అల్లూరి అనుచరుడి వారసులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:48 PM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడు గాం గంటందొర వారసుల ఆర్థికాభివృద్ధికి వీలుగా స్వయం ఉపాధి కల్పనకు త్వరలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేశ్‌కుమార్, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఎన్‌సీసీ) చైర్మన్ ఏఎస్ దుర్గాప్రసాద్ తెలిపారు.

స్వయం ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటాం
కలెక్టర్ దినేశ్‌కుమార్, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ ఏఎస్ దుర్గాప్రసాద్ వెల్లడి
గాం గంటందొర వారసుల కోసం నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉచితంగా నిర్మించిన గృహ సముదాయం ప్రారంభం
లబ్ధిదారులకు గృహ పత్రాలు, తాళాలు అందజేత
ప్రాంగణంలోని అల్లూరి సీతారామరాజు, గంటందొర విగ్రహాలకు నివాళి
కొయ్యూరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడు గాం గంటందొర వారసుల ఆర్థికాభివృద్ధికి వీలుగా స్వయం ఉపాధి కల్పనకు త్వరలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేశ్‌కుమార్, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఎన్‌సీసీ) చైర్మన్ ఏఎస్ దుర్గాప్రసాద్ తెలిపారు. సోమవారం మండలంలోని బట్టపణుకుల పంచాయతీ లంకవీధిలో ప్రభుత్వం సమకూర్చిన స్థలంలో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉచితంగా నిర్మించిన అల్లూరి గృహ సముదాయ భవనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి అనుచరుడి వారసులకు సొంత గూడు లేదని 2022 జనవరి 2న క్షత్రియ పరిషత్ సమావేశంలో పూర్వపు చైర్మన్ దృష్టికి వచ్చిందన్నారు. 2023 జూలై 4న రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో పూర్వపు చైర్మన్... గంటందొర వారసుల కుటుంబాలకు శాశ్వత గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిం చడంతో అల్లూరి బ్లాక్ 1, బ్లాక్ 2గా గృహ సముదాయాన్ని పటిష్ఠంగా నిర్మించామని తెలిపారు. ఇళ్లతో పాటు ఆయా కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఒక పోర్షన్ కేటాయించామన్నారు. కలెక్టర్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ గంటందొర వారసుల కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అంతే కాకుండా రంప ఉద్యమ చరిత్ర భావితరాలకు తెలిసేలా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆయా గృహాలకు సంబంధించిన యాజమాన్య హక్కు ధ్రువపత్రంతో పాటు తాళాలు అందజేశారు. అంతకు ముందు గృహ సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించి ఎన్‌సీసీ చైర్మన్‌తో కలిసి నివాళులర్పించారు. ఎన్‌సీసీ ఈడీ ఏజీకే రాజుతో పాటు ప్రతినిధులు కలెక్టర్‌ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కాగా తమకు ఉచితంగా ఇళ్లు ఇచ్చిన ఎన్‌సీసీ యాజమాన్యానికి గంటందొర వారసులు ధన్యవాదాలు తెలిపారు. తమ ఏళ్లనాటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏజీకే రాజు, క్షత్రియ పరిషత్ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో ఎస్‌కేవీ ప్రసాద్, మండల ఇంజనీరింగ్ అధికారి రామకృష్ణ, ఏటీడబ్యువో క్రాంతికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సాయి, డీటీ కుమార్‌స్వామి, అప్పన్న, ఆర్‌ఐ, స్థానిక సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.