ఉక్కుకు చిక్కులు తొలగేదెన్నడో!?
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:43 AM
ఒకప్పుడు వేల కోట్ల రూపాయలు టర్నోవర్‌తో నడిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇప్పుడు వ్యవస్థాపక దినోత్సవం కూడా నిర్వహించుకోలేని పరిస్థితికి వచ్చింది.
నేడు వ్యవస్థాపక దినం
ఉత్సవాలూ లేవు
నెహ్రూ అవార్డులూ లేవు...
రూ.వేల కోట్ల టర్నోవర్‌తో నడిచిన కర్మాగారం పరిస్థితి దయనీయం
సక్రమంగా అందని జీతాలు
కార్మికుల కంట కన్నీళ్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఒకప్పుడు వేల కోట్ల రూపాయలు టర్నోవర్‌తో నడిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇప్పుడు వ్యవస్థాపక దినోత్సవం కూడా నిర్వహించుకోలేని పరిస్థితికి వచ్చింది. అత్యంత కష్టకాలంలో...సామర్థ్యానికి మించి 110 శాతం ఉత్పత్తి సాధిస్తున్న కార్మికులు, ఉద్యోగులను భుజం తట్టి ప్రోత్సహించేందుకు కూడా వెనుకాడుతోంది. కర్మాగారం ఏర్పాటై మంగళవారం నాటికి 43 ఏళ్లు అవుతోంది. వ్యవస్థాపక దినోత్సవాన్ని గతంలో ఘనంగా నిర్వహించేవారు. హరిప్రసాద్ చౌరాసియా వంటి సంగీత విద్వాంసుల్ని రప్పించి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నిబద్ధతతో కష్టపడి పనిచేసే వారికి నెహ్రూ అవార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు అవేవీ లేవు. గత నాలుగేళ్లుగా నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా ఉత్సవాలనే రద్దు చేశారు.
ఉక్కు కర్మాగారం కోసం నాడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పో యారు. ఎట్టకేలకు స్టీల్ ప్లాంటు నిర్మాణానికి 1972లో శంకుస్థాపన జరిగింది. 1986లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 1988 నుంచి ఒక్కొక్క విభాగం ప్రారంభమయ్యాయి. 1990 సంవత్సరానికి నిర్మాణం మొత్తం పూర్తయింది. 1992లో నాటి ప్రధాని పీవీ నరసింహరావు జాతికి అంకితం చేశారు.
నాలుగేళ్ల కిందట విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ ప్రకటించే సమయానికి కర్మాగారం వేయి కోట్ల రూపాయల లాభంలో ఉంది. విస్తరణ, నిర్వహణ మూలధనం కోసం చేసిన అప్పులు 2021 నాటికి సుమారు రూ.20 వేల కోట్లు. అయితే ఉక్కు రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలో పెడుతున్నామని 2021లో ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్పటి నుంచి విశాఖ ప్లాంటుకు కష్టాలు మొదలయ్యాయి. ఎటువంటి సహాయం అందకపోవడంతో పీకల్లోతు నష్టాల్లోకి వెళ్లింది. అప్పులు రూ.35 వేల కోట్లకు చేరాయి. ముడి పదార్థాలు కరవయ్యాయి. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం మొదలైంది. అయితే గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా కూటమి నేతల ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.11,440 కోట్ల సాయం ప్రకటించింది. అయితే సొంత ఐరన్‌ఓర్ గనులు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఉత్పత్తి వ్యయం ఇతర ప్లాంట్ల కంటే ఎక్కువగా ఉంది.
ఉక్కు కర్మాగారానికి మానవ వనరులే కీలకం. యాజమాన్యం సానుకూల వైఖరి వల్ల గతంలో ఉద్యోగులు కష్టపడి 15 ఏళ్లు వరుసగా లాభాలలో నడిపించారు. వేతన ఒప్పందం తరువాత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను పెండింగ్‌లో పెట్టేశారు. ప్రస్తుత యాజమాన్యం ఉద్యోగులపై వివక్ష చూపుతూ పాత వేతనాల్లో రకరకాల పేర్లతో 25 శాతం కోత విధించింది. ఆ మిగిలిన జీతాలు కూడా నెల నెలా ఇవ్వడం లేదు. మరో వైపు ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి 73 లక్షల టన్నుల ఉత్పత్తికి కొత్తగా ఐదు వేల మంది ఉద్యోగులు కావాలి. రిక్రూట్‌మెంట్ మొదలుపెడితే నిర్వాసితులకు 2,500 ఉద్యోగాలు వస్తాయి. కానీ అవేమీ చేయకుండా ఉన్నవారిలో 1,200 మందికి వీఆర్‌ఎస్ ఇచ్చి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. కాంట్రాక్టు కార్మికులను 30 శాతం తగ్గించడానికి కుట్ర జరుగుతోంది.
తలకు మించిన భారమే
ఆర్థిక ప్యాకేజీ ఇచ్చిన ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి ఇక్కడకు వచ్చినప్పుడు...‘కేంద్ర సాయంతో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడుపుకొని మీ జీతాలు మీరు తీసుకోండి’ అని ప్రకటించారు. సొంత గనులు లేకుండా, వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చకుండా నెల నెలా వందల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లిస్తూ, 73 లక్షల టన్నుల ఉత్పత్తికి అవసరమైన వేలాది కోట్ల విలువైన ముడి పదార్థాలను సమకూర్చుకోవడం యాజమాన్యానికి తలకు మించిన భారం. గత ఐదు నెలలుగా సంస్థకు శాశ్వత చైర్మన్ లేరు. వేరొకరిని డిప్యుటేషన్‌పై తీసుకువచ్చి నియమించారు. ప్లాంటు ఆపరేషన్ వ్యవహారాలు పర్యవేక్షించే డైరెక్టర్ లేరు. ఇండిపెండెంట్ డైరెక్టర్ పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. ఎవరినీ నియమించకుండా, ఉన్న వారిని తీసేసి, తగ్గించి, అవసరమైన ముడి పదార్థాలు అందించకుండా ప్లాంటును పట్టాలపైకి తేవడం చాలా కష్టం. రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లకే ముడి పదార్థాల సరఫరా అరకొరగా ఉంది. ఇక మూడోది ప్రారంభిస్తే ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో చెప్పడం లేదు. అన్నీ ఇచ్చినా ప్లాంటును పైకి తీసుకురాలేకపోయారని ముద్ర వేయడానికి ఇదంతా చేస్తున్నారనే ఉద్యోగ, కార్మిక వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై కేంద్రం, ఎంపీలు, దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.