Share News

Doing It Intentionally? కావాలనే చేస్తున్నారా?

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:22 AM

Are You Doing It Intentionally? జిల్లాలో కొంతమంది వైసీపీ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్‌ అధికారుల ఆదేశాలు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో ‘మన్యం’లో రైతు సేవా కేంద్రాల నిర్మాణాలకు మోక్షం లభించడం లేదు.

Doing It Intentionally?  కావాలనే చేస్తున్నారా?
పార్వతీపురం ఎంఆర్‌.నగరంలో ప్రధాన ద్వారం లేక నిరుపయోగంగా ఉన్న కొత్త రైతు సేవా కేంద్రం

  • అధికారుల మాటలను సైతం పట్టించుకోని వైనం

  • ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది వైసీపీ కాంట్రాక్టర్లు

  • గత ప్రభుత్వ హయాంలో 301 ఆర్‌బీకేలు మంజూరు

  • పూర్తయినవి 101 మాత్రమే..

పార్వతీపురం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొంతమంది వైసీపీ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్‌ అధికారుల ఆదేశాలు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో ‘మన్యం’లో రైతు సేవా కేంద్రాల నిర్మాణాలకు మోక్షం లభించడం లేదు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జిల్లాకు 301 ఆర్‌బీకేలను మంజూరు చేసింది. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు వాటి నిర్మాణ బాధ్యతను అప్పగించింది. కాగా అప్పట్లో కొంతమంది సకాలంలో వాటి పనులు పూర్తి చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం , నిధులను దారి మళ్లించడం తదితర కారణాలతో మరికొంతమంది నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటి పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి.. బిల్లుల చెల్లిస్తున్నప్పటికీ సదరు నాయకులు ఆర్‌ఎస్‌కేల నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. కొందరు కావాలనే జాప్యం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ సర్కారు హయాంలో మంజూరైన ఆర్‌బీకేలను ఇప్పుడు ప్రారంభిస్తే పల్లెల్లో కూటమి శ్రేణుల హవా అధికమవుతున్న ఆలోచనలో వారున్నట్లు తెలిసింది. ఈ కారణంగానే కొన్నిచోట్ల ఆర్‌ఎస్‌కేలను ప్రారంభించడం లేదు. ఆయా భవనాలకు తలుపులు, విద్యుత్‌, తాగునీరు వంటి పనులు చేయడం లేదు. నిర్మాణాలు పూర్తి చేయకుండా భవనాలను అలానే వదిలేస్తున్నారు. ఇంకా తమ ప్రభుత్వమే కొనసాగుతుందనే భ్రమలో ఉంటూ అధికారుల మాటలను సైతం లెక్క చేయడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిలావాసులు కోరుతున్నారు. ఆర్‌ఎస్‌కేల నిర్మాణంలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాకు 301 రైతు భరోసా కేంద్రాలను మంజూరు చేయగా గత ఐదేళ్లలో కేవలం 101 భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. 177 కేంద్రాల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. 23 ఆర్‌ఎస్‌కేలకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఆయా కేంద్రాలు పరాయి పంచలోనే కొనసాగుతున్నాయి. మరికొన్నింటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మండలం ఎం.ఆర్‌.నగరంలో ఒక ప్రధాన ద్వారం లేక భవనం నిరూపయోగంగా మారింది. జిల్లాలో ఇటువంటి ఆర్‌ఎస్‌కేలు ఇంకెన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన భవన నిర్మాణాల బాధ్యత, పెరిగిన అంచనా వ్యయ భారం కూటమి ప్రభుత్వ పడింది.

Updated Date - Jan 11 , 2025 | 12:22 AM