ఉక్కులో వీఆర్‌ఎస్!
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:03 AM
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్) స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్-వీఆర్‌ఎస్) శనివారం ప్రకటించింది.

నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవలసిందిగా యాజమాన్యం ప్రకటన
మార్చి నాటికి వేయి మందిని తగ్గించాలని నిర్ణయం
కనీసం 15 ఏళ్ల సర్వీస్, 45 ఏళ్ల వయసు కలిగిన వారికి అవకాశం
విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్) స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్-వీఆర్‌ఎస్) శనివారం ప్రకటించింది. ఇంకా ఏడాది సర్వీసు మిగిలి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకుంటే మార్చి నెలాఖరులోగా సెటిల్‌మెంట్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్‌లు 500, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 500 మంది కలిపి మొత్తం వేయి మందికి తొలి విడత వీఆర్‌ఎస్ ఇస్తారు. కాంట్రాక్టు, డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, క్యాజువల్ కార్మికులు, స్టడీ లీవులో ఉన్నవారు దీనికి అనర్హులు. అయితే దరఖాస్తు చేసుకునేవారికి కనీసం 15 ఏళ్లు సర్వీసు (సీనియారిటీ), 45 ఏళ్ల వయసు ఉండాలని నిబంధన పెట్టింది.
ఏమి ఇస్తారంటే...?
వీఆర్‌ఎస్ తీసుకునే వారికి బేసిక్ పే, కరవు భత్యం ఇస్తారు. దీనిని సర్వీసును బట్టి లెక్కిస్తారు. పూర్తిచేసిన ప్రతి ఏడాది సర్వీస్‌కు 35 రోజుల జీతం ఇస్తారు. మిగిలిన సర్వీస్‌లో ఏడాదికి 25 రోజుల జీతం ఇస్తారు. ఇలా ప్రయోజనం పొందే రోజులు 250కి మించకుండా ఉంటాయి. వీటితో పాటు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పదవీ విరమణ ప్రయోజనాలు అన్నీ ఇస్తారు.
ఉద్యోగుల సంఖ్య ఎలా తగ్గుతుందంటే...
సంస్థ ప్రయోజనాల కోసమే వీఆర్‌ఎస్ అమలు చేస్తున్నామని యాజమాన్యం పేర్కొంది. మానవ వనరులు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, ఉత్పాదకత పెంపు కోసమే ఈ చర్యలు చేపడుతున్నామని వివరించింది. ప్రస్తుతం స్టీల్‌ప్లాంటులో 12,400 మంది ఉద్యోగులు ఉన్నారు. దీనిని పది వేల లోపునకు తేవాలనే లక్ష్యంతో యాజమాన్యం చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది అంటే 2025లో డిసెంబరు నెలాఖరుకు 1,218 మంది పదవీ విరమణ చేస్తారు. ఇప్పుడు వీఆర్‌ఎస్‌తో వేయి మంది తగ్గిపోతారు. స్పందన అధికంగా ఉంటే...మరోసారి ప్రకటన ఇచ్చి మరికొంత మందిని తగ్గించే అవకాశం ఉంది.
వెళ్లిపోవాలనే ఆలోచనలో అత్యధికులు
విశాఖ స్టీల్‌ప్లాంటు చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్లాంటును పూర్తిస్థాయిలో నడపడానికి అవసరమైన నిధులు లేవు. ముడి పదార్థాల కొరత ఉంది. కేంద్రం సాయం చేస్తామని మాటలు మాత్రమే చెబుతోంది. కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. మొన్న దసరా, దీపావళి పండుగలకు జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇవ్వలేదు. ఎప్పుడో ఇస్తారో కూడా చెప్పడం లేదు. అంటే యాజమాన్యానికి జీతాలు సక్రమంగా ఆలోచన లేదని ఉద్యోగులకు అర్థమైంది. మరోవైపు కాంట్రాక్టు కార్మికులను భారీగా తగ్గించడంతో అనేక విభాగాల్లో నిర్వహణ పనులు ఆగిపోయాయి. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. తక్కువ వనరులతో పూర్తి ఉత్పత్తి తీయాలని ఒత్తిడి పెడుతున్నారు. అలా చేసినా జీతాలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేయడం కంటే ఎంత ఇస్తే అంత తీసుకొని బయటకు వెళ్లిపోవడమే మంచిదని అత్యధికులు భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కుటుంబాలను పోషించుకోవడానికి రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు.
వీఆర్‌ఎస్ ప్రకటన విరమించుకోవాలి
పోరాట కమిటీ నాయకులు డిమాండ్
ఉద్యోగులు వీఆర్‌ఎస్ తీసుకోవద్దని పిలుపు
ఉక్కుటౌన్‌షిప్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించే కార్యక్రమంలో భాగంగానే వీఆర్‌ఎస్ ప్రకటన వెలువడిందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆరోపించారు. సీఐటీయూ కార్యాలయంలో శనివారం రాత్రి జరిగిన కమిటీ సమావేశంలో పలువురు మాట్లాడుతూ వీఆర్‌ఎస్ పేరుతో ఉద్యోగులను భయపెట్టి బయటకు పంపాలని యాజమాన్యం చూస్తోందని, ఇది క్రూరమైన చర్య అన్నారు. స్టీల్‌ప్లాంటులో ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 2023లో పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటన చేశారని, తరువాత కాలంలో మరో రెండు వేల మంది పదవీ విరమణ చేశారని...మొత్తం ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న సమయంలో వీఆర్‌ఎస్ ప్రకటన చేయడం దుర్మార్గమన్నారు. వీఆర్‌ఎస్ తీసుకోవద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, పీవీ రమణమూర్తి, బీఎన్ రాజు, వరసాల శ్రీనివాసరావు, వి.ప్రసాద్, సురేష్‌బాబు, కామేశ్వరరావు పాల్గొన్నారు.