చినుకు రాలినా...ప్చ్!
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:47 AM
శీతాకాలంలో వర్షాలు కురిసినా భూగర్భ జల మట్టాలు కొన్ని ప్రాంతాల్లో అంతా ఆశాజనకంగా లేవు.

నగరంలో ఆశాజనకంగా లేని భూగర్భ జలాలు
జనావాసాలు పెరిగిన చోట తగ్గుదల
రీచార్జి చేయకుంటే మూల్యం చెల్లించాల్సిందేనంటున్న నిపుణులు
గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెరుగుదల
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
శీతాకాలంలో వర్షాలు కురిసినా భూగర్భ జల మట్టాలు కొన్ని ప్రాంతాల్లో అంతా ఆశాజనకంగా లేవు. సాధారణంగా వేసవి సీజన్‌లో భూగర్భ జల మట్టాలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి వర్షాకాలంలో కొన్నిచోట్ల ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. అయితే డిసెంబరులో అల్పపీడనాల ప్రభావంతో కురిసిన వర్షాలు కొంతవరకు భూగర్భ జలాల పెరుగుదలకు ఉపయోగపడ్డాయి. జూన్‌లో మొదలైన వర్షాకాలం ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు వరకూ కొనసాగడంతో కొంతవరకూ ఊపిరి పీల్చుకునే అవకాశం ఏర్పడిందని భూగర్భ జల నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబరు నెలలో ముసురు లేకపోతే నగరంలో కొన్నిచోట్ల మరింత దారుణ పరిస్థితి నెలకొనేదని విశ్లేషించారు. అయితే జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో 2022, 2023తో పోల్చితే 2024 డిసెంబరులో భూగర్భ జలమట్టాలు మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో వర్షాలు బాగానే కురిశాయి. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో నవంబరు నెలలో అడపాదడపా వర్షాలు కురుస్తుండేవి. కానీ ఈ ఏడాది డిసెంబరులో ఫెంగల్ తుఫాన్, తరువాత అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు పడ్డాయి. భూమిలోకి వర్షపునీరు ఇంకేలా జల్లులు కురవడం మేలు చేసింది. గత మూడేళ్లలో డిసెంబరు నెలలో భూగర్భ జల మట్టాలు పరిశీలిస్తే 2024లో జిల్లాలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో భూగర్భ జల మట్టాలు పెరగడం లేదా స్థిరంగా కొనసాగడం జరిగింది. నగరంలో అనేకచోట్ల డిసెంబరు నెలాఖరుకు 10 మీటర్లు, అంతకంటే తక్కువకు పడిపోవడం, కొన్నిచోట్ల పెరుగుదల కనిపించింది. నగరంలో విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగం సాగడంతో వచ్చే వేసవిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు హెచ్చరించారు.
గ్రామీణంలో పెరుగుదల
ఆనందపురం మండలం శొంఠ్యాంలో డిసెంబరుకు సంబంధించి 2022లో 8.09 మీటర్లున్న భూగర్భ జల మట్టాలు 2023లో 5.1 మీటర్లు, ఈ ఏడాది 4.21 మీటర్లుగా నమోదయ్యాయి. భీమిలి మండలం చిప్పాడలో 2022లో 5.13 మీటర్లుండగా, ఈ ఏడాది 1.99, పెందుర్తి మండలం నరవలో 2022లో 5.13 మీటర్లు, ప్రస్తుతం 1.25, ఎంపీడీవో కార్యాలయం వద్ద 8.09 మీటర్లుండగా ప్రస్తుతం 7.19 మీటర్లలో ఉన్నాయి. కాగా గ్రామీణ ప్రాంతంలో జనావాసాలు ఎక్కువగా ఉన్నచోట, అభివృద్ధి జరిగే ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. భీమిలిలో ఏపీ గురుకులం వద్ద 2022లో 5.13 మీటర్లు ఉండగా ప్రస్తుతం 7.39 మీటర్లకు పడిపోయింది. నగరంలో అనేక చోట్ల డిసెంబరులో భారీగా జలమట్టాలు పడిపోయాయి. గాజువాక కణితి కాలనీలో 2022లో 4.56 మీటర్లుండగా గత ఏడాది 10.27కు, ప్రస్తుతం 11.23 మీటర్లకు పడిపోయాయి. ఆరిలోవ పోలీస్ స్టేషన్ వద్ద 2022లో 5.13 మీటర్లున్న భూగర్భ మట్టాలు గత ఏడాది 14.22కు, ఈ నెలలో 12.65కు, మారికవలస బిస్లరీ యూనిట్ వద్ద వరుసగా 5.13, 10.44, 9.45, మధురవాడ ఆస్పత్రి వద్ద 2022లో 5.23 ఉండగా, గత ఏడాది 13.73, ప్రస్తుతం 11.89 మీటర్లకు పడిపోయింది. నగరంలో సెంట్రల్ పార్కు వద్ద 2022లో 3.76 మీటర్లు ఉండగా, 2023లో 13.63, ప్రస్తుతం 13 మీటర్లు, ఏయూ యోగా విలేజ్ వద్ద 6.36, 6.93, 6.72 మీటర్లుగా ఉన్నాయి. బీవీకే కళాశాల దగ్గర 2022లో 5.23 మీటర్లున్న జల మట్టాలు 2023లో 4.27, ప్రస్తుతం 2.48 మీటర్లు, గోపాలపట్నం రైతుబజారు వద్ద 4.56, 6.23, 2.36 మీటర్లలో ఉన్నాయి.
నీటి రీచార్జి విధానం పెరగాలి
- శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ జల శాఖ
ఇటీవల కురిసిన వర్షాలతో కొన్నిచోట్ల భూగర్భ జలాలు పెరిగాయి. మరికొన్నిచోట్ల స్థిరంగా ఉన్నాయి. డిసెంబరు నెలలో రోజుల తరబడి ముసురు ఉపయోగపడింది. రానున్న రెండు , మూడు నెలల వరకు భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఏప్రిల్ నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ నగరం, పరిసరాల్లో వాడుక నీరు రీచార్జి చేసేలా ఇంకుడు గుంతలు విరివిగా తవ్వాలి. ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వీటిని ఏర్పాటుచేయాలి. నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో నీరు ఇంకే పరిస్థితి లేదు.
మండలాల వారీగా సగటు భూగర్భ జల మట్టాలు
మండలం బావి ఉండే ప్రాంతం 2022 2023 2024
(మీటర్లలో)
ఆనందపురం పందులపాక 3.26 6.25 4.95
భీమిలి ఏపీ గురుకులం 2.21 3.26 3.54
గాజువాక అగనంపూడి పాఠశాల 5.53 6.84 6.35
ములగాడ గొల్లలపాలెం హెల్త్ సెంటర్ 4.74 6.75 4.88
గోపాలపట్నం ఏపీఐడీసీ ఆఫీస్ 3.62 5.95 3.32
పద్మనాభం అనంతవరం 4.21 5.24 4.69
పెదగంట్యాడ పాలవలస హిందూజా ప్లాంట్ 2.82 5.24 4.69
పెందుర్తి నరవ 4.18 4.6 4.22
సీతమ్మధార ఏపీటీడీసీ 5.44 6.53 4.47
మహారాణిపేట యోగా విలేజ్ 10.06 10.28 9.86
విశాఖ రూరల్ రుషికొండ స్కూలు 10.01 13.51 10.57