Share News

అక్కడ మొక్కుబడి.. ఇక్కడ రాబడి

ABN , Publish Date - Feb 16 , 2025 | 12:20 AM

doctors cross the rules ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సగటు పౌరుడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే ఆలోచిస్తున్నాడు. అక్కడ సరైన వైద్య సేవలు అందుతుయా? నాణ్యమైన మందులు ఉంటాయా? బాధ్యతగా చూస్తారా? అని సందేహిస్తున్నారు. ప్రజలు భయపడుతున్నట్టే కొన్ని ఆస్పత్రుల వైద్యులు వ్యవహరిస్తున్నారు. రోగులను నిర్లక్ష్యంగా చూడడం.. తాము నిర్వహించే క్లినిక్‌లకు రమ్మని చెప్పడం.. ముందులు కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో కొనుగోలు చేసుకోమనడం... తదితర ఘటనలు జిల్లాలోని సర్కారు దవాఖానాల్లో సర్వసాధారణంగా మారాయి. ప్రభుత్వ వైద్యం అందక పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులేమో ప్రైవేటు రాబడికి అలవాటు పడిపోయారు.

అక్కడ మొక్కుబడి.. ఇక్కడ రాబడి

అక్కడ మొక్కుబడి.. ఇక్కడ రాబడి

రోగులను పట్టించుకోని ప్రభుత్వ వైద్యులు

ప్రైవేటు వైపు చూసేలా సూచనలు

క్లినిక్‌లు, ల్యాబ్‌లకు తరలింపు

తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం కొనుగోలు

ఆర్థిక భారాన్ని మోస్తున్న పేదలు

ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సగటు పౌరుడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే ఆలోచిస్తున్నాడు. అక్కడ సరైన వైద్య సేవలు అందుతుయా? నాణ్యమైన మందులు ఉంటాయా? బాధ్యతగా చూస్తారా? అని సందేహిస్తున్నారు. ప్రజలు భయపడుతున్నట్టే కొన్ని ఆస్పత్రుల వైద్యులు వ్యవహరిస్తున్నారు. రోగులను నిర్లక్ష్యంగా చూడడం.. తాము నిర్వహించే క్లినిక్‌లకు రమ్మని చెప్పడం.. ముందులు కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో కొనుగోలు చేసుకోమనడం... తదితర ఘటనలు జిల్లాలోని సర్కారు దవాఖానాల్లో సర్వసాధారణంగా మారాయి. ప్రభుత్వ వైద్యం అందక పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులేమో ప్రైవేటు రాబడికి అలవాటు పడిపోయారు.

- ఎస్‌.కోట శివారు సీతంపేటకు చెందిన ఓ మహిళకు చేతి మణికట్టు వద్ద భరించరాని నొప్పి వచ్చింది. దీంతో భర్త బుధవారం ఉదయం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో చూపించారు. చేతి మణికట్టును పరిశీలించిన వైద్యుడు నొప్పి నివారించే ఇంజక్షన్‌లు ఇక్కడ లేవని, ఓ ప్రైవేటు మెడికల్‌ షాపు వద్దకు మధ్యాహ్నం తీసుకురావాలని సూచించారు. అక్కడకు వెళ్లి కొనుగోలు చేశాక మహిళ మణికట్టుకు ఇంజక్షన్‌ చేశారు. ఫీజు రూ.300, ఇంజక్షన్‌కు రూ.1500, మందులకు రూ.600 వసూలు చేశారు. వీటితో పాటు పరీక్షలు చేయాలని ల్యాబ్‌కు పంపించారు. అక్కడ రూ.3000 ఖర్చువుతుందని చెప్పడంతో మహిళ భర్త తనకు తెలిసిన మరో లాబ్‌లో రూ.1300 చెల్లించి పరీక్షలు చేయించారు. కాగా డాక్టర్‌ ఇంజక్షన్‌ చేశాక మహిళ చేయి వాచిపోయింది. తిరిగి వైద్యునికి చూపించాక జెల్‌ లాంటిది రాయాలని చెప్పి పంపించేశారు. అయినా తగ్గకపోగా వాపు ఎక్కువవుతుండడడంతో మరో ప్రైవేటు వైద్యుని సంప్రదించారు. అక్కడ మందులు వాడాకే మహిళ ఉపశమనం పొందింది.

