Share News

Tribal Welfare Department గిరిజన సంక్షేమ శాఖలో కలకలం

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:30 AM

Commotion in the Tribal Welfare Department సీతంపేట గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఏటీడబ్ల్యూవో మంగవేణిని అధికారులు విచారించడంతో కలకలం రేగింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను బుధవారం డీడీ అన్నదొర, సూపరింటెండెంట్‌ దేశ్‌ల ఆధ్వర్యంలో విచారించారు.

Tribal Welfare Department  గిరిజన సంక్షేమ శాఖలో కలకలం
సీతంపేట ఐటీడీఏలోని డీడీ కార్యాలయం

  • టీడబ్ల్యూ డైరెక్టరేట్‌ ఆదేశాలతో కదిలిన అధికారులు

  • వాస్తవాలు నిగ్గుతేల్చే పనిలో యంత్రాంగం

సీతంపేట రూరల్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సీతంపేట గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఏటీడబ్ల్యూవో మంగవేణిని అధికారులు విచారించడంతో కలకలం రేగింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను బుధవారం డీడీ అన్నదొర, సూపరింటెండెంట్‌ దేశ్‌ల ఆధ్వర్యంలో విచారించారు. పలు ప్రశ్నించి వేసి సమాధానాలు రికార్డు చేశారు. లిఖిత పూర్వకంగా ఆమె ఏటీడబ్ల్యూవోకు సమాధానమిచ్చినట్లు తెలిసింది. కాగా ఆమెపై డీ-జేఏసీ(దళిత సంఘాల సంయుక్త మండలి) పేరుతో గత ఏడాది అక్టోబరు నెలలో కలెక్టర్‌, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై విచారణ చేపట్టాలని కలెక్టరేట్‌ నుంచి సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోకు ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర గిరిజనసంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ నుంచి కూడా ఉత్తర్వులు అందాయి. దీంతో ఎట్టకేలకు అధికారులు సదరు అధికారిణిని విచారించారు.

ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు

- ఏటీడబ్ల్యూవో మంగవేణిపై వచ్చిన ఫిర్యాదులోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏలో పరిధిలో గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌, పోస్టుమెట్రిక్‌ వసతిగృహాల్లో పనిచేస్తున్న డిప్యూటీ వార్డెన్‌, హెచ్‌డబ్ల్యూవోలను బ్లాక్‌మెయిల్‌ చేసి వేధింపులకు గుర్తిచేస్తున్నారు.

- డిప్యూటీ వార్డెన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా చులకనగా, కించపరిచేలా మాట్లాడుతున్నారు. 18 హాస్టల్స్‌లో చదువుతున్న ఒక్కో గిరిజన విద్యార్థి నుంచి రూ.30 చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేసి తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే సంబంధిత వార్డెన్‌కు మెమోలు, సస్పెండ్‌ చేయిస్తానని బెదిరిస్తున్నారు. డైట్‌ బిల్లుల పేమెంట్‌లు అవ్వకముందే స్టూడెంట్‌కి రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా ఇవ్వని వారిని మార్చి కొత్తవారిని నియమిస్తున్నారు.

- డైట్‌ బిల్లులు స్కూృట్నీకి వెళ్లిన వార్డెన్లను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. హాస్టల్స్‌కు సంబంధించిన డైట్‌బిల్స్‌ ట్రెజరీలో అప్రూవ్‌ చేయించడం కోసం ఒక శాతం ఇవ్వాలని వార్డెన్ల వద్ద నుంచి కలెక్షన్‌లు చేస్తున్నారు. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో పాఠశాల క్లోజింగ్‌, పునఃప్రారంభం రోజున పాఠశాలల విజిట్‌ చేసి విద్యార్థుల హాజరు తక్కువగా ఉంటే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. అదే విధంగా డిప్యూటీ డైరెక్టర్ల పేరు చెప్పి బెదిరించి వార్డెన్‌ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

లిఖిత పూర్వకంగా రాసిచ్చా..

ఈ విషయంపై ఏటీడబ్ల్యూవో మంగవేణిని వివరణ కోరగా ..‘ ఉద్యోగంలో ఇటువంటి ఒడిదుడుకులు సహజమే. ముక్కుసూటిగా వెళ్లే వాళ్లకు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. నేను ఎప్పుడూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదు. డీడీ ఎదుట విచారణకు హాజరయ్యా. నేను చెప్పదలచుకున్నది లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చా.’ అని ఆమె తెలిపారు.

ఉత్తర్వుల మేరకు..

‘రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏటీడబ్ల్యూవో మంగవేణిని విచారించాం. ఆమెపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారుడిని కూడా విచారిస్తాం.’ అని డీడీ అన్నదొర తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 12:30 AM