రేపటి నుంచి ఏలేరు కాలువ మూసివేత
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:00 AM
ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి నగరానికి తాగునీటిని తీసుకువచ్చే ఏలేరు కాలువను నిర్వహణ పనుల కోసం మంగళవారం నుంచి మూసివేయాలని నీటి పారుదల శాఖ అధికారులు, జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు.

నీటి పారుదల, జీవీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహణ పనులు
నెల రోజులు తర్వాత పునఃప్రారంభం
తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ చర్యలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):
ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి నగరానికి తాగునీటిని తీసుకువచ్చే ఏలేరు కాలువను నిర్వహణ పనుల కోసం మంగళవారం నుంచి మూసివేయాలని నీటి పారుదల శాఖ అధికారులు, జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి ప్రతిరోజూ 300 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) నీటిని ఓపెన్ కెనాల్ ద్వారా 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరానికి తీసుకువస్తున్నారు. గాజువాకలోని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)కు, అక్కడి నుంచి నగరంలోని వివిధ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లకు తరలించి శుద్ధిచేసిన తర్వాత ప్రజలకు సరఫరా చేస్తున్నారు. 2017లో చివరిసారిగా కాలువకు మరమ్మతులు చేపట్టారు. ఆ తరువాత అటు వైపు చూడలేదు. దీంతో ప్రస్తుతం కాలువ పొడవునా ఎక్కడికక్కడ లీకేజీలు ఏర్పడ్డాయి. దీనివల్ల భారీగా నీరు వృథా అవుతోంది. కాలువను నిర్వహణ కోసం మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని నీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అనుమతించడంతో జీవీఎంసీ అధికారులతో చర్చించారు. ఇరు శాఖల అధికారులు సమ్మతితో ఈనెల 24 నుంచి కాలువలోకి నీటిని విడుదల చేయకుండా రిజర్వాయర్ వద్ద మూసివేయాలని నిర్ణయించారు. కాలువపై ఉన్న ఆక్విడెక్ట్‌ల మరమ్మతులు, పూడికతీత, లీకేజీల నివారణ పనులను నీటి పారుదల శాఖ అధికారులు చేపట్టనున్నారు. తాళ్లవలస వద్ద ఉన్న ఏలేరు లింక్ కెనాల్‌ను కూడా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. ఇందుకోసం రూ.80 కోట్లు వినియోగించనున్నారు. అదే సమయంలో జీవీఎంసీ అధికారులు కూడా గత కొన్నేళ్లుగా చేయాలనుకుంటున్న కాలువపై క్రాసింగ్ పైప్‌లైన్లను మార్చడం, గట్లను పటిష్ఠం చేయడం, నీటి పారుదల శాఖకు నీటిని మళ్లించే చోట్ల ఉన్న ఆక్విడెక్ట్‌ల వద్ద లీకేజీలను అరికట్టడం వంటి పనులు పూర్తిచేస్తారు. దీనికోసం రూ.7.5 కోట్లు ఖర్చుపెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. నగరానికి తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన ఏలేరు కాలువను మూసివేస్తే నగరంలో ఇబ్బందులు ఎదురవడం ఖాయం కాబట్టి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఏలేరు కాలువ నుంచి జీవీఎంసీకి వచ్చే 250 ఎంజీడీ నీటిలో పరిశ్రమలకు 60 ఎంజీడీ ఇస్తున్నందున...ఇప్పటికే పరిశ్రమల్లోని రిజర్వాయర్లలో 45 రోజులకు సరిపడేలా నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. గాజువాక ప్రాంతానికి అవసరమయ్యే 8 ఎంజీడీ నీటిని స్టీల్‌ప్లాంటు నుంచి ప్రతిరోజూ తీసుకునేలా కర్మాగారంతో ఒప్పందం చేసుకున్నారు. ఏలేరు కాలువ పునఃప్రారంభమైన తర్వాత ఆ మేరకు నీటిని తిరిగి స్టీల్‌ప్లాంటుకు సరఫరా చేయనున్నారు. దీనికితోడు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌నుంచి నరవ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు ప్రతిరోజూ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా పంపించి అక్కడ నుంచి టీఎస్‌ఆర్ కాంప్లెక్స్‌లోని రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఏలేరు కాలువ మూసివేసినా నగరంలో నీటి సరఫరాకు ఇబ్బంది ఉండదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఏలేరు కాలువ నిర్వహణ పనులు పూర్తయితే కాలువ పొడవునా వృథా తగ్గి నగరానికి చేరే నీటి పరిమాణం పెరుగుతుందని, దీనివల్ల వేసవిలో కూడా ఇబ్బంది ఉండదని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.