Share News

సొంతూరు వస్తున్నారు..

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:12 AM

Coming home.. జిల్లా వాసులు సొంతూరు వస్తున్నారు.. ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఎంతో ఆనందంతో, ఆత్రుతతో ఇళ్లకు చేరుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, ముంబాయ్‌ తదితర పట్టణాలు, ఇతర దేశాల్లో కొలువులు చేస్తున్నవారు పిల్లలతో గ్రామాల్లో అడుగు పెడుతున్నారు.

సొంతూరు వస్తున్నారు..
బొబ్బిలి రైల్వే స్టేషన్‌ నుంచి బయటకు వస్తున్న వలసదారులు

సొంతూరు వస్తున్నారు..

గ్రామాల్లో సందడే సందడి

విజయనగరం/ బొబ్బిలి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): జిల్లా వాసులు సొంతూరు వస్తున్నారు.. ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఎంతో ఆనందంతో, ఆత్రుతతో ఇళ్లకు చేరుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, ముంబాయ్‌ తదితర పట్టణాలు, ఇతర దేశాల్లో కొలువులు చేస్తున్నవారు పిల్లలతో గ్రామాల్లో అడుగు పెడుతున్నారు. బంధువులు, అయినవారి పలకరింపులతో ఉబ్బితబ్బిబ్బువుతున్నారు. ఏరా.. బాగున్నావా...అన్న పిలుపుకోసం పరితపించిపోయిన వలస జీవులు.. సొంతూళ్లలో అడుగుపెట్టగానే.. ఏదో భావోద్వా గానికి గురౌవుతున్నారు. ఇంటికి చేరుకోగానే కళ్లల్లో ఆనందభాష్పాలు నింపుకుని తల్లిదండ్రులను చూసి మురిసిపోతున్నారు. అప్పుడే వారికి పండగ వచ్చినట్లు అయ్యింది. ఇక అరుగులు, రచ్చబండ కబుర్లు..స్నేహితులతో చిన్ననాటి గురుతులు నెమరువేసుకుంటూ హాయిగా కాలక్షేపంలో మునిగి తేలుతున్నారు. గ్రామ పొలిమేరలు, పొలాలు..కళ్లాల్లో ముచ్చట్లు పెట్టుకుని సరదాగా గడిపేస్తున్నారు.

మార్కెట్‌కు సంక్రాంతి కళ

విజయనగరం మార్కెట్‌కు సంక్రాంతి కళ వచ్చేసింది. శనివారం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిటకిటలాడింది. దుస్తులు, బంగారం, కిరాణా వస్తువుల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. గంటస్తంభం, చిన్నవీధి, పీడబ్యూ మార్కెట్‌, కన్యకాపరమేశ్వరి రోడ్డు, ఎంజీ రోడ్డు, ఉల్లివీధి, రైల్వేస్టేషన్‌ రోడ్డు జనంతో నిండిపోయాయి. నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కిలోమీటరు ప్రయాణించాలంటే అరగంట సమయం పట్టింది. బొబ్బిలి, గజపతినగరం, ఎస్‌.కోట, నెల్లిమర్ల, రాజాం మార్కెట్‌లలో కూడా సంక్రాంతి శోభ కనిపించింది.

Updated Date - Jan 12 , 2025 | 12:12 AM