officers not coming పొలం పిలుస్తున్నా.. రావడం లే!
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:22 AM
Calling the farm.. not coming! రైతులను సాగులో సుశిక్షుతులను చేసి సస్యరక్షణలో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది వ్యవసాయం లాభసాటిగా మార్చాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఈ సంకల్పంతో చేపడుతున్న పోలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడి చందమైంది.

పొలం పిలుస్తున్నా.. రావడం లే!
మొక్కుబడిగా కార్యక్రమం
హాజరుకాని అనుబంధ శాఖల అధికారులు
మమ అనిపిస్తున్న వ్యవసాయ శాఖ
గజపతినగరం, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): రైతులను సాగులో సుశిక్షుతులను చేసి సస్యరక్షణలో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది వ్యవసాయం లాభసాటిగా మార్చాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఈ సంకల్పంతో చేపడుతున్న పోలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడి చందమైంది. వ్యవసాయశాఖ అధికారులతో పాటు అనుబంధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా రైతుల వద్దకు వెళ్లి సూచనలు ఇవ్వాలి. రైతు చెప్పిన సమస్యలు వినాలి. విత్తన ఎంపిక మొదలు ఎరువులు, పురుగు, తెగుళ్ల నివారణ మందులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై అన్నదాతలతో చర్చించి అవగాహన కల్పించాలి. ఇదేదీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వ్యవసాయశాఖ అధికారులు మినహా మిగిలిన శాఖల అధికారులు కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ప్రతీ మండలంలో మంగళ , బుధవారాల్లో రెండు గ్రామాలు చొప్పున వారానికి నాలుగు గ్రామాల్లో పోలం పిలుస్తోంది కార్యక్రమం చేపట్టాలి. పొలాలను పరిశీలించి అభ్యుదయ రైతులను ప్రోత్సహించాలి. వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ మండలాల్లో ఇంతవరకు 22వారాల పాటు 44 గ్రామసభలు నిర్వహించారు. అన్నిచోట్లా వ్యవసాయశాఖ అధికారులే కనిపించారు. నేతలు వచ్చిందే లేదు.
ముందస్తు సమాచారం లేక వెలవెల
ఏరోజు ఏగ్రామంలో కార్యక్రమం జరుగుతుందో గ్రామంలో ముందస్తు సమాచారం ఇవ్వడం లేదు. రైతులు ఎవరి పనుల్లో వారు ఉంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు వారి షెడ్యూల్ ప్రకారం గ్రామాలకు వెళ్లి అటుగా వచ్చివెళ్లే రైతులను కూర్చోబెట్టి కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు. ఈపరిస్థితుల్లో విత్తనం నుంచి ఉత్పత్తి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చాలామందికి అవగాహన భ్రమగానే మారింది. వాస్తవానికి పొలంపిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖలు హార్టీకల్చర్, ఫిషరీస్, వెటర్నరీ, మార్కెటింగ్ అధికారులు, విజ్ఞానకేంద్ర శాస్త్ర వేత్తలు, విద్యుత్, జలవనరులశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. వీరితో పాటు రైతు మిత్రసంఘాలు, భూసంరక్షణ అధికారులు హాజరై వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలి. 2024-25 ఏడాదికి సంబంధించి సెప్టెంబర్ 24వతేదీ నుంచి ఈకార్యక్రమం ప్రారంభమయింది. మొదటివిడత షెడ్యూల్ పూర్తయి రెండో విడత షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రబీ సీజన్ కావడంతో అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. అనుబంధ శాఖల అధికారులు రావడమే లేదని రైతులు చెబుతున్నారు.
అధికారులంతా హాజరుకావాలి
పోలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులతో పాటు అన్ని అనుబంధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆయాశాఖల పథకాలను తెలియజేసి రైతుల సమస్యలను పరిష్కరించాలి. కార్యక్రమం షెడ్యూల్‌ను అందరికీ పంపుతున్నాం.
- కె.మహరాజన్, ఏడీఏ, గజపతినగరం