ఇన్‌చార్జుల మార్పుపై వైసీపీ కసరత్తు
ABN , Publish Date - Jan 17 , 2025 | 02:01 AM
శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుపై అధిష్ఠానం దృష్టిసారించింది.

మాజీ మంత్రి అమర్‌కు చోడవరం బాధ్యతలు
భీమిలి వెళ్లాలని ధర్మశ్రీకి సూచన...తిరస్కరించినట్టు ప్రచారం
అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించే యోచనలో అధిష్ఠానం
మాడుగుల సమన్వయకర్తగా బూడి
చోడవరం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):
శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుపై అధిష్ఠానం దృష్టిసారించింది. ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జులను నియమిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను సమీక్షించడంతోపాటు, ఆయా స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పుడే ఎంపిక చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు కిందిస్థాయి నాయకులకు సమాచారం వచ్చింది. దీనిలో భాగంగా చోడవరం నియోజకవర్గం సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ్ అమర్‌నాథ్‌ను నియమించనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
గత ఏడాది సాధారణ ఎన్నికల ముందే అమర్‌ను అనకాపల్లి నుంచి చోడవరానికి మారుస్తారని, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించుతారని ప్రచారం జరిగింది. కానీ వివిధ సమీకారణాల నేపథ్యంలో అమర్ విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేయగా, చోడవరంలో ధర్మశ్రీనే కొనసాగించారు. ఎన్నికల్లో ఊహించని రీతిలో ప్రతికూల ఫలితాలు రావడంతో నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్చాలనే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్టు తెలిసింది. భీమిలి మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేయడంతో గుడివాడ అమర్‌నాథ్‌ను ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా వెళ్లాలని పార్టీ అధిష్ఠానం కోరిందని, అయితే తనకు భీమిలి వద్దని, అనకాపల్లి జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని ఆయన కోరినట్టు తెలిసింది. దీంతో గుడివాడ్ అమర్‌ను చోడవరం ఇన్‌చార్జిగా నియమించాలని పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా వెళ్లాలని ధర్మశ్రీని పార్టీ ఆదేశించినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే భీమిలి వెళ్లేందుకు ధర్మశ్రీ ఆసక్తి చూపించకపోవడంతో అక్కడ మరొకరిని నియమించా లని అధిష్ఠానం భావిస్తున్నట్టు చెబుతున్నారు. గుడివాడ అమర్ చోడవరం రావడం ఖాయం కావడంతో ధర్మశ్రీని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించి, వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎంపీ అభ్యర్థిగా బరిలో దించుతారని అంటున్నారు.
చోడవరానికి పలువురి పేర్లు పరిశీలన
చోడవరం నియోజకవర్గానికి ధర్మశ్రీ స్థానంలో స్థానిక నేతల్లో ఒకరిని సమన్వయకర్త ఎంపిక చేయాలని భావించిన అధిష్ఠానం...డాక్టర్ బండారు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏడువాక సత్యారావు, బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, రావికమతం మండలానికి చెందిన కంచిపాటి జగన్నాఽథరావు పేర్లు పరిశీలించింది. అయితే వీరంతా మండలస్థాయి నేతలే కావడంతో చివరకు అమర్‌ను సమన్వయకర్తగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబతున్నారు. ఈ మేరకు మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడును తిరిగి మాడుగుల సమన్వయకర్తగా నియమించనున్నట్టు సమాచారం