చేపల వేట నిషేధ భృతికి నిరీక్షణ
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:47 AM
గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సముద్రంలో చేపల వేట నిషేధానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు పరిహారం అందలేదని జిల్లాలోని పలు మండలాల మత్స్యకారులు వాపోతున్నారు. మరబోట్ల ద్వారా సముద్రంలో వేట సాగించే రెండు వేల పైచిలుకు మంది మత్స్యకారులకు పది వేల రూపాయల చొప్పున రెండు కోట్ల రూపాయల మేర అందాల్సి వుంది.

ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ మత్స్యకారులకు అందని పరిహారం
గత ఏడాది ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో చెల్లించని అధికారులు
జిల్లాలో 2,168 మందికి రూ.2.16 కోట్లు పెండింగ్
నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వానికి వినతి
అచ్యుతాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సముద్రంలో చేపల వేట నిషేధానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు పరిహారం అందలేదని జిల్లాలోని పలు మండలాల మత్స్యకారులు వాపోతున్నారు. మరబోట్ల ద్వారా సముద్రంలో వేట సాగించే రెండు వేల పైచిలుకు మంది మత్స్యకారులకు పది వేల రూపాయల చొప్పున రెండు కోట్ల రూపాయల మేర అందాల్సి వుంది.
మత్స్య సంపద పునరుత్పత్తి సమయంలో ఏటా ఏప్రిల్ 16వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఇది చాలా ఏళ్ల నుంచి అమలవుతున్నది. ఈ సమయంలో మత్స్యకారులకు జీవనోపాధి వుండదు. వీరికి చేపల వేట మినహా మరో పనిచేయడం తెలియదు. దీంతో తమను ఆర్థికంగా ఆదుకోవాలన్న మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు 1996లో అప్పటి టీడీపీ ఒక్కో మత్స్యకారునికి రూ.2 వేల చొప్పున పరిహారం అందజేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతి అందుతున్నది. కాలక్రమేణా ప్రభుత్వం భృతిని పెంచుతుండడంతో గత ఏడాది రూ.10 వేలకు చేరింది. ఏటా సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలోనే మత్స్యశాఖ వద్ద నమోదైన వివరాల మేరకు ఆర్థిక సాయం అందజేసేది. అయితే గత ఏడాది చేపల వేట నిషేధ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో వుండడంతో మత్స్యకారులకు పరిహారం (భృతి) అందలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు.
అనకాపల్లి జిల్లా పరిధిలో 27 మత్స్యకార గ్రామాల్లో 2,168 మంది మత్స్యకారులు చేపల వేట నిషేధ భృతికి అర్హులను గత ఏడాది ఏప్రిల్‌లో జిల్లా మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. పూడిమడకలో 328 బోట్లు, బంగారమ్మ పాలెంలో 209, రాజయ్యపేట, బోయపాలెంలలో 209, రేవుపోలవరంలో 168, ముత్యాలమ్మపాలెంలో 125, వెంకటనగరం, రాజానగరంలలో 137, కొత్తపట్నంలో 111 బోట్లకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలి. ఇంకా వాడనర్సాపురంలో 99 మంది, పాల్మన్‌పేటలో 89, కొర్లయ్యపాలెంలో 77, బంగారమ్మపాలెంలో 79, డీఎల్ పురంలో 68, గజపతినగరంలో 63, పెదతీనార్లలో 46 మంది మత్స్యకారులకు కూడాభృతి అందాల్సి వుంది. మొత్తం రూ.2.16 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉందని మత్స్యకార నేతలు చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు వరకు సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల ప్రభావంతో రోజుల తరబడి చేపల వేటకు వెళ్లలేకపోయామని, దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. మరో రెండున్నర నెలల్లో చేపల వేటపై నిషేధం అమల్లోకి వస్తుందని, గత ఏడాది నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారం సొమ్మును కనీసం ఇప్పటికైనా విడుదల చేయాలని కోరుతున్నారు. అంతేకాక గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది చేపల వేటపై నిషేధ కాలంలో ఒక్కో మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున భృతి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.