Share News

For construction of bridges: గిరిజనుల కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:11 AM

For construction of bridges: గిరిజనులకు వంతెన కష్టాలు తీరనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మండలంలోని సరాయివలస సమీపంలో కొండవాగు గెడ్డపై రెండు వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

For construction of bridges: గిరిజనుల కష్టాలకు చెక్‌
పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి సంధ్యారాణి (ఫైల్‌)

- కొండవాగు గెడ్డపై రెండు వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన

- రూ.2కోట్లు మంజూరు

- మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

పాచిపెంట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు వంతెన కష్టాలు తీరనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మండలంలోని సరాయివలస సమీపంలో కొండవాగు గెడ్డపై రెండు వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు శంకుస్థాపన కూడా చేసింది. దీంతో తమ దశాబ్దాల కల త్వరలో నెరవేరనుందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండవాగు గెడ్డపై వంతెనలు లేకపోవడంతో మండలంలోని 15 గ్రామాలకు చెందిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల సమయంలో గెడ్డలో నీటి ఉధృతి పెరగడంతో చొక్కాపువానివలస, శివలింగపురం, సరాయివలస, తదితర గ్రామాల గిరిజనులు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంటుంది. కొన్నిసార్లు నీటి ఉధృతి కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు మహేష్‌, బర్తి విధులకు వెళ్లేందుకు కొండవాగు గెడ్డ దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కొండవాగు గెడ్డపై రెండు వంతెనలు నిర్మిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రెండు వంతెనలతో పాటు 1.2 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. చొక్కాపువానివలస నుంచి సరాయివలస మార్గమధ్యలో ఒక వంతెన, సరాయివలస సమీపంలో మరొక వంతెన నిర్మించనున్నారు. ఈ పనులకు ఈ నెల 24న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. దీంతో గిరిజన, గిరిజనేతరుల ఆనందానికి అవధులు లేవు. వంతెనల నిర్మాణం పూర్తయితే 15 గిరిజన గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి. ముఖ్యంగా సరాయివలసలోని గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ వంతెనలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

చాలా సంతోషంగా ఉంది..

కొండవాగు గెడ్డపై రెండు వంతెనల నిర్మాణానికి మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సరాయి వలస సమీపంలో వంతెన లేక ఎందరో ప్రమాదాలకు గురయ్యారు. బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే గిరిజనులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

-జి.యుగంధర్‌, సర్పంచ్‌, పాంచాళి, పాచిపెంట మండలం

సకాలంలో పనులు పూర్తిచేస్తాం

వంతెనల నిర్మాణం సకాలంలో పూర్తిచేస్తాం. పనులు శరవేగంగా చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించాం. దశాబ్దాల నాటి గిరిజనుల కల నెరవేరనుంది. డోలీ మోతలు తగ్గుతాయి.

గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి

Updated Date - Jan 31 , 2025 | 12:11 AM