ 52 శాతం పనులే పూర్తి చేశారు. సంక్రాంతి పండుగ దాదాపు వచ్చేసింది. పనులు పూర్తికాలేదు. చేపట్టినవి కూడా నాణ్యతగా చేయలేదు.
యథాతథంగా రహదారులు
నగరపాలక సంస్థ, అర్‌అండ్‌బీ పరిధిలో పనులు చేసిన తోటపాలెం, కామాక్షినగర్, కెఎల్‌పురం, పూల్‌బాగ్, పద్మావతినగర్, నాయుడుకాలనీ, ద్వారకానగర్, బాబామెట్ట తదితర రోడ్లు మళ్లీ పూర్వ స్థితికి వస్తున్నాయి. ప్యాచ్‌వర్క్‌లు చేసిన రోడ్లలో మళ్లీ పాత చిత్రాలే కనిపిస్తున్నాయి. నగరపాలక సంస్థ ఇంజనీరింగు సిబ్బంది, అర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. కాంట్రాక్టర్లు తమకు నచ్చిన రీతిలో వీటిని పూర్తిచేసి బిల్లులకు సిద్ధమౌతున్నారు. ఇదే విషయమై నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు టి.రాయల్‌బాబు, అర్ అండ్ బీ ఈఈ ఎం జేమ్స్‌లను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ప్యాచ్ వర్క్‌లు జరుగుతుండగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడి రోడ్లు మళ్లీ దెబ్బతిన్నాయని, పనుల్లో నాణ్యత లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లు ఇచ్చేముందు నాణ్యతను పరిశీలిస్తామన్నారు.