Share News

33 Packets 4 బ్యాగులు.. 33 ప్యాకెట్లు

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:19 AM

4 Bags.. 33 Packets పాచిపెంట మండలం మాతుమూరు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే జంక్షన్‌ వద్ద బుధవారం పోలీసులు 153.62 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అయితే రవాణాదారులు మాత్రం పరారయ్యారు.

 33 Packets 4 బ్యాగులు.. 33 ప్యాకెట్లు
పట్టుబడిన గంజాయితో ఏఎస్పీ , సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది

సాలూరు (పాచిపెంట), ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలం మాతుమూరు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే జంక్షన్‌ వద్ద బుధవారం పోలీసులు 153.62 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అయితే రవాణాదారులు మాత్రం పరారయ్యారు. ఏఎస్పీ అంకిత సురాన తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే జంక్షన్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అయితే ఒడిశా నుంచి మాతుమూరు మీదుగా సాలూరు వైపు కారులో సరుకును తీసుకొస్తున్న రవాణాదారులు ఆ జంక్షన్‌ వద్ద పోలీసులను చూసి పరారయ్యారు. దీంతో అక్కడున్ను ఎస్‌ఐ కె.వెంకట సురేష్‌, సాలూరు సర్కిల్‌ టీము వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో నాలుగు గన్నీ బ్యాగుల్లో ఉన్న 33 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని ఏఎస్పీ చెప్పారు. గత మూడు నెలల్లో వెయ్యి కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు.

ముమ్మర తనిఖీలు : ఏఎస్పీ

ఒడిశా - ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పాటు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారని ఏఎస్పీ తెలిపారు. పాచిపెంట పోలీస్‌స్టేషన్‌లో ఆమె మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణ చర్యల్లో భాగంగా మాతుమూరు వద్ద చెక్‌పోస్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించా మన్నారు. మహాశివరాత్రికి జరగబోయే పారమ్మ కొండ జాతరకు 120 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నామని వెల్లడించారు. ప్రజలతో పోలీసులు మమేకం అయ్యేందుకు వాలీబాల్‌ టోర్నమెంట్లు, మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. సైబర్‌ నేరగాళ్ల బారిన పడితే 1930 , 1972కు నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సాలూరు టౌన్‌, రూరల్‌ సీఐలు బి.అప్పలనాయుడు, పి.రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:19 AM