Share News

fishermen problems మత్స్య సంపద దక్కక.. లీజు చెల్లించలేక

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:19 AM

Can't get fisheries.. Can't pay lease వారంతా మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు. అధికారులు రిజర్వాయర్‌లో చేపల వేటపై నిషేధం విధించడంతో ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

fishermen problems మత్స్య సంపద దక్కక.. లీజు చెల్లించలేక
వేట సాగక నిలిపిన బోట్లు

మత్స్య సంపద దక్కక.. లీజు చెల్లించలేక

మడ్డువలస రిజర్వాయర్‌లో వేటకు దూరమైన మత్స్యకారులు

లీజు చెల్లించలేదని చేపల వేటపై నిషేధం విధించిన అధికారులు

చేపలను పట్టుకుపోయి మోసం చేసిన నాయకులు

ప్రభుత్వమే దారి చూపాలని విన్నపాలు

వంగర, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): వారంతా మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు. అధికారులు రిజర్వాయర్‌లో చేపల వేటపై నిషేధం విధించడంతో ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి లీజు చెల్లిస్తేనే వేటకు అవకాశం ఇస్తామని మత్స్యశాఖ చెబుతోంది. కాగా ఇటీవల మడ్డువలస నుంచి భారీగా నీళ్లు వదిలారు. ఆ సమయంలో చేపలు పట్టి వచ్చే డబ్బులను లీజుగా చెల్లించాలని మత్స్యకారులు భావించారు. అంతలో దళారులు వచ్చి అండగా ఉంటామని, చేపలు తాము పట్టుకుంటామని చెప్పి తర్వాత పత్తా లేకుండా పోయారు. అడ్డదారిలో చేపలు పట్టి వీరిని మోసం చేశారు. దీంతో లీజు చెల్లించలేక.. వేరే పని లేక అవస్థలు పడుతున్నారు.

మడ్డువలస రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన 10 గ్రామాల ప్రజలకు చేపల వేట ప్రధాన వృత్తి. 574 మంది కలిసి గతంలో ఒక సొసైటీగా ఏర్పడ్డారు. వీరు ఏటా ప్రభుత్వానికి కొంత సొమ్మును లీజుగా చెల్లించి రిజర్వాయర్‌లో వేట సాగిస్తూ ప్రభుత్వ నుంచి రాయితీలు పొందుతున్నారు. చేప పిల్లలను రిజర్వాయర్‌లో పెంచడానికి 90 శాతం రాయితీని కూడా పొందేవారు. గత వైసీపీ ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలు అందివ్వడం మానేసింది. దీంతో వారు పూర్తిస్థాయిలో లీజులు చెల్లించలేకపోయారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం 1431, 1432, 1433, 1434 ఫసలీలకు సంబంధించి రూ.50 లక్షలు చెల్లించాలని మత్స్యకార సొసైటీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో సొసైటీ అధ్యక్షుడు ఒక ప్రయివేటు వ్యాపారిని రప్పించి వారికి కొంత మత్స్యసంపదను అప్పగించి లీజు కట్టించేవారు. సంఘం పదవీ కాలం ముగియడంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది.

కొద్దినెలల కిందట మడ్డువలస ప్రధాన గేట్లకు మరమ్మతులు పేరుతో మొత్తం నీరు ఖాళీ చేశారు. ఆ సమయంలో కొందరు రాజకీయ నాయకులు వచ్చి లీజు కట్టాల్సి ఉన్నందున వ్యాపారులు తీసుకొచ్చామని, వారికి సహకరిస్తే ఏడాది పొడువునా వేట సాగించుకోవచ్చని నమ్మబలికారు. నిజం అని భావించిన మత్య్సకారులు చేపలను దళారులకు అప్పగించారు. రూ.2 కోట్ల విలువైన మత్య్ససంపదను వారు దోచుకుని చల్లగా జారుకున్నారు.

సొసైటీ ఎన్నికలతో సమస్య పరిష్కారం

మడ్డువలస రిజర్వాయర్‌లో ఫిషర్‌మెన్‌ ఎన్నికలు నిర్వహిస్తే ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని మత్య్సకారులు చెబుతున్నారు. అధ్యక్షుని ఎన్నుకొని రిజర్వాయర్‌లోని మత్య్ససంపద కొనుగోలుకు వ్యాపారిని ఆహ్వానిస్తే బకాయిలు చెల్లించడానికి అవకాశం ఉంటుందన్నది వారి భావన. చేపల వేట లేకపోవటంతో పనిలేక ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌ చొరవ చూపి న్యాయం చేయాలని మత్య్సకారులు కోరుతున్నారు.

మోసపోయాం

తవిటం దొర, మత్య్సకారుడు, వంగర

మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేటసాగక దయనీయంగా బతుకుతున్నాం. రెక్కాడితే గాని పూట గడవని రోజుల్లో అధికారులు చేపల వేట నిషేధమని ఆదేశాలు ఇచ్చారు. గతంలో లీజు చెల్లిస్తామని పలువురు వ్యాపారులు చెప్పి మమ్మల్ని మోసం చేశారు.

ఎన్నికలు జరిపితే మంచిది

నర్శింగదొర, మత్య్సకారుడు, మగ్గూరు

మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేట లేక అప్పులు పుట్టక పస్తులు ఉంటున్నాం. ఎన్నికలు జరిపితే పాలకవర్గం ఏదో ఒకటి చేసి ప్రభుత్వానికి లీజు చెల్లిస్తుంది.

లీజులు బకాయిలు చెల్లించాలి

సీహెచ్‌వీ ప్రసాద్‌, ఎఫ్‌డీవో

సొసైటీ సభ్యులు ప్రభుత్వానికి ఎక్కువ బకాయి పడ్డారు. లీజులు లక్షల్లో చెల్లించాలి. అందువల్లే చేపల వేటపై నిషేధం విధించాం. సంఘం ఎన్నికల విషయం మా పరిధిలో లేదు.

Updated Date - Feb 17 , 2025 | 12:19 AM