రోడ్డు ప్రమాదాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:23 PM
Awareness on Road Accidents is Essential వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన అవసరమని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

పార్వతీపురం టౌన్, ఫిబ్రవరి 15( ఆంధ్రజ్యోతి) : వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన అవసరమని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో హత్యలు, ఆత్మహత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో 80 మంది మృత్యవాత పడ్డారని తెలిపారు. 400 మంది వరకు క్షతగాత్రులవ్వడం బాధాకరమన్నారు. వేగం కన్నా ప్రాణం మిన్న అన్న సంగతిని వాహనదారులు తెలుసుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. వాహనాలతో రొడ్డెక్కేటప్పుడు తమపై ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నాయనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని తెలిపారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్‌లు ధరించాలన్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నామన్నారు. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతుండడం బాధాకరమన్నారు. అయితే వాటి నివారణ కోసమే నెలరోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించినట్లు చెప్పారు. జీరో యాక్సిడెంట్‌లే లక్ష్యంగా డ్రైవర్లు పనిచేస్తే.. ‘మన్యం’ ప్రమాద రహిత జిల్లాగా మారుతుందన్నారు. అనంతరం పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోలకు చెందిన ఉత్తమ డ్రైవర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీపీటీవో డిపిటివో వెంకటేశ్వరరావు, పార్వతీపురం డిపో మేనేజర్ దుర్గా, ఎంవీఐ శశికుమార్, తదితరులు పాల్గొన్నారు.