murder సాఫ్ట్‌వేర్ ఇంజనీరు హత్య
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:06 AM
A software engineer was murdered చదువులో ముందు ఉండేవాడు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ అన్ని తరగతుల్లో ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తెలివి తేటలతోనే చిన్న వయసులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఉద్యోగం సాధించాడు. ఇటు గ్రామంలో కూడా వివాదాలకు దూరంగా మసలేవాడు. స్నేహితులతోనే మాట్లాడేవాడు. పెళ్లి సంబంధాలు చూస్తామని అమ్మనాన్న చెప్పడంతో ఇటీవలే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఊరు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి బయల్దేరాడు. కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లికి గుండెను మెలేసే దుర్వార్త తెలిసింది. తనయుడు హత్యకు గురైనట్లు చెవిన పడిన వెంటనే ఆమె పరుగున వెళ్లింది. తీవ్రగాయాలతో అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా విలపించింది. తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు కోనారి ప్రసాద్(28) విషాదాంతమిది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీరు హత్య
పెళ్లి సంబంధాల కోసం బెంగళూరు నుంచి ఊరికి రాక
అమ్మమ్మ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా దారుణం
తలను రాయిపై మోది చంపినట్లు వైద్యుల నిర్ధారణ
కన్నీటి సంద్రంలో బాధిత కుటుంబం
చదువులో ముందు ఉండేవాడు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ అన్ని తరగతుల్లో ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తెలివి తేటలతోనే చిన్న వయసులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఉద్యోగం సాధించాడు. ఇటు గ్రామంలో కూడా వివాదాలకు దూరంగా మసలేవాడు. స్నేహితులతోనే మాట్లాడేవాడు. పెళ్లి సంబంధాలు చూస్తామని అమ్మనాన్న చెప్పడంతో ఇటీవలే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఊరు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి బయల్దేరాడు. కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లికి గుండెను మెలేసే దుర్వార్త తెలిసింది. తనయుడు హత్యకు గురైనట్లు చెవిన పడిన వెంటనే ఆమె పరుగున వెళ్లింది. తీవ్రగాయాలతో అచేతనంగా పడి ఉన్న కొడుకును చూసి తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా విలపించింది. తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు కోనారి ప్రసాద్(28) విషాదాంతమిది.
- ‘ఒకరి ఊసు గాని మరొకరి జోలికి గాని ఎల్లనోడు నా కొడుకు. ఆడి పనేదో ఆడు చేసుకుంటుంటాడు. చిన్నప్పటి నుంచి ఆడికి చదువు తప్ప ఏ ధ్యాస లేదు. అలాంటి నా కొడుకును ఇంత కసాయిగా ఎవ్వరు చంపేసారు దేవుడా?’ అని తల్లి అప్పయ్యమ్మ రోదిస్తుంటే అక్కడ ఉన్న వారంతా కకావికల మనస్కులై కన్నీరుపెట్టుకున్నారు.
తెర్లాం/బొబ్బిలి/బాడంగి, ఫిబ్రవరి 11(ఆంఽధ్రజ్యోతి):
నెమలాం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు కోనారి ప్రసాద్(28) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు అమ్మనాన్నలు సన్యాసి, అప్పయ్యమ్మతో పాటు తమ్ముడు అచ్యుతరావు ఉన్నాడు. చెల్లెలు స్వాతికి వివాహమైంది. పెళ్లి సంబంధాలు చూసేందుకు అమ్మనాన్న పిలవడంతో ఇటీవలే ప్రసాద్ స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఊరు విజయరాంపురానికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి బయల్దేరాడు. రాత్రి 9-30 గంటల సమయంలో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఎన్.బూర్జివలస సమీపంలో ప్రసాద్ మృతదేహం రోడ్డుపై పడి ఉండడాన్ని చూసిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు పరుగుపరుగున ఘటనా స్థలికి వెళ్లారు. తీవ్ర గాయాలతో కదలిక లేకుండా ఉన్న ప్రసాద్‌ను చూసి గుండెలు బాదుకుని విలపించారు. అచేతన స్థితిలో యువకుని చూసి ఊరు ఊరంతా కన్నీరు పెట్టింది. చేతికి అందివచ్చిన కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ కుటుంబ సభ్యులకు కొండంత అండగా ఉన్నాడని ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు. పెళ్లి చేద్దామని అనుకుంటుండగా అంతలోనే ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. ప్రసాద్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు హృదయ విదారకంగా రోదిస్తుండడాన్ని చూసిన ప్రతి కన్నూ చెమర్చింది. విషయం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం, బాడంగి ఎస్‌ఐలు సాగర్‌బాబు, తారకేశ్వరరావు మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విజయనగరం నుంచి క్లూస్ టీము వచ్చి ఆధారాలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ ఘటనా స్థలం నుంచి కొంత దూరం వరకు వెళ్లి ఆగిపోయాయి.
- బాడంగి సీహెచ్‌సీకి బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన వెళ్లి మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. పోస్టుమార్టం చేసిన వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌పీతో ఫోన్‌లో మాట్లాడారు. హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు మంగళవారం నెమలాం వెళ్లి ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఐబీఎంలో ఉద్యోగం
కోనారి ప్రసాద్ ప్రాథమిక విద్య నుంచి టెన్త్ వరకు నెమలాం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇడుపులపాయలోని వెల్లంపల్లి ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేసి 2021లో బెంగళూరు ఐబీఎంలో ఉద్యోగం సాధించాడు. తమ్ముడు అచ్యుతరావు కూడా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు కాయకష్టం చేసుకుని పిల్లలను బాగా చదివించారు. వారు ప్రయోజకులయ్యారని, ఓ ఇంటి వారిని చేద్దామని ఎన్నెన్నో కలలు కంటున్నారు. పెద్ద కుమారుడు హత్యకు గురవడంతో వారి కలలన్నీ కల్లలుగా మారిపోయాయి.
నిందితులను పట్టుకుంటాం
భవ్యారెడ్డి, బొబ్బిలి డీఎస్పీ
ఘటనా స్థలాన్ని పరిశీలించి అన్ని ఆధారాలను సేకరించాం. మృతదేహంపై కత్తిగాట్లు కనిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ హత్యగానే నిర్ధారించుకున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరలో పట్టుకొని చట్టానికి అప్పగిస్తాం. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం. శవ పంచాయితీ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాడంగి సీహెచ్‌సీకి తరలించాం. కేసు దర్యాప్తు చేస్తున్నాం.
ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా?
కోనారి ప్రసాద్ హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్ ఐటిలో చదువుకున్నరోజుల్లో ఆ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రసాద్‌కు పరిచయాలుండేవని, ఇప్పుడు వారి పరిచయాలు అలా కొనసాగుతున్నాయో లేదో తనకు తెలియదని ప్రసాద్ స్నేహితుడు తెలిపాడు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
తలను రాయికి మోదడంతోనే హత్య
డాక్టర్ల నిర్ధారణ
బాడంగి సీహెచ్‌సీలో ప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ మంగళవారం పూర్తయింది. ప్రసాద్ తలను ఓ రాయికి గట్టిగా మోదించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని వైద్యులు తెలిపారు. పంట భూముల్లోని సర్వే రాయికి తల బలంగా తాకడంతో ప్రసాద్ మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆర్‌బీ రోడ్డుపైకి తెచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.