Share News

accident జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:59 PM

accident on national highway ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా కలిసి నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు విశాఖ జిల్లా తగరపువలసలో ఓ ప్రయివేటు ఆస్పత్రికి మినీ బస్సులో శుక్రవారం రాత్రి బయలుదేరారు.

accident జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
లారీని ఢీకొట్టిన బస్‌, ఇన్‌సెట్‌లో సుభ్రత్‌రాయ్‌, మొహిక్‌రాయ్‌(ఫైల్‌ఫొటోలు)

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మినీ బస్‌

తండ్రీ కూతురు మృతి

20మందికి గాయాలు

ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా కలిసి నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు విశాఖ జిల్లా తగరపువలసలో ఓ ప్రయివేటు ఆస్పత్రికి మినీ బస్సులో శుక్రవారం రాత్రి బయలుదేరారు. బస్సు విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చాక మానాపురం సంతతోట వద్ద కాసేపు ఆగింది. రెండు గంటల పాటు డ్రైవర్‌ విశ్రాంతి తీసుకున్నాక తిరిగి బయలుదేరింది. దాదాపు ప్రయాణికులంతా మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. గజపతినగరం మండలం మదుపాడ గ్రామం దాటిన తరువాత ఒక్కసారిగా బస్సులో భారీ కుదుపు చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఆ దాటికి ప్రయాణికులంతా చెల్లాచెదురైపోయారు. గాయాలై ఆర్తనాదాలు చేశారు. పాపం ముందుసీటులో కూర్చొన్న తండ్రీకూతురు ఉన్నచోటే ఇంజిన్‌లో చిక్కుకుని తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ కె.లక్ష్మణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గజపతినగరం, జనవరి18(ఆంధ్రజ్యోతి):

విశాఖ జిల్లా తగరపువలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నేత్ర పరీక్షలు చేయించుకొనేందుకు ఒడిశా వాసులు మినీ బస్సులో శుక్రవారం రాత్రి బయలుదేరారు. బస్సు శనివారం వేకువజాము 3 గంటల సమయంలో గజపతినగరం మండలం మదుపాడ గ్రామం దాటుతూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బావనపల్లి గ్రామానికి చెందిన సుభ్రత్‌ రాయ్‌(30), కుమార్తె మొహిక్‌రాయ్‌(3) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ముందుసీటులో కూర్చోవడంతో ఇద్దరూ తీవ్ర గాయాలతో ప్రాణాలొదిలారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. సుభ్రత్‌రాయ్‌ భార్య మీరారాయ్‌ వెనుక సీటులో కూర్చున్నారు. ఈమె కూడా గాయపడ్డారు. బస్సులో సుమారు 40మంది వరకు ప్రయాణిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మహిత, మండక్‌, బండి మడ్లీ, బరక్‌ మరిదా, కుసుమహడ్‌, అంజలి మండల్‌, లేతా మండల్‌ను 108 వాహనంలో గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన సుభద్రదేవ్‌, అంజలిరాయ్‌, శ్యామలాదేవి, పార్వతీబుద్దో, సుమిత బల్లా, సమిత్రారాయ్‌, అమీబాబు, జస్వింత్‌ మండల్‌, ప్రదీప్‌కుమార్‌ మండల్‌, సతీహందక్‌, జ్యోష్న మండల్‌, మరమాత్‌ హల్దర్‌ విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కొందరు కంటి ఆస్పత్రికి వెళ్లారు. ఘటనలో బస్సు డ్రైవర్‌ ఒమ్మి సత్తిబాబుకు కాలు విరిగిపోయింది. సీఐ ఏవీ రమణ ఘటనా స్థలిని పరిశీలించారు. పెదమానాపురం, గజపతినగరం, బొండపల్లి ఎస్‌ఐలు, సిబ్బంది బాధితులకు సహకారం అందించారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా బస్సు, లారీని వేరు చేశారు.

మరణంలోనూ వీడని బంధం

ఆ తండ్రీకుమార్తె చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరూ ప్రతిరోజూ ఆడుకునేవారు. ఇటీవల వచ్చిన పుష్ప సినిమాలోని హీరో స్టైల్‌ను చిన్నారి అనుకరిస్తుండగా తీసిన ఫొటో సెల్‌ఫోన్‌లో దాచుకున్నాడు. చిన్నారిని ఆ తండ్రి కంటికిరెప్పలా చూసుకునేవాడు. ఒక క్షణం కూడా వదిలేవాడు కాదు. భార్యను కంటి పరీక్షలకు తీసుకొస్తూ బస్సు ముందు సీటులో కుమార్తెతో కలిసి కూర్చొన్నాడు. ఒడిలో పాప నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విధి వక్రీకరించి రెప్పపాటులో ఇద్దరూ విగతజీవులయ్యారు.

Updated Date - Jan 18 , 2025 | 11:59 PM