రహదారులపై నిఘా నేత్రం
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:14 AM
జిల్లాలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు.

- ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
- రూ.5 లక్షలు మంజూరు చేసిన కలెక్టర్
విజయనగరం,కలెక్టరేట్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. అన్ని మండలాలు, మున్సిపాల్టీలు, మేజర్ పంచాయతీలు, జాతీయ రహదారిపై ముందుగా సీసీ కెమెరాలను అమర్చాలని సూచించారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ చాంబర్‌లో బుధవారం జరిగింది. గుర్తుతెలియలి వాహనాలు ఢీకొని మృతి చెందిన, క్షతగాత్రులుగా మారిన మొత్తం 12 కేసులపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు నివారణపై ముందుగా దృష్టి సారించాల్సి ఉందని అన్నారు. దీని కోసం డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ నిబంధనలను కఠినతరం చేయాలన్నారు. ప్రమాద కారకులైనవారి లైసెన్స్‌లను సస్పెండ్ చేయడం, రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించడం తదితర చర్యలు చేట్టాలని సూచించారు. ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదానికి గల కారణాలను, సంబంధిత కారుకులను గుర్తించేందుకు వీలుంటుందన్నారు. నేరాల నియంత్రణకు కూడా దోహద పడతాయన్నారు. గుర్తుతెలియని వాహనాలు ఢీకొని వ్యక్తులు మరణించిన సంఘటనల్లో ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనన్న కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. రాజాం, చీపురుపల్లి ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు 15 రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించారు. దీనికోసం రూ.5 లక్షలను మంజూరు చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఆర్‌వో శ్రీనివాస మూర్తి, డీటీవో మణికుమార్, జిల్లా వైద్యాధికారి జీవనరాణి తదితరులు పాల్గొన్నారు.