accident: రక్తమోడిన రోడ్డు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:39 PM
accident: సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతమైన ఆడలీ వ్యూ పాయింట్‌కు వెళ్లే రహదారి గురువారం రక్తమోడింది.

ఆడలీ వ్యూ పాయింట్ ఘాట్‌లో ప్రమాదానికి గురైన మూడు ఆటోలు
27 మందికి గాయాలు
సీతంపేట రూరల్/పాలకొండ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతమైన ఆడలీ వ్యూ పాయింట్‌కు వెళ్లే రహదారి గురువారం రక్తమోడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడలీ వ్యూ పాయింట్ అందాలను తిలకించేందుకు గురువారం వేర్వేరుగా మూడు ఆటోల్లో వెళ్లిన పర్యాటకులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో 27 మంది గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం చిన్న కురింపేట గ్రామానికి చెందిన 38 మంది రెండు ఆటోల్లో ఆడలీ వ్యూ పాయింట్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా సీతంపేట మండలం వెలంగూడ గ్రామ సమీపంలో మలుపు వద్ద రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ఆటోల్లో ఉన్నవారిలో 14 మందికి గాయాలయ్యాయి.
వీరిలో కోడి యామిని అనే చిన్నారి తలకి తీవ్రగాయమైంది. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలిచారు. ప్రథమ చికిత్స అనంతరం యామినిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కాగా, ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడే నిలబడి ఉన్న వెల్లంగూడ గ్రామానికి చెందిన గిరిజనుడు సవర రెల్లయ్య కూడా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయంకావడంతో ఆయన్ను ఐటీడీఏ అంబులెన్స్‌లో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు రెల్లయ్యను శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనపై సీతంపేట ఎస్‌ఐ వై.అమ్మన్నరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా ఆడలి వ్యూపాయింట్ రహదారిపైనే మరోక ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో పాలకొండ మండలం వాటపాగు గ్రామానికి చెందిన కెంబూరు సాయి, పోరెడ్డి జగన్‌తో పాటు మరో 10 మంది గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.