త్వరలోనే వైజాగ్ క్రూయిజర్
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:12 AM
విశాఖపట్నంలో స్థానికంగా క్రూయిజ్ టూరిజం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
‘గిల్ మెరైన్స్’ సంస్థ సన్నాహాలు
పోర్టు అనుమతించగానే ప్రారంభం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో స్థానికంగా క్రూయిజ్ టూరిజం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగి, విశాఖపట్నం పోర్టు అనుమతులు ఇస్తే రెండు నెలల్లోనే ఫిషింగ్ హార్బర్ నుంచి రోజూ లోకల్ క్రూయిజర్ అందుబాటులో ఉంటుంది.
పట్టుదలతో...
నాలుగేళ్ల క్రితం తుఫాన్ గాలులకు పోర్టు యాంకరేజ్ నుంచి తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక ఎంవీ మాను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చేందుకు ఆ రంగంలో అనుభవం ఉన్న ‘గిల్ మెరైన్స్’ సంస్థ ముందుకువచ్చింది. ఆ నౌకను యాజమాన్యం నుంచి కొనుగోలు చేసి ఏపీటీడీసీతో కలిసి రెస్టారెంట్‌గా మార్చేందుకు కృషిచేస్తోంది. దీనికి ఏపీసీజెడ్‌ఎంఏ నుంచి అనుమతులు రావలసి ఉంది. అటు ఆ ప్రయత్నం చేస్తూనే మరోవైపు విశాఖలో క్రూయిజ్ టూరిజం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ‘ఎంవీ సాయి వైష్ణవి’ పేరుతో ఓ క్రూయిజర్‌ను సమకూర్చుకుంది. రెండు ఇంజన్లతో పనిచేసే ఈ చిన్నపాటి నౌకను డబుల్ డెక్‌తో సుమారు 100 మందికి సరిపడేలా రూపొందించారు. అప్పుడప్పుడు ఇందులో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ నుంచి పది కిలోమీటర్ల వరకు సముద్రం లోపలకు, ఇక్కడి నుంచి తెన్నేటి పార్కు వద్ద బంగ్లాదేశ్ నౌక వరకు వెళ్లి వస్తున్నారు. ఏపీటీడీసీతో కలిసి జాయింట్ వెంచర్ కింద ‘వైజాగ్ క్రూయిజర్’ పేరుతో దీనిని నడపాలని విశాఖపట్నం పోర్టు యాజమాన్యానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. అది పోర్టు అధికారుల పరిశీలనలో ఉంది.
అన్ని వర్గాలకు అందుబాటులో
సురేందర్‌సింగ్, గిల్ మెరైన్స్ యజమాని
వైజాగ్ క్రూయిజర్‌ని అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాము. పుట్టినరోజు వేడుకలు, ఫ్రెండ్స్ పార్టీలు, పెళ్లిరోజు వేడుకలు చేసుకోవడానికి డెక్ పార్టీలు ఏర్పాటుచేస్తాము. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విడివిడిగా ప్యాకేజీలు పెట్టి బృందాలుగా సముద్రంలోకి తీసుకువెళతాము. క్రూయిజర్‌లోనే ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి. ఏ ప్యాకేజీ కావాలంటే అది ఎంచుకోవచ్చు. అనుమతులు రాగానే ప్యాకేజీల వివరాలు ప్రకటిస్తాం.
---------------------------------------------------------------------------------------
1న ఏయూ వీసీగా
రాజశేఖర్ బాధ్యతల స్వీకరణ?
విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులైన ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ వచ్చే నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. ఖరగ్‌పూర్ ఐఐటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్న జీపీ రాజశేఖర్‌ను వీసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఆయన సాంకేతికంగా బాధ్యతల్లో ఉన్నట్టు పరిగణస్తారు. అయితే, అధికారికంగా మాత్రం శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. వర్సిటీ వర్గాలు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.