’Belt‘ ‘బెల్టు’ జోరు!
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:56 PM
’Belt‘ Boom జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు.. పట్టణాలని తేడా లేకుండా ఎక్కడికక్కడ దుణాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పట్టణాల్లోనూ అదే పరిస్థితి
కొన్నిచోట్ల బహిరంగంగానే విక్రయాలు
అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న వైనం
స్పందించని ఎక్సైజ్ శాఖాధికారులు
పార్వతీపురం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు.. పట్టణాలని తేడా లేకుండా ఎక్కడికక్కడ దుణాలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పలఉ గ్రామాల్లో కిరాణా దుకాణాల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. తెరవెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఉండడం.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం.. తదితర కారణాలతో ‘మన్యం’లో బెల్ట్ వ్యాపారం మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.
జిల్లాలో ఇలా..
సీతంపేట మండలం కుశిమి గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహణ కోసం ఇటీవల జరిగిన వేలం పాటలో గిరిజనుల మధ్య ఘర్షణ నెలకొంది. ప్రస్తుతం అక్కడ మూడు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక దోనుబాయి, చిన్నబగ్గ, మర్రిపాడు, పూతికవలస, కోడిశ, సీతంపేట, గొయిది, కుశిమి తదితర గ్రామాల్లో బెల్ ద్వారా జోరుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గతనెల 12న అక్రమంగా రవాణా చేస్తున్న రూ.70 వేలు విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొమరాడ, కూనేరు, తులసివలస, గుమడాం తదితర గ్రామాల్లో బహిరంగంగా, మరికొన్ని గ్రామాల్లో రహస్యంగా బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు చేపడుతున్నారు. బలిజిపేట మండలంలో గలావల్లి, గంగాడ, వంతరం, అంపావల్లి, పెదపెంకి, తుమరాడ, నారాయణపురంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పార్వతీపురం మండలంలో బందలుప్పి, జమదాల, మక్కువ మండలంలో శంబర, కోన, గోపాలపురం, పోరుమామిడి, కాశీపట్నం, పాపయ్యవలస, కురుపాంలో బెల్ట్ జోరు కొనసాగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావును వివరణ కోరేందుకు ఫోన్ చేయగా.. వారు స్పందించలేదు.