ప్రమాద ఘంటికలు
ABN , Publish Date - Mar 03 , 2025 | 11:24 PM
: వేసవి ప్రారంభంలోనే బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. వేగావతి నదీ జలాలు క్రమంగా అడుగంటుతుండడంతో నీటి కష్టాలు పెరుగుతున్నాయి.
- అడుగంటిన వేగావతి నదీ జలాలు
- బొబ్బిలిలో మొదలైన తాగునీటి కష్టాలు
- ప్రత్యామ్నాయం కోసం అధికారుల కసరత్తు
- పెద్దగెడ్డ నీటిని నదిలోకి విడిచిపెట్టేందుకు చర్యలు
బొబ్బిలి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): వేసవి ప్రారంభంలోనే బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. వేగావతి నదీ జలాలు క్రమంగా అడుగంటుతుండడంతో నీటి కష్టాలు పెరుగుతున్నాయి. నదిలో నీరు తక్కువగా ఉండడంతో రోజు విడిచి రోజు కొళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న మూడు నెలలు పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బొబ్బిలి మున్సిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. సుమారు 70 వేల మంది జనాభా నివసిస్తున్నారు. వీరికి ప్రతి రోజూ 8 ఎంఎల్‌డీ (80లక్షల లీటర్ల) తాగునీరు అవసరం. ప్రస్తుతం 5 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. బొబ్బిలి మండలం, మున్సిపాలిటీతో పాటు రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లోని తాగునీటి పథకాలకు భోజరాజపురం వద్ద ఉన్న హెడ్ వాటర్‌వర్క్స్ నుంచి వేగావతి నదీ జలాలను సరఫరా చేస్తుంటారు. అయితే, నది ఎండిపోతుండడంతో ప్రస్తుతం నీటిని పొదుపు చేసి తాగునీటి పథకాలకు మళ్లిస్తున్నారు. అన్ని ప్రాంతాలకు సర్దుబాటు చేసేందుకు రోజు విడిచి రోజు కొళాయిల ద్వారా విడుదల చేస్తున్నారు. వేగావతి నదిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అధికారులు ప్రత్నామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ నీటిని వేగావతి నదిలోకి విడిచిపెట్టేందుకు కసరత్తును ప్రారంభించారు. నదిలో ఇసుక బస్తాలతో అడ్డుకట్టలు వేసి ఇన్‌ఫిలే్ట్రషన్ బావుల్లోకి నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం..
ప్రతి ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు యాడ్వర్స్ సీజనల్ గ్రాంట్‌ను స్థానిక సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చేవి. గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులకు మంగళం పాడింది. దీంతో ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి తాగునీటి కోసం అధికారులు వెచ్చిస్తున్నారు. సుమారు రూ.100కోట్లతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సువర్ణముఖి తాగునీటి పథకాన్ని గత ప్రభుత్వం అటకెక్కించింది. ఈ పథకానికి నిధులు మురిగిపోవడంతో ఆ పథకం ఇక లేనట్లే. తోటపల్లి ప్రాజెక్టు నుంచి ప్రారంభిస్తున్న వాటర్ గ్రిడ్ పథకాన్ని బొబ్బిలి పట్టణ తాగునీటి పథకానికి అనుసంధానం చేసే ప్రతిపాదనను అధికారులు తెరమీదకి తెచ్చారు. సువర్ణముఖి పథకం స్థానంలో తోటపల్లి వాటర్ గ్రిడ్ ద్వారా బొబ్బిలి ప్రజలకు తాగునీరందించాలన్నది లక్ష్యం. అలా అయితే పట్టణంలో ప్రత్యేకంగా ఓ సంప్ నిర్మించి అక్కడ నుంచి తోటపల్లి నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేయాల్సి ఉంటుంది. తాత్కాలికంగా పెద్దగెడ్డ నీరు, శాశ్వతంగా తోటపల్లి ప్రాజెక్టు నీటి ద్వారా బొబ్బిలి ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు.
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం..
బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం. భోజరాజపురం వద్ద మున్సిపల్ ప్రధాన వాటర్‌వర్క్స్‌కు తాగునీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చూస్తున్నాం. వేగవతి నదిలోని నీటి పాయలు బావులకు వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. ఇసుక బస్తాలతో అడ్డుకట్టలు కూడా వేస్తాం. పెద్దగెడ్డ రిజర్వాయరులో నీటి నిల్వలు ఉన్నందున ప్రతి 15 రోజులకోసారి అక్కడ నుంచి నదిలోకి నీటిని విడుదల చేయాలని మున్సిపల్ కమిషనర్.. కలెక్టర్‌ను కోరారు. బోరువెల్స్, పైపులైన్ల నిర్వహణ, బోర్ ఫ్లషింగ్, ఇసుక గట్ల నిర్మాణం తదితర వాటికోసం సుమారు రూ.15 లక్షలతో అంచనాలు సిద్ధంగా ఉన్నాయి. మరో రూ.20లక్షలతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, రూ.5లక్షలతో విద్యుత్‌ప్యానల్ బోర్డు ఏర్పాటుకు నిధులు మంజూరై ఉన్నాయి. ఈ పనులు జరుగుతున్నాయి. 100 హెచ్‌పీ, 30 హెచ్‌పీ మోటార్లు స్టాండ్‌బై గా ఉన్నాయి. తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా మున్సిపల్ కమిషనర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
-పెదిరెడ్ల కిరణ్, మున్సిపల్ డీఈఈ, బొబ్బిలి
ఆండ్ర జలాశయంలో..
మెంటాడ: ఆండ్ర జలాశయంలో నీరు అంతంతమాత్రంగానే ఉంది. జలాశయం నీటి సామర్థ్యం 0.98 టీఏంసీలు కాగా, ప్రస్తుతం 0.55 టీఏంసీలు ఉంది. ఇన్‌ఫో లేనప్పటికీ, అవుట్ ఫ్లో 10 క్యూసెక్కుల నీరు లీకుల వల్ల ద్వారా చంపావతి నదిలోకి ప్రవహిస్తుంది. జలాశయం రెగ్యులేటర్, కుడి, ఎడమ కాలువల నుంచి లీకులు అరికట్టకపోతే నీరు మరింత వృథాగా పోయే అవకాశం ఉంది. చంపావతి నది నుంచి మెంటాడ, గజపతినగరం, నెల్లిమర్ల తదితర మండలాలతో పాటు విజయనగరం పట్టాణానికి నిత్యం తాగునీరు అందుతుంటుంది. ఇప్పటికే ఎండలు తీవ్ర రూపం దాల్చడం, జలాశయంలో నీరు తక్కువగా ఉండటంతో ఈ ఏడాది తాగునీటికి ఇక్కట్లు తప్పేలా లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.