MLC Elections ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:56 PM
All Set for MLC Elections ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జేసీ, సబ్ కలెక్టర్, డీఆర్‌వోకు పలు సూచనలిచ్చారు.

మెటీరియల్ పంపిణీ పూర్తి
15 పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన అధికారులు
జిల్లాలో నిషేధ ప్రత్యేక ఆంక్షలు
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడి
పార్వతీపురం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జేసీ, సబ్ కలెక్టర్, డీఆర్‌వోకు పలు సూచనలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న అన్ని పోలింగ్ కేం ద్రాలకు మెటీరియల్ పంపిణీ చేశాం. ఎన్నికల దృష్ట్యా జిల్లాను ఆరు జోన్లుగా విభజించాం. సెక్టోరియల్ అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ మెటీరియల్‌తో ఎన్నికల అధికారులు, సిబ్బంది కేంద్రాలకు తరలివెళ్లారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రతి కేంద్రంలో పోలింగ్ జరగనుంది. మొత్తంగా 2,333 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే వారందరికీ ఓటరు స్లిప్పులను కూడా పంపిణీ చేశాం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశాం. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, తాగునీరు వంటి సిద్ధం చేశాం. పోలింగ్ ముగిసే వరకు జిల్లాలో ప్రత్యేక నిషేధ ఆంక్షలు అమలులో ఉంటాయి. గుమిగూడడం, సభలు, ర్యాలీలు వంటివి చేయరాదు. రాజకీయ పక్షాలకు చెందిన పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు వంటి వాటిపై కూడా నిషేధ ఆంక్షలు వరిస్తాయి.’ అని ఆయన వెల్లడించారు. జేసీ శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో కె.హేమలత, సెక్టోరియల్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, రూట్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లు ఇలా..
జిల్లాలో 2,333 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 1,574 మంది, మహిళలు 759 మంది వరకు ఉన్నారు. గురువారం వారు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలాల వారీగా చూస్తే.. వీరఘట్టంలో 120, సీతంపేటలో 121, భామిని 44, పాలకొండ 301, కొమరాడ 65, గుమ్మలక్ష్మీపురం 189, కురుపాం 120, జియ్యమ్మవలస 91, గరుగుబిల్లిలో 105 వరకు ఓట్లు ఉన్నాయి. పార్వతీపురం మండలం, పట్టణంలో 636, మక్కువలో 55, సీతానగరంలో 114, బజిలిపేట 88, సాలూరు 250, పాచిపెంట 34 వరకు ఓట్లు ఉన్నాయి. కాగా ఈ ఎన్నికకు సంబంధించి 18 మంది చొప్పున ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీకులు, 36 మంది ఇతర పోలింగ్ అధికారులను నియమించారు.
ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ
ఈ ఎన్నికల్లో మొత్తంగా తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.అయితే తాజా మాజీ ఎమ్మెల్సీ పి.రఘువర్మ, మరో మాజీ ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులునాయుడు, మరో అభ్యర్థి కె.విజయగౌరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. రఘువర్మకు తెలుగుదేశం కూటమి మద్దతు ఇస్తోంది. ఆయన తరపున మంత్రి సంధ్యారాణితో పాటు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణతో కూటమి శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ఉపాఽధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారాయని చెప్పొచ్చు. విజయగౌరి విజయం కోసం యూటీఎఫ్, సీపీఎం, శ్రీనివాసులునాయుడుకు మద్దతుగా పీఆర్‌టీయూ సంఘ నాయకులు ప్రచారం చేశారు. కాగా గురువారం పోలింగ్ జరగనుండగా.. ఎవరికి విజయం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ఓటు హక్కు ఎవరికి ఉంటుందంటే...
ఉన్నత పాఠశాలల్లో బోధన చేసే స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు, కేజీబీవీలు, రెసిడెన్సియల్, మోడల్ స్కూళ్లు, జూనియర్/డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, యూనివర్సిటీ కళాశాలల అధ్యాపకులు, ప్రైవేటు పాఠశాలల్లో స్కూలు అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న టీచర్లకు ఓటు హక్కు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఓటరు ప్రాధాన్యతా క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓటు వేస్తున్నట్టు అయితే పేరుకు ఎదురుగా ఉన్న గడిలో ‘ఒకటి’ అని నంబరు వేయాలి. అంతే తప్ప టిక్‌లు పెట్టరాదు. ఓటరుకు బ్యాలెట్ పేపరుతోపాటు స్కెచ్ పెన్ను ఇస్తారు. ఆ పెన్ మాత్రమే ఉపయోగించి ఓటువేయాలి తప్ప ఇతర పెన్నులు వాడరాదు.
మూడో తేదీన ఓట్ల లెక్కింపు
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ గురువారం సాయంత్రం నాలుగు గంటలతో ముగియనున్నది. నగరంలోని పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను సాయంత్రం ఆరు గంటల తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని ఈఈఈ విభాగం బ్లాక్‌లో భద్రపరుస్తారు. మిగిలిన జిల్లాల నుంచి గురువారం రాత్రికి బ్యాలెట్‌బాక్సులు వస్తాయి. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ సిబ్బందికి రెండు రోజుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.