ACB ఏసీబీ వలలో కమిషనర్
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:57 PM
Commissioner Trapped in ACB Net పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు, కారు డ్రైవర్ రమణ్‌రాజులు సోమవారం ఏసీబీ వలకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కమిషనర్ కారు డ్రైవర్
వారిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు
నేడు కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ వెల్లడి
పాలకొండ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు, కారు డ్రైవర్ రమణ్‌రాజులు సోమవారం ఏసీబీ వలకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పాలకొండకు చెందిన ఓ మహిళ 2017లో ప్రసవం కోసమని నగర పంచాయతీలో కోటదుర్గ ఆసుపత్రిలో చేరింది. డెలివరీ అయిన తర్వాత ఆమె బిడ్డ పేరిట జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో తప్పులు దొర్లాయని అనురాధ అనే ఉపాధ్యాయురాలు కోటదుర్గ ఆసుపత్రితో పాటు నగర పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 2023లో విచారణ చేసిన అప్పటి కమిషనర్ సర్వేశ్వరరావు వైద్యాధికారిణి భారతికి రూ.500 ఫైన్ వేశారు. నగర పంచాయతీ కమిషనర్ ఇచ్చిన సమాచారం సంతృప్తిగా లేదని టీచర్ సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్టీఐ కమిషనర్ తమకు పూర్తిస్థాయిలో సమాచారం అందించాలని నగర పంచాయతీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావు మరోసారి వైద్యురాలి భారతిని సంప్రదించి భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చూస్తానని , అందుకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. అయితే డాక్టర్ భారతి రూ.20 వేలు ఇస్తానని ఒప్పుకుని.. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం పాలకొండలోని కోటదుర్గ ఆసుపత్రిలో నగర పంచాయతీ కమిషనర్ కారు డ్రైవర్ రమణరాజ్ వైద్యాధికారిణి ఆర్.భారతి రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వారు విచారించగా.. ఈ మొత్తం కమిషనర్‌కు ఇస్తున్నట్టు డ్రైవర్ ఒప్పుకున్నాడు. దీంతో ఏబీసీ అధికారులు నేరుగా కమిషనర్ సర్వేశ్వరరావు ఇంటికి చేరుకుని విచారించారు. అక్కడ నుంచి వారిద్దరినీ నగర పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి వేర్వేరుగా స్టేట్‌మెంట్లు రికార్డు చేసినట్టు ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు వారిని తరలించ నున్నట్టు తెలిపారు. ఏసీబీ సీఐలు ఎస్‌వీ రమణ, భాస్కరరావు, ఎస్‌ఐలు సూర్యారావు, రమణలు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
పన్నెండేళ్లలో నలుగురు..
పాలకొండ నగర పంచాయతీని అవినీతి మరక వీడడం లేదు. మేజర్ పంచాయతీగా ఉన్న పాలకొండ 2013, మార్చి 20న నగరపంచాయతీగా అప్ గ్రేడ్ అయ్యింది. ఇప్పటివరకు 16 మంది కమిషనర్లు పనిచేయగా.. గడిచిన 12ఏళ్లలో నలుగురు కమిషనర్లు ఏసీబీకి చిక్కారంటే నగర పంచాయతీలో అవినీతి ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పాలకొండలో వరుసగా కమిషనర్లు ఏసీబీ వలకు చిక్కడంపై బాహాటంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2013, మార్చి 20న నగర పంచాయతీగా అప్ గ్రేడ్ అయిన తర్వాత అదే ఏడాది రెండో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన పి.నాగభూషణరావు, 2015లో టి.కనకరాజు, 2021లో నడిపేన రామారావు, తాజాగా సర్వేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మేజర్ పంచాయతీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరరావు అనే కార్యనిర్వాహణాధికారి ఏసీబీ వలకు చిక్కారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.