- వేపాడ మండలానికి చెందిన యువతి లక్కవరపుకోట మండల పరిధిలోని ఓ గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. చేతికి బలమైన గాయమైంది. అత్యవసర చికిత్స కోసం శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లగా ఆసుపత్రిలో వైద్యులు కనిపించలేదు. చేసేదిలేక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

- శృంగవరపుకోట పట్టణానికి చెందిన ఓ గర్భిణి వైద్య పరీక్షల కోసం ఇటీవల స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లింది. ఆమె మద్రాసులో ఉన్నప్పుడు చేయించిన పరీక్షల రిపోర్టులను వైద్యులకు చూపించింది. వాటిని వైద్యులు పట్టించుకోలేదు. పరీక్షలు కూడా చేయలేదు. దీంతో ఒక్కడ సరైన వైద్యం అందదని భయపడిన ఆమె ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది.

శృంగవరపుకోట, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు కారణంగా ఉచితంగా అందాల్సిన వైద్యాన్ని పేదలు ప్రైవేటుగా కొనుక్కుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులను మానవత్వంతో చూసే పరిస్థితి లేదు. నిర్లక్ష్యంగా మాట్లాడడం.. రోగి పరిస్థితిని పరిపూర్ణంగా పరిశీలించకుండా త్వరగా పంపించే యడం రివాజుగా మారింది. చాలా మంది వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లో సొంత క్లినిక్‌లు నడుపుతున్నారు. ఇంకొందరు ఆసుపత్రుల యాజమాన్యాలకు సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సక్రమంగా వైద్యం అందించకుండా వ్యూహాత్మకంగా వ్యవహ రిస్తుండడంతో పేద, మధ్య తరగతికి చెందిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. చేతిలో డబ్బులు లేని కుటుంబాలు దీనస్థితిలో మరో ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. అక్కడైనా వైద్యం అందుతుందన్న భరోసా లేదు. ఇటీవల మెంటాడ మండలానికి చెందిన గర్భిణి చల్లపేట పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ నుంచి గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిని ఆశ్రయించగా సాయంత్రం 4గంటలైందని, గర్భిణీని చేర్చుకోలేదు. విజయనగరం ఘోసాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువవడంతో 108 సిబ్బంది ప్రసవం చేయాల్సి వచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా బయటపడ్డారు. అదే ఆపరేషన్‌ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటన్నది ఆలోచించాల్సిన విషయం. ఇదేమి పట్టించుకోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎవరికి వారు సమర్థించుకొనేందుకు చూస్తుండడం విచారకరం.

వ్యూహాత్మకంగా రెఫరల్‌

ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు వ్యూహాత్మకంగా రోగులను తరలిస్తున్నారు. రాబడే లక్ష్యంగా వ్యాపార దృక్ఫథాన్ని ప్రదర్శిస్తున్నారు. గర్భిణులతో పాటు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, ఇతర రోగాల బారిన పడిన వారిని కూడా అత్యవసర వైద్యం అంటూ కేంద్ర ఆసుపత్రులు, కేజీహెచ్‌లకు పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లేలోపే రోగం ముదురుతుందని, ప్రాణం మీదకు వస్తుందని భావించిన బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పలువురు వైద్యుల వ్యూహమన్న ఆరోపణలు ఉన్నాయి. రిఫరల్‌ సమయంలో మీరు రావాలనుకుంటే ఫలానా ప్రైవేటు ఆసుపత్రులకు రండి అని చెబుతున్నారు. అక్కడ అందుబాటులో ఉంటామని కొందరు, తనకు తెలిసిన మంచి వైద్యులు వున్నారని వారికి రికమండ్‌ చేస్తానని మరికొందరు సలహా ఇస్తున్నారు. తీరా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. జేబులకు చిల్లులు పెడుతున్నారు. మెడికల్‌ షాపులో కొనుగోలు చేసిన మందులకు బిల్లులు ఇవ్వడం లేదు. నచ్చినంత తీసుకుంటున్నారు. లాబ్‌ల్లో పరీక్షలకు నిర్దిష్టమైన ధరలు లేవు. వీటి నుంచి వైద్యులకు కమీషన్‌ అందుతుండడంతో పలువురు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను నీరుగార్చుతున్నారు. నియోజకవర్గాల్లోని ప్రజాప్రతి నిధులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై దృష్టిసారించడం లేదు. దీంతో పలువురు వైద్యులు అడిందే ఆట, పాడిందే పాటన్న విధంగా సాగుతోంది.

------------------------------

Updated Date - Feb 16 , 2025 | 12:20 AM